iDreamPost
android-app
ios-app

Uppada – కోతకు చెక్‌.. ఉప్పాడ వద్ద పటిష్ఠమైన గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు

  • Published Nov 25, 2021 | 5:28 AM Updated Updated Mar 11, 2022 | 10:33 PM
Uppada – కోతకు చెక్‌.. ఉప్పాడ వద్ద పటిష్ఠమైన గోడ నిర్మాణానికి ప్రతిపాదనలు

తూర్పు గోదావరి జిల్లా ఉప్పాడ సముద్రకోత నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలకు ఉపక్రమించింది. శాశ్వత రక్షణ గోడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిపుణుల కమిటీ సూచన మేరకు కోత ఉన్న ఆరు కి.మీల మేర రక్షణ గోడ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. ఇందుకు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు అవుతుందని అధికారులు అంచనా వేయగా, నిధులు కేటాయించేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ సానుకూలంగా స్పందించడంతో త్వరలోనే ఇక్కడ రక్షణ గోడ నిర్మాణం జరుగుతుందని స్థానికులు ఆశిస్తున్నారు.

సముద్ర అలలు ఎగిసిపడడంతో ఉప్పాడ గ్రామం కడలిలోకి కొట్టుకుపోతుంది. ఇప్పటికే పాత ఉప్పాడ గ్రామం మూడొంతులు కోతకు గురైంది. వందేళ్లలో 320 ఎకరాలు కోతకు గురైంది. మరో 320 ఎకరాల సాగు భూమి కొట్టుకుపోయిందని అంచనా. తీరం నుంచి కిలో మీటరు మేర సముద్రం చొచ్చుకుని వచ్చింది. కాకినాడ నుంచి తుని వరకు సముద్ర తీరంలో నిర్మించిన బీచ్‌ రోడ్డు ఇప్పటి వరకు 30 సార్లు కోతకు గురైంది. ఉప్పాడతోపాటు సమీపంలోని కోనపాపపేట, సుబ్బాంపేట, కొమరగిరిల వద్ద సైతం కోత ఎక్కువగా ఉంది. దీనితో కోత నివారణకు ఆరు కిమీల మేర పటిష్టమైన రక్షణ కుడ్యం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.


శాశ్వతరక్షణ గోడ నిర్మాణానికి జగన్‌ నిధులు:

ఉప్పాడ సముద్రకోత నివారణకు దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హాయాంలో రూ.12 కోట్లతో జియోట్యూబ్‌ నిర్మాణం చేశారు. తొలి రోజుల్లో కోత చాలా వరకు తగ్గింది. తరువాత దీనిని పట్టించుకునేవారు లేకపోవడంతో ఇది కూడా నిరుపయోగంగా మారిపోయింది. ఇక్కడ కోత తీవ్రతను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లగా, కేంద్ర బృందం పరిశీలనకు వచ్చింది. కేంద్ర బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇక్కడ కాంక్రీట్‌ టెట్రాప్యాడ్స్‌ నిర్మాణం చేయాలని ఒక అంచనాకు వచ్చారు. ఇందుకు రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు అవుతుందని అధికారులు నిర్దారించారు. ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు అంచనాలు రూపొందించే పనిలో ఉన్నారు. టెట్రాప్యాడ్‌ను పోర్టుల నిర్మాణంలో ఉపయోగిస్తారు. మన రాష్ట్రంలో కాకినాడ, విశాఖపట్నం పోర్టులలో వీటిని వినియోగించారు.

ఉప్పాడ కోత నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటానని సీఎం జగన్‌ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారని, ఈ మేరకు నిధులు కేటాయించేందుకు అంగీకరించినట్టు స్థానిక పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు చెప్పారు. ఆయనతోపాటు బాధితులు, స్థానిక మత్స్యకారులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Also Read : Uppada- ఉప్పాడ… గుండె కోత