Idream media
Idream media
ఈ అరాచకాలకు మూలాలు ఎక్కడ ఉన్నాయి? కనీస భయం, మానవతా విలువలు లేకుండా పోతున్నాయి, సమాజం ఎక్కడ దారి తప్పింది?
మన ప్రజలు వ్యవస్థల ధోరణి విచిత్రంగా ఉంటుంది.
1. ఒకచోట యాసిడ్ దాడి జరిగితే వరుసబెట్టి మరో పది చోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయి. చిన్న పిల్లలపై అత్యాచారాలు జరిగితే ఇలాంటివే వరుసగా రిపీట్ అవుతాయి.
2. న్యాయాన్ని ధర్మాన్ని తామే రక్షిస్తున్నట్లు ప్రతి పత్రిక, టీవీ ఫీల్ అవుతూ ఉంటాయి. యాసిడ్ దాడులు రేపులు ఇంకా ఇతర అకృత్యాలను మొట్టమొదట చూపాలని వీలైనన్ని రోజులు లాగాలని అర్రులు చాచేది వాళ్లే.
3. 2 గంటలా 29 నిమిషాల పాటు చదువు రాక పోయినా పర్వాలేదు పోరంబోకువైనా ఇబ్బంది లేదు ఒక అమ్మాయిని వెంటాడి వేధించి అయినా సరే లవ్ చేయాలి అదే జీవితం అని చూపించి 2 గంటలా 30వ నిమిషంలో ఒక నిమిషం పాటు సూక్తి ముక్తావళి చెప్పించి సమాజాన్ని ఉద్ధరిస్తున్నామనుకునేది సినిమా వాళ్లు. గురువులను తల్లిదండ్రులను పెద్దవాళ్ళను జోకర్లుగా, హీరోలను లోఫర్లుగా చూపించడం హీరోయిజం.
4. ఆరో తరగతిలో ఇంటర్మీడియట్ డిగ్రీ అంశాలను ఫౌండేషన్ కోర్సులుగా చెప్తే ఇది అన్యాయం అని అంటాం, కానీ మన పిల్లలకు ఐఐటి మెడిసిన్ ఎక్కడ రాదో అని గింజుకుంటాం.
5. కార్పొరేట్ పాఠశాలలు కళాశాలలు రాక్షస కూపాలని తెలుసు, కానీ కిక్కిరిసిన గదుల్లో వసతులు లేని హాస్టల్ రూముల్లో రెండేళ్లు కళ్ళు మూసుకొమ్మని చెబుతాం.
6. ప్రీ ప్రైమరీ విద్యే లేకపోతే ఏ గొడవా లేదు. సగానికి పైగా తల్లులు బిడ్డలకు మంచే నేర్పుతారు అన్న నమ్మకం నాకుంది. కానీ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కూడా ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ప్రీ ప్రైమరీ వయసు, పిల్లలకు అత్యంత కీలకమైనది. తల్లి, కుటుంబం ఒడిని దాటి బయటి ప్రపంచాన్ని చూసే వయసు. ఆ పసి మెదళ్లలో మంచిని మానవత్వాన్ని, దయా జాలి, జంతు పర్యావరణ ప్రేమను, నియమ నిబంధనలను, ప్రమాదాలను ఎదుర్కునే, నివారించే నైపుణ్యాలను నాటాలి. కానీ మన దగ్గర ఏం జరుగుతోంది? ఆ పసి పిల్లలు రాగానే ఎబిసిడిలు, అంకెలు, టేబుల్స్ నేర్పిస్తున్నారు.
Also Read : సమాజం,చట్టం —స్త్రీ
ఇప్పుడు విద్య మొత్తం మార్కుల చుట్టే తిరుగుతూ ఉంది. ఇంట్లో పెద్దవాళ్లు మంచి చెడూ చెప్పే స్థితిలో లేరు. చెప్పినా వినే స్థితిలో పిల్లలు లేరు. ఉపాధ్యాయులు తరగతి గదిలో పాఠాలు తప్ప కొన్ని మంచి మాటలు చెప్పడానికి అవకాశం లేదు. పిల్లలకు నీతి కథల గురించి తెలిసే అవకాశమూ లేదు. మరి ఎవరు ఎప్పుడు ఎక్కడ పిల్లలకు మంచి మాటలు చెబుతున్నారు? మరి ఏ విధంగా నీతి న్యాయం ధర్మం నిజాయితీ విచక్షణ వంటి లక్షణాలు పిల్లలకు ఒంటపడతాయి?
ఇక్కడ రెండు పాయింట్లు…
Juxtaposition : అనైతికం వద్దంటూ అదే పని చేసే మీడియా మరియు సినిమాలు
రెండో పాయింట్ : ప్రజలు: మనకు ఇష్టం లేకపోయినా, అది సరైన వ్యవస్థ కాదని తెలిసినా అందులో భాగం కావడం. మార్కెట్ శక్తులు సృష్టించిన మాయలో పడటం.
తక్కువ క్రైమ్ రేట్ ఉన్న దేశాలను తీసుకుంటే అక్కడ బాధ్యతాయుతమైన సమాజం ఉంటుంది. మరి
బాధ్యతాయుతమైన సమాజం ఎలా ఏర్పడుతుంది?
ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో విద్యా వ్యవస్థలో జరిగిన కరెక్షన్. విలువలతో కూడిన విద్య కొన్ని దశాబ్దాలకు బాధ్యత కలిగిన సమాజాన్ని ఏర్పరుస్తుంది.
Also Read : సర్ప యాగం – ఒక వాస్తవ కథ -ఒక తండ్రి తీర్పు
వీటన్నింటి కంటే ముఖ్యంగా ఒక నిర్మాణాత్మకమైన తదుపరి చర్యలు లేకపోవడం. ఒక భయంకరమైన ఘటన జరగగానే జాతి మొత్తం అదే ఘటన మీద ప్రతిస్పందిస్తుంది. బాధను, ఆక్రోశాన్ని వెళ్లగక్కుతారు. ఓ రెండు మూడు రోజులకు దాని గురించి చర్చే ఉండదు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం తెచ్చారు. అయినప్పటికీ అకృత్యాలు ఆగలేదు. ఈ అకృత్యాలను ఆపడం ఎలా అని మళ్ళీ ప్రభుత్వాలు చర్చించాయా ? చర్యలు తీసుకున్నారా ?
Written by –Jeevani Anantapur