iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై ఇటీవల విపక్షాలు నానా హంగామా చేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే జగన్ ప్రభుత్వం మీద నిందలు వేసేందుకు ప్రయత్నిస్తోంది. లెక్కకు మించి అప్పులు చేస్తున్నారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపేశారని కూడా యనమల వంటి వాళ్లు వ్యాఖ్యలు చేస్తుండడం విశేషంగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు గద్దె దిగే నాటికి ఏపీ ఖజానాలో ఉద్యోగులకు వేతనాలివ్వడానికి కూడా పైసల్లేవు. అప్పట్లో ఈ విషయం కూడా ఈనాడు పత్రికనే బయటపెట్టింది. అంతేగాకుండా ఏపీకి ఉన్న శక్తిమేరకు తాము అప్పులు చేసేశామని, ఇక అప్పులు కూడా పుట్టే పరిస్థితి లేదని నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా అన్నారు. అంటే జీతాలివ్వడానికి కూడా లేకుండా ఖాళీ ఖజానా ఇచ్చి, అప్పులు చేయడానికి వీలులేకుండా నిబంధనలకు మించి అప్పులు చేసేసి ఇప్పుడు మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మీద మాత్రం దుష్ప్రచారానికి వెనుకాడడం లేదని ఈ వ్యవహారం చాటిచెబుతోంది.
ఇక తాజాగా ఈనాడు వెలుగులోకి తెచ్చిన మరో అంశం గమనిస్తే చంద్రబాబు సర్కారు వ్యవహరించిన వైనం బోధపడుతుంది. గత ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చి ఎంత కవర్ చేద్దామని ప్రయత్నించినా పాపం ఈనాడులోనే 2016 నుంచి జరిగిన భాగోతం బయటపెట్టక తప్పని దుస్థితి. ఇక వారిచ్చిన సమాచారం ప్రకారం ఏపీ, తెలంగాణా రాష్ట్రాల ఉమ్మడి శక్తిని చూపించి చంద్రబాబు అప్పులు చేసినట్టు రూఢీ అవుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పులను చూపించి, వాటిని తిరిగి చెల్లించే పేరుతో భారీగా రుణాలు తీసుకున్నట్టు బయటపడింది. రూ 15,025 కోట్లను అదనంగా తీసుకున్నట్టు లెక్కలు చూపించింది. తెలంగాణా అప్పులు కూడా ఏపీ చెల్లించేలా, వాటిని తెలంగాణా ప్రభుత్వం రీయంబెర్స్ చేస్తున్నట్టుగా బయటపెట్టింది.
Also Read : టీడీపీ తీరు మారడం లేదు, అందుకే అన్నిసార్లు అలా దొరికిపోతున్నారు..
వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో అప్పులు, ఆస్తుల విభజన ఓమేరకు జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన అప్పులకు అనుగుణంగా కొత్త రుణాలు చేయాలి. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కలను పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వమే పాత అప్పులు చెల్లిస్తూ, తెలంగాణా నుంచి తిరిగి తీసుకునే విధానం చంద్రబాబు అవలంభించారు. దాంతో అదనంగా అప్పులు తీసుకునే అవకాశాన్ని వినియోగించుకున్నారు. ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా కేంద్రం నుంచి సహాయం తీసుకోవాల్సింది పోయి, ఆనాటి ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నప్పటికీ అప్పులపైనే ఆధారపడినట్టు అర్థమవుతోంది. ఆనాడు చేసిన అప్పులు తీర్చేందుకు నేటి ప్రభుత్వం కొత్తగా రుణాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఏటా సుమారుగా 40వేల కోట్లు అప్పులు చేస్తుంటే అందులో సగానికి పైగా పాత అప్పులకు వడ్డీలు చెల్లించడానికే సరిపోతోంది.
రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో దింపేసి, ఆర్థిక పరిస్థితి దివాళా తీయించేసి ఇప్పుడు జగన్ ప్రభుత్వం మీద టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు విడ్డూరంగా ఉంటున్నాయి. తాము చేసిందంతా చేసేసి ఇప్పుడు మాత్రం నీతులు చెప్పడానికి తగుదనమ్మా అంటూ టీడీపీ నేతలు తయారవుతున్న తీరు ఆశ్చర్యంగా కనిపిస్తోంది. రెండేళ్లలో ఏపీ ప్రభుత్వం అదనంగా అప్పులు చేయడానికి కరోనా పరిస్థితులు కూడా కారణమనే విషయం అందరికీ తెలుస్తోంది. కేవలం ఏపీ ప్రభుత్వం మాత్రమే గాకుండా బంగారు తెలంగాణా నుంచి మహారాష్ట్ర వరకూ చివరకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కూడా అప్పులపై ఆధారపడక తప్పడం లేదు. ఓవైపు ఆదాయం పడిపోవడం, మరోవైపు అదనంగా ఖర్చులు పెరగడంతో ఇప్పుడు అనేక ప్రభుత్వాలకు అప్పులే ఆధారం అవుతున్నాయి. అయినా జగన్ ప్రభుత్వాన్ని నిందించేందుకు, ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఓ వర్గం మీడియాతో కలిసి బాబు చేస్తున్న ప్రయత్నం తాజా వ్యవహారంతో కొత్త బయటపడిందనే చెప్పవచ్చు.
Also Read : రైతుల్ని రెచ్చగొట్టి వదిలేశారు!!