జాత్యహంకారంతో అమెరికాలో జరిగిన హత్య ఇప్పుడు అమెరికా ప్రజలను ఏకం చేసింది. కనికరం మానవత్వం లేకుండా జరిగిన ఆఫ్రో అమెరికన్ “జార్జ్ ఫ్లాయిడ్” హత్యకు నిరసనగా అమెరికా హోరెత్తింది. మిన్నెసోటాలోని మినియాపోలిస్‌లో చిన్నస్థాయిలో మొదలైన ఆందోళనలు క్రమేపీ అమెరికా అంతటా కార్చిచ్చులా వ్యాపించాయి. షికాగో, న్యూయార్క్, హ్యూస్టన్, ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీతో పాటుగా దాదాపు 140 నగరాల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారడంతో 40 నగరాల్లో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి వచ్చింది..
అసలేం జరిగింది?
డెరెక్ చౌవిన్ అనే పోలీస్ అధికారి ఆఫ్రో అమెరికన్ అయిన జార్జ్ ఫ్లాయిడ్ ను అరెస్ట్ చేసే క్రమంలో మోకాలితో గొంతుపై బలంగా పెట్టాడు. తనకు ఊపిరి ఆడటం లేదని దయచేసి తనపై నుండి కాలిని తీయాలని ఫ్లాయిడ్ వేడుకున్నా పోలీస్ ఆఫీసర్ కాలిని తీయలేదు. దాదాపు 8 నిమిషాలు మోకాలితో గొంతుపై తొక్కిపట్టడంతో జార్జ్ ఫ్లాయిడ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో అమెరికాలో “ఐ కాంట్ బ్రీత్” ఉద్యమం ఊపందుకుంది. ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు మెడపై గట్టిగా నొక్కిపట్టడంతో అతని ఊపిరాడక మరణించాడు. తనకు ఊపిరాడటం లేదని ఫ్లాయిడ్ అరుస్తున్నా పట్టించుకోకుండా పోలీసులు క్రూరంగా వ్యవహిరించినట్లు వీడియోలో రికార్డ్ కావడంతో అమెరికాలో ఆందోళన మొదలైంది.
తొలుత శాంతియుతంగా మొదలైన ఆందోళన కాస్త హింసాత్మకంగా మారిపోయింది. జార్జ్ ఫ్లాయిడ్ తరహాలో కింద పడుకుని ఐ కాంట్ బ్రీత్ అంటూ నిరసనకారులు ఆందోళన కొనసాగించారు. 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వుతూ వాహనాలను తగులబెట్టారు. దాంతో ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పెప్పర్ స్ప్రే రబ్బరు బుల్లెట్లను వాడాల్సిన పరిస్థితి తలెత్తింది.
బంకర్లో దాక్కున్న ట్రంప్ కుటుంబం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భవనానికి చేరువలో ఆందోళనకారులు విధ్వంసానికి పాల్పడ్డారు. వారిని చెదరగొట్టడానికి భాష్పవాయువును ప్రయోగించినా అమెరికా అధ్యక్షుడి సమీప భవనాలను ధ్వంసం చేసి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. దీంతో ముందుజాగ్రత్త చర్యగా ట్రంప్‌ను, ఆయన సతీమణి మెలనియా, కుమారుడు బ్యారన్‌ను భద్రత బలగాలు హుటాహుటిన బంకర్‌లోకి తరలించారు.
1968 మార్టిన్ లూథర్ కింగ్ హత్య తర్వాత ఆ స్థాయిలో అమెరికాలో ఆందోళనలు జరగడం ఇదే తొలిసారి. జాత్యహంకారంతో జరిగిన ఫ్లాయిడ్ హత్యకు నిరసనగా జరుగుతున్న ఆందోళనలో దాదాపు 4000 వేలమంది అరెస్ట్ అయ్యారు. 5 గురు గాయాలపాలయ్యారు. ఇదే అదనుగా కొందరు లూటీలకు తెగబడ్డారు.. ఆపిల్ స్టోర్ తో పాటుగావాషింగ్టన్‌లోని కేపిటల్ బ్యాంక్ శాఖలోకి వారు చొరబడి ఆభరణాల పెట్టెలను ఎత్తుకెళ్లారు. మరో కాఫీ షాపునూ ఇలాగే దోచుకున్నారు. ఫిలడెల్ఫియాలోనూ పట్టపగలు అనేక దుకాణాలను కొల్లగొట్టారు.
ఎప్పటిలాగే ట్రంప్ మీడియాపై వ్యాఖ్యలు చేశారు. దేశంలో హింసను అరచకత్వాన్ని ప్రేరేపించేలా మీడియా పనిచేస్తుందని ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. రాజకీయ లక్ష్యాల సాధన కోసం ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగే స్వతంత్ర కార్యకర్తల బృందాలున్న ‘యాంటిఫా’ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఆందోళనలను అరికట్టేందుకు ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. కాగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా ప్రపంచ దేశాల్లో మద్దతు ర్యాలీలు జరుగుతున్నాయి.