Idream media
Idream media
దేశంలోని ప్రధాన పత్రికలన్నీ (ముఖ్యంగా ముంబై పత్రికలు) ఒక హీరోని, విలన్‌ని 3 రోజుల క్రితం గుర్తు చేసుకున్నాయి. హీరో పేరు అలెక్స్ ఫియాలో, విలన్ పేరు రామన్ రాఘవ్.
1966 నుంచి 68 వరకూ బొంబాయి నగరాన్ని నిద్రపోకుండా చేసిన సీరియల్ కిల్లర్ రామన్ రాఘవ్. అతన్ని గుర్తు పట్టి అరెస్ట్ చేసిన అధికారి అలెక్స్ ఫియాలో. రాఘవ్ చనిపోయి చాలా కాలమైంది. అలెక్స్ గత శుక్రవారం 92 ఏళ్ల వయసులో చనిపోయాడు. SIగా డిపార్ట్‌మెంట్‌లో చేరిన అలెక్స్ ACPగా రిటైరయ్యారు.
డోంగ్రీ స్టేషన్‌లో SIగా చేస్తున్న అలెక్స్, సీరియల్ కిల్లర్‌ని అరెస్ట్ చేయడానికి రెండేళ్లు శ్రమించాడు. 1968లో బేండీ బజారులో ఒక వ్యక్తి తడిసిన గొడుగుతో వెళుతున్నాడు. వర్షం లేని సమయంలో గొడుగుతో, అది కూడా తడిసిన గొడుగుతో వుండడం అలెక్స్‌కి ఆశ్చర్యంగా అనిపించి ఆపాడు. అతనే రామన్ రాఘవ్.
రాఘవ్ సైకో కిల్లర్. ముఖ్యంగా పేవ్‌మెంట్స్‌పై నిద్రపోతున్న పేదవాళ్లని ఇనుప రాడ్‌తో తలమీద కొట్టి చంపేవాడు. 3 సంవత్సరాల్లో 41 మందిని చంపాడు. బొంబాయి వణికిపోయింది. రాత్రిళ్లు జనం నిద్రపోకుండా కర్రలతో కాపలా కాశారు. ఎంతో మంది అమాయకుల్ని కిల్లర్‌గా అనుమానించి చావబాదారు.
పోలీసులు గస్తీ బృందాలుగా రేయింబవళ్లు తిరిగారు. అంత పెద్ద బొంబాయిలో ఎక్కడ హత్య జరుగుతుందో తెలియదు. చివరికి రాఘవ్‌ని అరెస్ట్ చేశారు. అతన్ని రకరకాలుగా ప్రశ్నించారు. నోరు విప్పలేదు. కోడి కూరతో భోజనం పెడితే చెబుతానన్నాడు.
పోలీసులకి కోపమొచ్చి తన్నారు. చివరికి రాజీపడి కోడికూర వడ్డించారు. తిన్న తర్వాత ఒక పాన్ నమిలి 41 హత్యలు తానే చేశానని ఒప్పుకున్నాడు. అతని మానసిక స్థితిపై కోర్టు ఒక కమిటీ వేసింది. డాక్టర్ల ముందు రాఘవ్ విచిత్రంగా మాట్లాడాడు.
తానే చట్టమని, ఒక శక్తి అని అన్నాడు.
ఈ హత్యల్ని ప్రభుత్వమే తనతో చేయించిందని చెప్పాడు.
ఈ దేశంలో అక్బర్ ప్రభుత్వం , బ్రిటిష్ రాజ్యం , కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయని చెప్పాడు.
మానసిక స్థితి వల్ల అతన్ని వురి తీయకుండా జైల్లో వుంచారు.
1995లో కిడ్నీ పెయిల్యూర్‌తో చనిపోయాడు.
రాఘవ్ కథ ఆధారంగా ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కేలేదు.
అతన్ని పట్టుకున్న అలెక్స్‌కి రాష్ట్రపతి పతకం లభించింది. ఎన్నో కేసుల్ని పరిష్కరించిన అలెక్స్‌కి ముంబై పోలీసుల్లో విపరీతమైన గౌరవం, గుర్తింపు వుంది. ఆ రోజుల్లో 1000 రూపాయల అవార్డ్ కూడా అందుకున్నారు.అప్పటి పత్రికలు అలెక్స్ గురించి ఎన్నో కథనాలు రాశాయి. వృద్ధాప్యంలో కూడా అలెక్స్ ఉత్సాహంగా వుండేవారు. వృత్తిలో ఆయన చేసిన కృషి పోలీసులకి ఒక పాఠ్య పుస్తకం.