iDreamPost
iDreamPost
వ్యాపారవేత్తలకు ఒక మహత్తరమైన లక్షణం ఉంటుంది. ప్రతి సంక్షోభం లోనుంచి ఒక కొత్త వ్యాపార అవకాశాన్ని వారు వెతుక్కుంటూ ఉంటారు. ఇది ప్రత్యక్షంగా ప్రజలకు ఇబ్బంది కలగనంత వరకు సదరు వ్యాపారవేత్తలను ఎవ్వరూ ఏమీ అనరు. పైగా విజయవంతమైన వ్యాపారవేత్తలు అంటూ కీర్తికిరీటాలు కూడా పెడతారు. కానీ ఒక్కసారి ప్రజలకు కష్టం కలిగితే మాత్రం దుమ్మెత్తి పోయడానికి ఏ కోశాన వెనుకాడరు.
ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రుల పరిస్థితి ఇలాగే ఉంది. ప్రపంచానికి కరోనా పరిచయం అయ్యాక ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది మాత్రమే ధైర్యంగా ముందు వరుసలో నుంచుని సేవలందించారు. దాదాపుగా ప్రైవేటు ఆసుపత్రులన్నీ మూతపడ్డాయి. ఒకరిద్దరు వైద్యులు స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి సేవలందించినప్పటికీ విస్తృతంగా ఉన్న ప్రైవేటు వైద్య సేవలతో పోలిస్తే ఇలా ముందుకు వచ్చిన వారి సేవలు నామమాత్రంగానే చెప్పాలి.
ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసులు పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో ప్రభుత్వం చొరవచూపి ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కోవిడ్ సేవలు అందించేందుకు అనుమతులు ఇచ్చింది. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఇది ఎంతో ఆవశ్యకం కూడాను. అయితే సరిగ్గా అవకాశం కోసం ఎదురు చూస్తున్న కార్పొరేట్, ప్రైవేటు వైద్య రంగం ఈ అవకాశాన్ని రెండు చేతులతోనూ అందిపుచ్చుకునేందుకు సమాయత్తమైపోయింది.
కరోనా పట్ల రోగుల్లో ఉన్న భయాన్ని క్యాష్ చేసుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం కోవిడ్‌ను గుర్తించేందుకు నిర్ణీత వైద్య పరీక్షలను నిర్ణయించింది. అయితే వీటికి అతీతంగా ప్రైవేటు వైద్యులు కొన్ని పరీక్షలు చేస్తూ.. ఇదే కరెక్ట్ అనే ప్రచారాన్ని జనంలోకి బలంగా తీసుకు వెళ్ళారు. సహజంగానే ప్రభుత్వ వైద్యం మీద ఉన్న చిన్నచూపు కారణంగా పలువురు వ్యక్తులు తమ శక్తికి మించి ప్రైవేటు వైద్యంవైపు బలంగానే మొగ్గుచూపుతున్నారు. సరిగ్గా ఇక్కడే ప్రైవేటు వైద్యులకు కాసుల పంట పండుతోంది.
గ్రామస్థాయి వరకు తమకు ఉన్న నెట్‌వర్క్‌తో రోగులకు వల వేస్తున్నారు. రోజుకు రూ. 30వేల నుంచి 50 వేల వరకు ఛార్జి చేస్తూ నిర్భీతిగా రోగుల జేబులను గుల్ల చేసేస్తున్నారు. వీరి బరితెగింపు ఏ స్థాయికి చేరిందంటే.. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన బెడ్‌ల కంటే అదనంగా బెడ్లు ఏర్పాటు చేసి రోగుల నుంచి డబ్బులు దండుకునే స్థాయికి చేరిపోయింది. వాస్తవానికి వీరు చేస్తున్న అదనపు వైద్యం ఏమీ లేదన్నది అక్కడ చికిత్స పొంది వచ్చిన వారు అనుభవంతో చెబుతున్న మాట. కనీసం సంబంధిత వైద్య సిబ్బంది కూడా తమను పలకరించిన పాపాన పోలేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ తరువాత ఆయా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్ళే వాళ్ళను హెచ్చరిస్తున్నారు.
మనిషి భయమే ప్రైవేటు ఆసుపత్రులకు పెట్టుబడి. కరోనా ఆ భయాన్ని పుట్టిస్తోంది.. ప్రైవేటు ఆసుపత్రులు తమ పెట్టుబడి నుంచి లాభాన్ని రాబట్టుకుంటున్నారు. ఈ విషయం గమనించుకోకపోతే జేబులు గుల్లవ్వడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తూనే.. ఇంట్లో ఉండి కూడా వైరస్ నుంచి బయటపడేందుకు అవసరమైన టెలిమెడిసిన్, మందులు, సలహాలు, సూచనలు అందిస్తోంది. కరోనా పై పోరుకు కావాల్సింది ప్రజా చైతన్యమే. చైతన్యంతో కరోనాకు దూరంగా ఉండవచ్చు, ఒక వేళ వస్తే.. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ నుంచి తప్పించుకోవచ్చు.