ఏ హీరోకైనా ప్రయోగాలు చేసి తనలో ఉత్తమ నటుడిని బయటికి తీసుకురావాలనే తపన ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి తన స్వంత బడ్జెట్ తో తమ్ముడు నాగబాబు నిర్మాతగా ‘రుద్రవీణ’ తీసేందుకు ప్రేరేపించింది అదే. ఫలితాన్ని ముందే ఊహించి ఇతర నిర్మాతలను రిస్క్ లో పెట్టలేదు. దానికి అవార్డులు దక్కాయి కానీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ నే ఎదురుకుంది. నాగార్జున ఓన్ ప్రొడక్షన్ లో కాకపోయినా ఇలాంటి ప్రయత్నమే ‘సంకీర్తన’ రూపంలో చేసి ఫ్లాప్ ఎదురుకున్నారు. వెంకటేష్ ‘స్వర్ణకమలం’, బాలకృష్ణ ‘జనని జన్మభూమి’ కూడా ఇదే కోవలోకి వస్తాయి. కానీ వీటిలో వెంకీ సినిమా ఒక్కటే మంచివి విజయం సాధించింది.
కామెడీ సినిమాలతో హీరోగా తాకంటూ ఓ బ్రాండ్ ఏర్పరుచుకున్న రాజేంద్రప్రసాద్ కు సైతం ఇలాంటి ఆలోచన వచ్చిన సందర్భమది. తనతో పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్ళాం లాంటి చిరస్మరణీయ సినిమాలను అందించిన దర్శకుడు బాపుతో తనే నిర్మాతగా మారాలని రాజేంద్రప్రసాద్ చేసిన సాహసమే రాంబంటు. 1995వ సంవత్సరం. అది బాపు గారు ఫామ్ లో లేని సమయం. స్వర్గీయ ఎన్టీఆర్ చివరి దశలో చేసిన ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’ దారుణంగా దెబ్బ తింది. నరేష్ తో బాపు గారి పాత సినిమా ‘బంగారుపిచ్చుక’నే మళ్ళీ ‘పెళ్లికొడుకు’గా రీమేక్ చేస్తే ఇదీ ఆడలేదు. ఏఎన్ఆర్ ‘బుద్దిమంతుడు’ని హిందీలో ,మిథున్ చక్రవర్తితో ‘పరమాత్మ’గా చేస్తే సేమ్ రిజల్ట్.
అప్పుడు రూపొందిందే రాంబంటు. ఇప్పుడు మనం చూస్తున్న బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరి రావు ఈ సినిమాతోనే హీరోయిన్ గా తెరంగేట్రం చేశారు. కొండజాతికి చెందిన హీరో ఓ జమిందార్ దగ్గర నమ్మినబంటుగా పనిచేసే అమాయకుడు.ఆయన కూతురిని ప్రేమిస్తాడు. కానీ ఆ అమ్మాయి సవితి తల్లి సృష్టించిన కొన్ని అనూహ్య పరిస్థితుల వల్ల ఆమెను పెళ్లి చేసుకుని ఊరు వదిలి పట్నం వెళ్లి బాగా డబ్బు సంపాదిస్తాడు. తిరిగివచ్చి విలన్ కుట్ర వల్ల రోడ్డుమీదకొచ్చిన యజమానిని కాపాడి తన భక్తిని చాటుకుంటాడు. అప్పటి ఆడియన్స్ టేస్ట్ కి ఈ కథ ఎక్కలేదు. దానికి తోడు డ్రామా బాగా ఎక్కువ కావడంతో కీరవాణి మధురమైన సంగీతం కూడా వృథా అయిపోయింది. దెబ్బకు రాంబంటుకి పరాజయం తప్పలేదు. దీని వల్ల వచ్చిన నష్టాలు పూడ్చుకోవడానికి రాజేంద్రుడికి చాలా సమయం పట్టిందని అప్పట్లో చెప్పుకునేవారు.