ఎంత మాస్ హీరో అయినా ఏదో ఒక దశలో కుటుంబ కథా చిత్రాలు చేయడం చాలా అవసరం. ఇవే ఫ్యామిలీ ఆడియన్స్ ని చిన్న పిల్లలను దగ్గర చేస్తాయి. నందమూరి తారకరామారావు నటవారసుడిగా ఇండస్ట్రీలో ప్రవేశించిన బాలకృష్ణకు ఇప్పుడు మనం చూస్తున్న ఇమేజ్ అంత సులభంగా వచ్చింది కాదు. మొదట్లో గట్టి ఫ్లాపులే పడ్డాయి. 14 చిత్రాల దాకా చెప్పుకోదగ్గ పెద్ద సక్సెస్ లేదు. నాన్నతో కలిసి చేసిన అన్నదమ్ముల అనుబంధం, దానవీరశూరకర్ణ, అనురాగ దేవత లాంటివి బాలయ్య సోలో హీరోగా నటించినవి కాదు. 15వ సినిమాగా వచ్చిన మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ రికార్డులు సాధించాక తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ వచ్చింది.
ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ పడలేదు. వరస విజయాలు వెన్నుతట్టి పలకరించాయి. ముద్దుల కృష్ణయ్య, సీతారామకల్యాణం, దేశోద్దారకుడు, అపూర్వ సహోదరులు, మువ్వగోపాలుడు లాంటి ఎన్నో హిట్లు మార్కెట్ ని అమాంతం పెంచేశాయి. ఆ టైంలో 1987లో చేసిన సినిమానే రాము. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాలయ్యకు అప్పటికే కథానాయకుడు రూపంలో ఒక హిట్ ఉంది. నాన్న టైటిల్ ని మరోసారి వాడుకుంటూ ఈసారి రాముకు శ్రీకారం చుట్టారు రామానాయుడు గారు. వై నాగేశ్వరరావు ని దర్శకుడిగా పరిచయం చేస్తూ గుహనాథన్ కథ అందించగా జంధ్యాల మాటలతో స్క్రిప్ట్ సిద్ధం చేయించారు.
రజని హీరోయిన్ గా శారద, జగ్గయ్య, సత్యనారాయణ, సుత్తివేలు. సుధాకర్, దీప, శ్రీలక్ష్మి తదితరులు ప్రధాన తారాగణంగా కేవలం మూడు నెలల లోపే మొత్తం షూటింగ్ పూర్తి చేశారు. గాయకులు ఎస్పి బాలసుబ్రమణ్యం దీనికి సంగీతం సమకూర్చడం విశేషం. పాటలు కూడా చక్కని ఆదరణ పొందాయి. ఓ లాయర్ కుటుంబంలో అనాథగా ప్రవేశించిన రాము వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. అయితే ఇతనంటే గిట్టని వకీలు పిల్లలు ద్వేషం పెంచుకుంటారు. ఆ తర్వాత కథ ఎన్నో మలుపులు తిరుగుతుంది. మంచి ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన రాము 1987 జూలై 31 విడుదలై దానికన్నా వారం ముందు రిలీజైన పసివాడి ప్రాణం సునామిని తట్టుకుని విజయం సాధించింది. మాస్ తో పాటు క్లాస్ ని బాలయ్యకు ఇంకా దగ్గర చేసింది.