iDreamPost
android-app
ios-app

ఏపీకి కృష్ణమ్మ ఆశీర్వాదం

ఏపీకి కృష్ణమ్మ ఆశీర్వాదం

రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందంటారు. పంచ భూతాలు సహకరిస్తాయని పెద్దలు చెప్పే మాట. పెద్దల మాట సద్దెన్నం మూట అన్నట్లు.. వారి మాటలు అక్షర సత్యమనేలా ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జరిగిన మార్పులు సూచిస్తున్నాయి. వరుసగా రెండో ఏడాది వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. ప్రాజెక్టులు నిండుతున్నాయి.

ఏపీలో కోస్తాలో గోదావరి, కృష్ణా, సీమలో పెన్నా, ఉత్తరాంధ్రలో వంశధార తదితర నదులు ఉన్నా.. గోదావరి, కృష్ణా నదుల పరిధిలో సాగుభూమి అధికంగా ఉంది. గోదావరి నదిపై ప్రాజెక్టులు లేకపోయినా.. ధవళేశ్వరం వద్ద నిర్మించిన బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ వల్ల ఉభయగోదావరి జిల్లాలు సస్యశ్యామలమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గోదావరి నదిపై ఏపీలో తొలి ప్రాజెక్టు ఇదే అవుతుంది.

ఇక కృష్ణా నదిపైనే ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు కృష్ణ నది జలాలను ఒడిసిపట్టుకునేందుకు నిర్మించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో కురిసే వర్షాలపై కృష్ణా నది ప్రవాహం ఆధారపడి ఉంది. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా నిండిన తర్వాత కృష్ణమ్మ శ్రీశైలం ద్వారా ఏపీలోకి ప్రవేశిస్తుంది.

చంద్రబాబు ప్రభుత్వ ఐదేళ్లలో కృష్ణమ్మపై ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఎన్నడూ నిండలేదు. ఫలితంగా కృష్ణా డెల్టాలోని అన్నదాతలు పొలాలను బీడు పెట్టుకున్నారు. నదీ ప్రవాహాలతోపాటు వరుణదేవుడు కూడా చంద్రబాబు హాయంలో మొహం చాటేసాడు. సహజనది అయిన గోదావరి డెల్టా మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాలు కరువుతో అల్లాడిపోయాయి. సీమ, నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బంది పడ్డారు.

2019 మే 30వ తేదీన సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అప్పటి వరకు మొహం చాటేసిన వరుణుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. సరైన సమయంలో వర్షాలు పడుతున్నాయి. బాబు ఐదేళ్లలో ఎన్నడూ కనీసం సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. అలాంటిది గత ఏడాది, ఈ ఏడాది.. వరుసగా రాష్ట్రంలో సాధారణంగా కన్నా అధికంగా వర్షపాతం నమోదైంది.

గోదావరి, కృష్ణాతో సహా వివిధ నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల ఆయా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా నదిపై ఏపీలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. 1.20 టీఎంసీల సామర్థ్యం గల సుంకేసుల జలాశయానికి ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం 43,275 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తంలో దిగువకు విడుదల చేస్తున్నారు. ( 11,574 క్యూసెక్కులు 24 గంటలపాటు ప్రవహిస్తే ఒక టీఎంసీతో సమానం)

శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా.. ఈ రోజు మధ్యాహ్నం నాటికి డ్యాంలో 206 టీఎంసీల జలాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3,83,659 క్యూసెక్కుల వరద వస్తుండగా 4,57, 878 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా… ప్రస్తుతం ప్రాజెక్టులో 285.32 టీఎంసీలు ఉన్నాయి. ఎగువ నుంచి 3,50,102 క్యూసెక్కుల మేర వరద జలాలు వస్తుండగా.. అధిక శాతం ప్రాజెక్టును నింపేందుకు నిలుపుతున్నారు. కేవలం 29,880 క్యూసెక్కుల జలాలు మాత్రమే దిగువకు విడుదల చేస్తున్నారు.

పులి చింతల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో 23.37 టీఎసీలు ఉన్నాయి. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 1,64,543 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మొత్తం ప్రాజెక్టులోనే అంటిపెట్టి ఉంచుతున్నారు. నిండుకుండలా ఉన్న 3.07 టీఎసీల సామర్థ్యం గల ప్రకాశం బ్యారేజీ కి 86,750 క్యూసెక్కుల వరద వస్తుండగా 85,750 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. 1000 క్యూసెక్కుల నీరు పంట కాలువలకు పంపుతున్నారు.