iDreamPost
android-app
ios-app

కూన రవి కొత్త నియోజకవర్గం వెతుక్కుంటున్నారా?

  • Published Mar 22, 2022 | 6:30 PM Updated Updated Mar 22, 2022 | 7:20 PM
కూన రవి కొత్త నియోజకవర్గం వెతుక్కుంటున్నారా?

దుందుడుకు చర్యలతో రాజకీయంగా అప్రతిష్ట పాలవుతూ కేసుల్లో ఇరుక్కుంటున్న మాజీ ప్రభుత్వ విప్, శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆమదాలవలస నుంచి పోటీ చేయాలని అనుకోవడంలేదా?.. వేరే నియోజకవర్గం వైపు చూస్తున్నారా??.. కొన్నాళ్లుగా ఆయన చర్యలు, కార్యకలాపాల తీరు చూస్తుంటే పై ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో కూన తన పక్క నియోజకవర్గం, జిల్లా కేంద్రం అయిన శ్రీకాకుళంపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని అడ్డుపెట్టుకుని ఇంకే నియోజకవర్గం పైనా చూపని చొరవను ఈ నియోజకవర్గంపై చూపిస్తున్నారు. దశాబ్దాలుగా ఈ నియోజకవర్గ టీడీపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ దంపతులను కాదని పలు చర్యలు తీసుకుంటున్నారు. వారి వ్యతిరేకులను ఎగదోస్తున్నారు. ఆమదాలవలస మండలం పొందూరుకు చెందిన కూన రవి ఇప్పటికి మూడుసార్లు ఆమదాలవలస నుంచి పోటీచేసి ఒక్కసారి మాత్రమే గెలిచారు. 2009లో తొలిసారి పోటీచేసి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. 2014లో కేవలం 5500 ఓట్ల మెజారిటీతో తన మేనమామ తమ్మినేని సీతారాం పై గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో అదే సీతారాం చేతిలో 14 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం స్పీకరుగా ఉన్న సీతారాంపై వచ్చే ఎన్నికల్లోనూ గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటి నుంచే శ్రీకాకుళంపై కన్నేశారని అంటున్నారు. అందులో భాగంగానే గుండ కుటుంబానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారన్న చర్చ జరుగుతోంది.

కమిటీ ముసుగులో పెత్తనం

శ్రీకాకుళం నగరపాలక సంస్థకు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఆ సన్నాహాలు కోసం టీడీపీ అధిష్టానం ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్యేలు కలమట వెంకటరమణ, భగ్గు రమణమూర్తి, కూన రవితో పాటు ఎల్ ఎల్ నాయుడును సభ్యులుగా నియమించి ఒక్కొక్కరికి 10 డివిజన్ల బాధ్యతలు అప్పగించారు. ఆయా డివిజన్లకు ఇంఛార్జీలను, బూత్ కమిటీల నియామకం, ఓటరు జాబితాలు పరిశీలన తదితర కార్యక్రమాలను కమిటీ సభ్యులు చేపట్టాల్సి ఉంటుంది. అయితే కూన రవి తనకు ఇచ్చిన డివిజన్లతో పాటు, ఇతర సభ్యుల డివిజన్లలోనూ తానే జోక్యం చేసుకుని మాజీ ఎమ్మెల్యేలు అయిన గుండ అప్పలసూర్యనారాయణ, గుండ లక్ష్మీదేవిల ప్రమేయం లేకుండానే అన్ని పనులు చక్కబెట్టేస్తున్నారు. పలు డివిజన్లలో స్థానిక నేతలతో రవికుమారే మంతనాలు జరుపుతూ రాజకీయం చేస్తున్నారు.

గుండ వ్యతిరేకులకు ప్రాధాన్యం

మరోవైపు పార్టీలో గుండ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్నవారిని కూన రవి ప్రోత్సహిస్తున్నారు. మొదటి నుంచి అప్పల సూర్యనారాయణకు దూరంగానే ఉంటున్న సీనియర్ టీడీపీ నాయకుడు నాగావళి కృష్ణ వంటి వారిని కూన చేరదీస్తున్నారు. అలాగే ఇటీవలి వరకు గుండ మద్దతుదారుగా ఉండి, ఇప్పుడు దూరమైన గొండు శంకర్ ను కూడా కూన ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు గుండ కుటుంబానికి విశ్వాసపాత్రుడైన నగర టీడీపీ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ ను ఆ పదవి నుంచి తప్పించాలని ఇటీవల ఒక సమావేశంలో జిల్లా అధ్యక్షుడి హోదాలో కూన రవి బహిరంగంగా చెప్పడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు, కూన తీరుపై గుండ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల క్రితం అప్పల సూర్యనారాయణ స్వయంగా పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు ఇంటికి వెళ్లి మరీ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. కూన రవి తీరును ఎండగట్టారు. ఇవన్నీ చూస్తుంటే అప్పల సూర్యనారాయణ దంపతులను వెనక్కి నెట్టి కూన రవి వచ్చే ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి పోటీ చేయవచ్చన్న అభిప్రాయం ఆ పార్టీలోనే వ్యక్తం అవుతోంది.