iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల నారా భువనేశ్వరి పేరు వినిపిస్తోంది. దానికి అనేక కారణాలుండవచ్చు గానీ పదేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆమె సోదరి దగ్గుబాటి పురందేశ్వరి ప్రభావం కనిపించేంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆమె ప్రాభవం కోల్పోయారు. వరుసగా రెండు సాధారణ ఎన్నికల్లోనూ ఆమెకు జనం ఛాన్సివ్వకపోవడంతో రాబోయే ఎన్నికల మీద ఆమెకు పెద్దగా ఆశలు కనిపించడం లేదు. ఏపీ రాజకీయాల్లో ఇక ఆమె ప్రస్థానం ప్రత్యక్షంగా ముగిసినట్టేనా అనే అనుమానాలు కూడా ఉదయిస్తున్నాయి. ఆమె కూడా పెద్దగా రాజకీయ సందడి చేసేందుకు సిద్ధంగా లేరనే సంకేతాలు కూడా వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి పెద్దగా అవకాశం లేదు. కాబట్టి బీజేపీ నాయకురాలిగా ఆమెకు కూడా అంతగా అవకాశాలు దక్కించుకునేందుకు దారులు కనిపించడం లేదు. గతంలో వెంకయ్యనాయుడు వంటి వారు ఏపీలో అంత హవా లేకపోయినా ఇతర రాష్ట్రాల్లో వారికి ఛాన్స్ ఇచ్చి కేంద్రంలో పదవులు కట్టబెట్టేవారు. ఏపీ రాజకీయాల రీత్యా అప్పట్లో వారికి అలాంటి అవకాశాలు వచ్చాయి. కానీ ప్రస్తుతం జీవీఎల్ నరసింహరావు వంటి వారు ఆ స్థానాన్ని కాజేశారు. కులం కోణంలో పురందేశ్వరికి ఛాన్స్ ఉన్నప్పటికీ ఆమెకు కేవలం మహిళా మోర్చా వంటి పదవులకే బీజేపీ పరిమితం చేసేసింది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఆమెకు కేంద్ర స్థాయిలో పార్టీ పదవులు గానీ రాజ్యసభ ఛాన్స్ గానీ అవకాశాలు కనిపించడం లేదు.
గట్టిగా లాబీయింగ్ చేసుకుంటే కంభంపాటి హరిబాబు మాదిరి ఏనాటికైనా ఏదో చిన్న రాష్ట్రానికి గవర్నర్ లేదా ఇతర నామినేటెడ్ పోస్టులు మాత్రమే ఆమెకు అవకాశం కనిపిస్తోంది. దానికి భిన్నంగా ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టి గతంలో రాజంపేట మాదిరిగా ఇప్పుడు మరో చోట వేలుపెట్టినా ప్రయోజనం ఉండదని పురందేశ్వరి భావిస్తున్నట్టు తెలుస్తోంది. సాధారణ ఎన్నికలు మరో రెండేళ్ల గడువు మాత్రమే ఉన్నప్పటికీ ఆమె నేటికీ ఏ ఒక్క నియోజకవర్గం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి సిద్ధం కాకపోవడం దానికో సంకేతం. అదే సమయంలో బీజేపీలో కేవలం ఉనికి చాటుకోవడమే తప్ప క్రియాశీలకంగా మారేందుకు కూడా ఆమెకు అవకాశాలు కనిపించడం లేదు.
ఏపీలో కాపులకు బీజేపీ ప్రాధాన్యతనిస్తోంది. వరుసగా ఇద్దరు రాష్ట్ర అధ్యక్షులు కూడా అదే కులానికి చెందిన వారు కావడం గమనార్హం. ఒకవేళ సోము వీర్రాజుని అధ్యక్ష స్థానం నుంచి తొలగించాలనే ఒత్తిడి పెరిగితే కమ్మ కాకుండా ఇతరులకు మాత్రమే ఆ అవకాశం దక్కుతుందని బీజేపీ నేతలే చెబుతున్నారు. దాంతో పురందేశ్వరికి ఇంటా బయటా అంత సానుకూలత కనిపించడం లేదు. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఆమెకు ఒరిగేదేమీ కనిపించడం లేదు. దాంతో యూపీఏ హయంలో రాహుల్ గాంధీ టీమ్‌లో ఒక్కరిగా ఓ వెలుగు వెలిగిన పురందేశ్వరి అనూహ్యంగా తన హవా కోల్పోవడం ఆసక్తికరమే.
Also Read : Amravati, Kanakamedala, Rajya Sabha – రాజకీయం కోసమే వరద.. అజెండా మాత్రం అమరావతే.. నిరూపించిన టీడీపీ ఎంపీ