iDreamPost
android-app
ios-app

గ్రామ సచివాలయాల వద్ద మరుగుదొడ్ల సౌకర్యం

గ్రామ సచివాలయాల వద్ద మరుగుదొడ్ల సౌకర్యం

గ్రామ, వార్డు సచివాలయాలతో పరిపాలన వికేంద్రీకరణ చేసి, ప్రభుత్వాన్ని పల్లెలకు చేర్చిన వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. ఆ తర్వాత ఒక్కక్క సౌకర్యాన్ని సమకూరుస్తోంది. ఏ పనైనా సరే గ్రామ సచివాలయంలో జరిగేలా వైసీపీ సర్కార్‌ పలు కీలక నిర్ణయాలు ఇప్పటికే తీసుకుంది. వాటిలో కొన్ని అమలు జరుగుతున్నాయి. వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులుతో సహా పంట ఇన్య్సూరెన్స్‌ కూడా గ్రామ సచివాలయం వద్ద లభించేలా గత నెలలో వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించింది. త్వరలో అక్కడ నుంచే రైతులకు పంట రుణాలు కూడా బ్యాంకుల ద్వారా అందిచనుంది.

వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలతోపాటు పశువైద్యం కోసం ఆస్పత్రిని కూడా నిర్మించాలని సంకల్పిచింది. ఇప్పటికే గ్రామ సచివాలయంలో పశు వైద్యుడుని శాశ్వత ప్రాతిపదికన ప్రభుత్వం నియమించింది. గ్రామీణ ప్రజలకు ప్రాధమిక వైద్యం ఉచితంగా 24 గంటల పాటు అందించేందుకు వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను నిర్మించాలని తలపెట్టింది. ఇవి వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి రాష్ట్రంలోని దాదాపు 13 వేల గ్రామ సచివాలయాల వద్ద అందుబాటులోకి రానున్నాయి.

భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా గ్రామ సచివాలయాల్లో చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇప్పటికే పైలెట్‌ ప్రాజెక్టును చేపట్టింది. త్వరలో రాష్ట్రంలోని అన్ని సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం కానున్నాయి. గ్రామ సచివాలయాల్లో 500కు పైగా సేవలు, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, పశు వైద్యశాల, రిజిస్ట్రేషన్‌ సేవలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లలో వైద్య సేవలు పొందేందుకు వచ్చే ప్రజలు, సచివాలయంలో ఉండే సిబ్బంది, వాలంటీర్లకు ఇబ్బంది లేకుండా.. ప్రతి సచివాలయం వద్ద సామాజిక మరుగుదొడ్లు(పబ్లిక్‌ టాయిలెట్లు) నిర్మించాలని వైసీపీ సర్కార్‌ నిర్ణయించింది. ఈ మేరకు ప్రతి సచివాలయం వద్ద 3 లక్షల రూపాయలతో పబ్లిక్‌ టాయిలెట్‌ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు 334.86 కోట్ల రూపాయలను విడుదల చేసింది. టెండర్ల విధానంలో ఈ పనులను చేపట్టనున్నారు.