iDreamPost
android-app
ios-app

ఎన్డీయే ప్ర‌వేశ‌పెట్టిన‌ వ్యవసాయ బిల్లులలో ఏముంది..? మ‌ంత్రి రాజీనామాకు అస‌లు కార‌ణాలేంటి..?

ఎన్డీయే ప్ర‌వేశ‌పెట్టిన‌ వ్యవసాయ బిల్లులలో ఏముంది..? మ‌ంత్రి రాజీనామాకు అస‌లు కార‌ణాలేంటి..?

కొత్త వ్య‌వ‌సాయ బిల్లుల‌తో కేంద్రంలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే కాకుండా.. ఆ పార్టీ ఎంపీ హర్‌సిమ్రత్‌ కౌర్‌ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు. అకాలీదళ్ దారిలోనే మరికొన్ని ఉత్తరాది పార్టీలు నడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హర్యానాలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ) ఎన్డీయే నుంచి వైదొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుగులేకుండా దూసుకుపోతున్న ఎన్టీయే ప్ర‌భుత్వానికి ఈ ప‌రిణామాలు కాసింత షాక్ క‌లిగించేవే. ఈ నేప‌థ్యంలో అస‌లు పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌వ‌సాయ బిల్లులపై ఎందుకంత రాద్దాంతం జ‌రుగుతోంది..? రైతులు ఎందుకు ఆందోళ‌న బాట ప‌డుతున్నారు.? ఆ బిల్లుల‌పై విపక్షాలు, రైతు సంఘాల అభ్యంతరాలేంటి? అన్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

భారీ సంస్క‌ర‌ణ‌లంటున్న బీజేపీ..

నూత‌నంగా తీసుకొచ్చిన బిల్లులతో వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలు చేపట్టినట్లవుతుందని బీజేపీ చెబుతోంది. రైతుల‌కు సంబంధించి మొత్తం మూడు బిల్లులు లోక్ స‌భ‌లో ఆమోదం పొందాయి. అవేమిటంటే.. నిత్యావ‌స‌ర సరకుల(సవరణ) బిల్లు, ‘రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహక, సులభతర) బిల్లు, ‘రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు. వీటిలో నిత్యావ‌స‌ర సరకుల సవరణ బిల్లు ద్వారా వ్యవసాయరంగంలో పోటీ, రైతుల ఆదాయం పెంచడానికి అవ‌కాశం ఉంటుంద‌ని కేంద్రం చెబుతోంది. వినియోగదారుల ప్రయోజనాలు రక్షిస్తూనే నిత్యవసరాలపై నియంత్రణ వ్యవస్థను సరళీకరించడం దీని ఉద్దేశమని ఆర్డినెన్సులో పేర్కొంది. అలాగే యుద్ధం, దుర్భిక్షం, ధరలు విపరీతంగా పెరిగిపోవడం, ప్రకృతి విపత్తులు వంటి అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు తృణధాన్యాలు, పప్పులు, బంగాళాదుంపలు, ఉల్లి, నూనెగింజలు, నూనెలు వంటి నిత్యావ‌స‌రాల‌పై నియంత్ర‌ణ సాధించ‌డం ద్వారా ఇబ్బందులు త‌లెత్త‌కుండా చూసే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతోంది. దీంతోపాటు అక్ర‌మ నిల్వ‌లు అరిక‌ట్ట‌డం ద్వారా ధ‌ర‌లను నియంత్రించ‌వ‌చ్చున‌ని వెల్ల‌డిస్తోంది. సరిహద్దులతో సంబంధం లేకుండా దేశంలో వేర్వేరు రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల్లో జిల్లాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి అవ‌కాశం క‌ల్పించ‌డం మ‌రో బిల్లు ఉద్దేశం.

మ‌రి విప‌క్షాల అభ్యంత‌ర‌మేంటి..?

లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లుల‌ను విపక్షాల సహా ఆ పార్టీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ వ్య‌తిరేకిస్తోంది. మ‌రికొన్ని పార్టీలు కూడా అదే దారిలో న‌డ‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి వీరు చెబుతున్న కార‌ణాలేమిటంటే.. ఈ బిల్లులు ఆమోదం పొంది చట్టరూపం దాల్చితే చిన్న, సన్నకారు రైతులు చితికిపోతారని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్, తృణ‌మూల్ కాంగ్రెస్, డీఎంకె, బీఎస్పీ స‌హా కొన్ని పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకించాయి. వీటిపై ప్ర‌ధానంగా పంజాబ్, హ‌ర్యాణాల‌లో నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. అది రాజ‌కీయంగా త‌మ పార్టీకి న‌ష్టం చేకూరుస్తుంద‌ని అకాలీద‌ళ్ భావిస్తోంది. కేంద్ర ప్ర‌యోజ‌నాల‌క‌న్నా.. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌నే ఎక్కువ‌గా ఆశించి ఆ పార్టీ ఈ బిల్లును వ్య‌తిరేకించింది. ఇదే కాకుండా 2022 ఆరంభంలో పంజాబ్ ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలో రైతుల ఆగ్ర‌హానికి గురైతే మంచిదికాద‌నే భావ‌న‌లో ఆ పార్టీ ఉంది.

రైతు సంఘాలు ఏమంటున్నాయి..?

సంస్కరణల పేరుతో దేశంలోకి తీసుకురానున్న చ‌ట్టాలు రైతుల‌తో పాటు, వినియోగ‌దారుల‌కు కూడా న‌ష్టమే చేస్తాయ‌ని కొంద‌రి రైతు సంఘాల నేత‌ల వాద‌న‌. ఇప్ప‌టి వ‌ర‌కు వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ రాష్ట్రాల పరిధిలో ఉండేది. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో దిగుబడులు తగ్గిన‌ప్పుడు ఆయా రాష్ట్రాల ప‌రిధి మేరకే ఉత్ప‌త్తులు స‌రిపోతాయ‌ని భావిస్తే.. వాటిని సరిహద్దులు దాటకుండా నియంత్రించే వెసులుబాటు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఉంది. కొత్త చట్టాలతో ఇక ఆ అవకాశం ఉండ‌ద‌ని వారు చెబుతున్నారు. దేశంలో ఎక్క‌డైనా అమ్ముకోవ‌చ్చు అనే అవ‌కాశం కార్పొరేట్ సంస్థ‌ల‌కు, ఏజెంట్ల‌కు త‌ప్పా.. రైతులు ఉప‌యోగించుకోలేర‌ని అంటున్నారు. దీని వ‌ల్ల రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతార‌ని, వినియోగ‌దారుల‌పైనా భారం ప‌డుతుంద‌నేది వారి వాద‌న‌. అలాగే ధ‌ర‌ల‌పై కూడా రైతులు హ‌క్కు కోల్పోతార‌ని చెబుతున్నారు. ఇలా మొత్తంమ్మీద వ్య‌వ‌సాయ బిల్లుల‌పై జ‌రుగుతున్న ఈ వాదోప‌వాదాలు, నిర‌స‌నలు దేశ రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.