Idream media
Idream media
పురాణాల్లో పుష్పక విమానాలు ఉండేవో లేదో తెలియదు కానీ, సర్వీస్ ఆటోలు మాత్రమే అవే. దీంట్లో నాకు నచ్చేది ఏమంటే డ్రైవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్. తన నెత్తి మీద జనాలు కూచున్నా నిబ్బరంగా నడపగలడు. నిజానికి సర్వీస్ ఆటోలో ఎన్నో జీవిత సత్యాలున్నాయి.
1.ఎంత కష్టాన్నైనా హ్యాండిల్ చేయాలి.
హ్యాండిల్ తిప్పినప్పుడు , అది పక్కన కూచున్న వాడికి తగలరాని చోటు తగిలినా డ్రైవర్ జంకడు. సరిగా కూచోమని వాన్ని నాలుగు తిట్టి మరీ ముందుకు పోనిస్తాడు.
2.గమ్యం ముఖ్యం.
డ్రైవర్‌కి ఇరువైపులా ముగ్గురు నలుగురు కూచోవడం వల్ల అతను తల అటూఇటూ తిప్పలేడు. కుడిఎడమల వచ్చే వాహనాలు అస్సలు కనపడవు. బ్రేక్ వేసినప్పుడు అందరూ కలసి డ్రైవర్ మీద పడినా, డ్రైవర్ తానే స్వయంగా ఇంకెవరి మీదైనా పడినా సరే చలించకుండా గమ్యం చేరుతాడు. పర్సనాలిటీ మేనేజ్‌మెంట్ పుస్తకాల్లో ఎక్కడా చెప్పని పాఠాలను మనం సర్వీస్ ఆటోలో నేర్చుకోవచ్చు.
3.పొరుగువాడితో పంచుకో
అంతా మనకే కావాలనే జీవన ప్రాథమిక సూత్రానికి సర్వీస్ ఆటో వ్యతిరేకం. దారిలో బర్రె తోక ఊపి, పది రూపాయలు చేతిలో పెడితే దాన్ని కూడా ఎక్కించుకుంటాడు. ఆల్రెడీ ఒకరి మీద ఇంకొకరు కూచుని , ముద్దులు పెట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్న స్వాభావిక స్థితిలో ఉన్న ప్రయాణికులకు “కొంచెం సర్దుకోండి సార్” అని సర్దుబాటు తత్వం బోధిస్తాడు. పొరుగు వాడితో పంచుకునే సుగుణాన్ని నేర్పిస్తాడు.
4.దైవభక్తి పెంపుదల
గోతులు, స్పీడ్ బ్రేకర్లు లేకుండా ప్రపంచంలో ఎక్కడా రోడ్లు ఉండవు. ఒకవేళ ఉంటే అది ఖచ్చితంగా మన దేశం మాత్రం అయి ఉండదు. మన దేశంలో అయితే ఒక్కోసారి రెండు గోతుల మధ్య రోడ్డు ఉంటుంది. అయితే సర్వీస్ ఆటో డ్రైవర్ దేన్నీ లెక్క చేయడు. చుట్టూ మనుషులు ఉండడం వల్ల రోడ్డు మనకి కనపడదు కాబట్టి స్పీడ్ బ్రేకర్ల సంఖ్యని గుర్తించి , గమ్యస్థానానికి ఎంత దూరంలో ఉన్నామో నిర్ధారించుకోవాలి. స్పీడ్ బ్రేకర్స్ మీద ఆటో వెళుతుంటే మన తల టాప్‌కి తగులుతుంది. గోతిలో దిగినప్పుడు మన పక్కటెముకులు కటకటమని సౌండ్ చేస్తాయి. ఇదో గుడ్డి గుర్తు. గీతలో శ్రీకృష్ణుడు “చేసేది, చేయించేది నేనే. మీ చేతుల్లో ఏమీలేదు” అని అన్నాడు కదా. ఆటో డ్రైవర్ని భగవత్ స్వరూపంగా భావించి ప్రాణాలతో క్షేమంగా చేర్చినందుకు కృతజ్ఞతలు తెలపాలి. ప్రయాణం మధ్యలో ఎన్నోసార్లు దేవున్ని గుర్తు చేసుకుంటాం కాబట్టి, ఆ పుణ్యం కూడా సర్వీస్ ఆటో పుణ్యమే.