iDreamPost
iDreamPost
తెలంగాణలోని యువ మంత్రుల్లో ఒకరైన రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కి పరిస్థితులు ఎదురు తిరుగుతున్నట్లున్నాయి. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ఈ అనుమానాలకు, వాదనలకు తావిస్తున్నాయి. పార్టీ పెద్దల వద్ద, తన పర్యవేక్షణలో ఉన్న ఆర్టీసీ వ్యవహారాల్లోనూ పట్టు తగ్గి ఆయన ఇబ్బందులు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా సొంత సామాజికవర్గంలోనూ పట్టు కోల్పోతున్న విషయం ఆ సంఘ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. అజయ్ సొంత సామాజికవర్గానికి చెందిన ఖమ్మం జిల్లా కమ్మ మహాజన సంఘం ఎన్నికల్లో ఆయన మద్దతు ఇచ్చిన బిక్కసాని ప్యానెల్ ఓటమి పాలవ్వడంతో మంత్రికి తలకొట్టేసినంత పనైంది. ఈ నేపథ్యంలోనే పువ్వాడ ప్రభ మసకబారుతోందన్న చర్చ తెరపైకి వచ్చింది.
అధికార దుర్వినియోగం ఆరోపణలు
కమ్మ మహాజన సంఘం జిల్లాస్థాయి ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ ఎన్నికల్లో మంత్రి అజయ్ మద్దతు, అండదండలతో బిక్కసాని దామోదర్ నేతృత్వంలోని ప్యానెల్ పోటీ చేసింది. దీనికి వ్యతిరేకంగా ఎర్నేని రామారావు ప్యానెల్ బరిలోకి దిగింది. బిక్కసాని ప్యానల్ విజయం కోసం మంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఓ పోలీస్ ఉన్నతాధికారి ఆధ్వర్యంలో బిక్కసాని ప్యానెల్ కే ఓటు వేయమని ఓటర్లపై ఒత్తిడి తెచ్చారని, లొంగని వారిని బెదిరించారని సోషల్ మీడియా కోడై కూసింది. అంతేకాకుండా ప్రత్యర్థి ప్యానెల్ నేత ఎర్నేని రామారావును పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేశారు. అయితే ఒత్తిళ్లకు లొంగనని, పోటీ చేసి తీరతానని ఆయన స్పష్టం చేశారు. ఆ సంభాషణల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. మరోవైపు అదే సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా బిక్కసానికి మద్దతు ఇచ్చినా ఎన్నికల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. 180 ఓట్ల ఆధిక్యంతో ఎర్నేని రామారావు గెలిచారు. అధ్యక్షుడిగా పోటీ చేసిన ఎర్నేనికి 658 ఓట్లు రాగా.. బిక్కసానికి 478 ఓట్లు లభించాయి. ఈ ఫలితాలతో సొంత సామాజికవర్గమే పువ్వాడను దెబ్బ కొట్టినట్లు అయ్యింది.
కొన్నాళ్లుగా అనుకూలించని పరిస్థితులు
మంత్రి అయిన తొలినాళ్లలో పువ్వాడ అజయ్ చురుగ్గా పనిచేసేవారు. ఐదు నెలల క్రితం జరిగిన ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీని గెలిపించడంలోనూ సఫలీకృతుడయ్యారు. అయితే ఆ తర్వాత నుంచి పరిస్థితులు మారాయి. టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు మంత్రి అజయ్ సన్నిహితుడన్న పేరుంది. కానీ కొన్నాళ్ల క్రితం జరిగిన ఒక సమావేశంలో అజయ్ పై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారని సమాచారం. అప్పటి నుంచి అధిష్టానంతో కొంత గ్యాప్ వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు అజయ్ పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ పరిధిలోని ఆర్టీసీకి చైర్మన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను, ఎండీగా ఐపీఎస్ అధికారి సజ్జనార్ ను నియమించడంతో మంత్రి హవా తగ్గింది. తాజాగా సొంత సామాజికవర్గం కూడా దెబ్బ వేయడంతో జిల్లాలో ఆయన డీలా పడ్డారని, పట్టు కోల్పోతున్నారని ప్రచారం జరుగుతోంది.