Idream media
Idream media
పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత రేవంత్ రెడ్డి తన దూకుడుతో తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నారు. ప్రధాన ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌పై, ఆ పార్టీ ముఖ్యనేతలపై విమర్శలు, కౌంటర్లు వేస్తున్నారు. పార్టీ ఫిరాయింపులపై రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల మధ్య మాటల తూటాలు పేలాయి. తాజాగా రేవంత్ రెడ్డి మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బతికి ఉన్నంత వరకూ కేటీఆర్ సీఎం కాలేడని వ్యాఖ్యానించారు. 2022 ఆగస్టులో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు రేవంత్ రెడ్డి.
సీఎం పదవి ద్వారా అగ్గి రాజేయాలనేనా..?
తెలంగాణ సీఎంగా కేటీఆర్ బాధ్యతలు చేపడతారనే చర్చ ఇటీవల సీరియస్‌గా సాగింది. బహిరంగంగానే ఆ పార్టీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని, ఆ పదవికి అర్హుడంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ఈటల రాజేందర్ లాంటి వారు వ్యతిరేకించారనే వార్తలు వచ్చాయి. అవి కాస్త చినికి చినికి గాలివానగా మారి.. టీఆర్‌ఎస్‌లో విభేదాలు తలెత్తాయి. ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్.. సీఎంగా బాధ్యలు చేపట్టాలనే చర్చకు విరామం వచ్చింది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను దువ్వుతున్నారు. కేసీఆర్ బతికి ఉన్నంత వరకు కేటీఆర్ సీఎం కాలేడంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. తద్వారా కేటీఆర్ సీఎం పదవి కోసం తండ్రి వద్ద బెట్టు చేస్తాడని రేవంత్ ఆశించినట్లుగా ఉన్నారు. అదే జరిగితే.. సీఎం పదవిపై మరోసారి టీఆర్‌ఎస్‌లో విభేదాలు తలెత్తుతాయని, ఆ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది.
ముందస్తు ఎన్నికలు జరుగుతాయా..?
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని కూడా రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. 2023 డిసెంబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అసెంబ్లీని ముందుగానే కేసీఆర్ రద్దు చేస్తారని రేవంత్ అంచనా వేశారు. వచ్చే ఏడాది ఆగస్టు నాటికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. ఆ తర్వాత కేసీఆర్ ఎన్నికలకు వెళతారంటున్నారు. కేసీఆర్ గత నిర్ణయాల ఆధారంగా రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. నాలుగున్నరేళ్లకే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. 2019 ఏప్రిల్–మే నెలల్లో జరగాల్సిన ఎన్నికలు.. అసెంబ్లీ రద్దు వల్ల 2018 డిసెంబర్‌లో జరిగాయి. మునుపటి కన్నా ఈ సారి కేసీఆర్ మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే లక్ష్యంతో.. ఈ సారి కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారనే.. అంచనా రేవంత్ వేసినట్లున్నారు. అయితే 16 నెలల ముందే అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేస్తారా..? అనేది సందేహమే.
Also Read : రేవంత్ దూకుడు : జడ్పీటీసీ నుంచి టీపీసీసీ వరకు..