iDreamPost
iDreamPost
కెరీర్ మొత్తంలో నటించింది రెండే సినిమాలే అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ కున్న గుర్తింపు చిన్నదేమీ కాదు. బద్రి, జానీలలో తన నటనతో మెప్పించి ఒప్పించిన తర్వాత పూర్తిగా వ్యక్తిగత జీవితానికే అంకితమై ఇద్దరు పిల్లలకు తల్లై వాళ్ళు పెద్దయ్యాక మళ్ళీ క్రియేటివ్ ఫీల్డ్ వైపు దృష్టి సారిస్తున్నారు. పవన్ తో విడాకులు గతంగా మారిపోయింది. ఇక వర్తమానంలో ఏం చేయాలనే దాని మీద గట్టి ప్లాన్సే ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్టు కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రకటించిన రేణు దేశాయ్ అందులో తన మీదే కథ నడిచే కీలక పాత్ర చేస్తోందట. టైటిల్ గా ‘ఆద్యా’ ని ఎంపిక చేసినట్టు సమాచారం.
ఇది స్వయానా కూతురి పేరే గమనార్హం. ఒక నిజాన్ని వెతికే క్రమంలో ఓ కంపెనీ మహిళా సిఈఓ చేసే పోరాటమే ఇతివృత్తంగా ఉంటుందని వినికిడి. ఆ మధ్య డిస్నీ హాట్ స్టార్ లో సుస్మితా సేన్ నటించిన ఆర్యా వెబ్ సిరీస్ మంచి ఆదరణ దక్కించుకుంది. ఇది కూడా అదే తరహాలో ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. పేరులో కూడా సారూప్యత కనిపిస్తోంది. దీనికి కృష్ణ మామిదాల దర్శకుడిగా వ్యవహరించబోతున్నారు. షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలు కాబోతోంది. అయితే ఏ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ మీద వస్తుందన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇటీవలి కాలంలో హిందీతో పాటు తెలుగులోనూ వెబ్ సిరీస్ లకు వ్యూయర్స్ పెరుగుతున్నారు. నోటెడ్ యాక్టర్స్ ఉంటే రెస్పాన్స్ వేగంగా ఉంటుంది.
జగపతిబాబు గ్యాంగ్ స్టార్స్, సత్య దేవ్ లాక్డ్ లాంటివి ఈ క్యాటగిరీలో వచ్చినవే. రేణు దేశాయ్ తో పాటు పెద్ద క్యాస్టింగ్ నే ఇందులో సెట్ చేయబోతున్నట్టు తెలిసింది. త్వరలో అధికారికంగా వివరాలు వెల్లడవుతాయి. ఆ మధ్య రియాలిటీ షోలకు జడ్జ్ గా వ్యవహరించిన రేణు దేశాయ్ ఇప్పుడు బుల్లితెరపై ఆపై క్రమంగా వెండితెర వైపు వచ్చే అవకాశాలు లేకపోలేదు. పవన్ అభిమానులు మాత్రం అకీరానందన్ తెరంగేట్రం ఎప్పుడు ఉంటుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ ప్లానింగ్ కూడా రేణు చేస్తున్నట్టు ఇన్ సైడ్ న్యూస్. మొత్తానికి లేట్ గా అయినా ట్రెండ్ కు తగ్గట్టు లేటెస్ట్ గానే రేణు దేశాయ్ తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. 2014లోనే ఇష్క్ వాలా లవ్ అనే మరాఠి సినిమాతో డైరెక్టర్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో కూడా అలాంటి ఆలోచనలు చేసే అవకాశాలు లేకపోలేదు.