iDreamPost
iDreamPost
తీర్థాలు, సంబరాలు జరిగేటప్పుడు సంఘ విద్రోహులు జనంలో కలిసిపోయి అల్లర్లు సృష్టిస్తుంటారు. అలాగే
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ మీడియా ముసుగులో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారా అనిపిస్తోంది. సమాజంలోని ఒక్కో వర్గాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రెచ్చగొట్టే తన అజెండాను ఈ వారం కూడా సిగ్గులేకుండా అమలుచేశారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు.. కొత్తపలుకు నిండా పాతచెత్తను నింపేశారు. పాఠకుల వివేచనను తక్కువగా అంచనా
వేస్తూ తన పచ్చపైత్యాన్ని బయట పెట్టుకున్నారు.
పవన్ ప్రాపకం కోసం ఫీట్లు..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్న తన యజమాని చంద్రబాబుకు మార్గం సుగమం చేయడానికి రాధాకృష్ణ శక్తివంచన లేకుండా కృషి చేశారు. భీమ్లానాయక్ సినిమా ప్రదర్శనకు ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తున్నట్టు ఇప్పటికే చేస్తున్న అసత్య ప్రచారానికి మరింత సృజనాత్మకతను జోడించారు.
పవన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనపై కక్ష గట్టారని రాధాకృష్ణ నిర్ధారించేశారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు వక్రభాష్యం చెప్పారు. పవన్ కల్యాణ్ ను వేధించడానికే ధియేటర్లపై అధికారులు దాడులు చేస్తున్నారని సూత్రీకరించారు. కావాలనే సినిమా టికెట్ల రేట్ల పెంపును ప్రభుత్వం వాయిదా వేసిందని ఒక అభాండం వేసేశారు. తనిఖీల పేరిట గతంలో శ్యామ్ సింగరాయ్ ప్రదర్శిస్తున్న థియేటర్లపై అధికారులు దాడులు చేశారని, ఇప్పుడు భీమ్లా నాయక్ ఆడే సినిమా హాళ్లపై చేస్తున్నారని రాధాకృష్ణ బాధ పడిపోయారు. నిర్ణీత ధరలకు టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయా? థియేటర్లలో కనీస సౌకర్యాలు ఉన్నాయా? అని అధికారులు తనిఖీ చేస్తే అది పవన్ కల్యాణ్ ను వేధించినట్టు ఎలా అవుతుందో రాధాకృష్ణకే తెలియాలి. నిర్ణయించిన ధరలకు టికెట్లు అమ్మకుండా, అమ్మిన అన్ని టికెట్లకు టాక్స్ కట్టకుండా కొన్ని థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాయి. ఈ ఆటలు కట్టించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే పవన్ కల్యాణ్ ను వేధించటం అవుతుందా? వర్తమాన పరిస్థితులపై అవగాహన లేకుండా, ఏ మాత్రం పసలేని ఆరోపణలు చేసే పవన్ కల్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కక్ష కట్టాల్సిన అవసరం ఏముంటుంది?
విచిత్రమైన వాదనలు..
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏకపక్షంగా సినిమా టికెట్ ధరలు తగ్గించారని రాధాకృష్ణ బాధపడిపోవడం మరీ వింతగా ఉంది. ధరల తగ్గించి సామాన్యులకు మేలు చేసే నిర్ణయం ఏకపక్షం అయితే మాత్రం నష్టమేమిటి? సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తానని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించకుండానే జగన్ ఎందుకు తగ్గించారు? అని ప్రశ్నించిన రాధాకృష్ణ.. తన తెలివితేటలకు తానే మురిసిపోయి ఉంటారు! అధికారులు థియేటర్ల వద్ద తనిఖీలు చేసి బ్లాక్ మార్కెట్ ను అడ్డుకుంటున్నారని ఒకపక్క వాపోతూనే కొన్నిచోట్ల వైఎస్సార్ సీపీ నేతలు బ్లాకులో టిక్కెట్లు అమ్ముకున్నారని రాధాకృష్ణ బరికేశారు. బహుశా ఇలాంటి కల్మషం లేని రాతలు రాస్తారు కనుకనే రాధాకృష్ణ అంటే చాలామంది కుళ్లుకుంటారు!
కక్షకు కారణం ఇదట!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తుండగా ఏపీలో జగన్ కక్ష సాధిస్తున్నారని రాధాకృష్ణ రాసేశారు. 2014లో తాను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడిన పవన్ కల్యాణ్, ప్రభుత్వ ఉద్యోగులు అంటే జగన్మోహన్రెడ్డికి కక్ష అని, అందుకే వారిపై ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారని సూత్రీకరించారు. ఆ విధంగా అటు పవన్ ను, ఇటు ఉద్యోగులను సీఎం జగన్ పైకి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడినప్పుడు మంత్రి పేర్ని నాని ముఖం చూస్తే కాపులు అందరూ ఆయనపై ముప్పేట దాడి చేశారని రాధాకృష్ణకు అనిపించిందట. అంటే పవన్ కల్యాణ్ సినిమాకు బ్లాక్ లో టికెట్లు అమ్ముకోనీయనందుకు రాష్ట్రంలోని కాపులందరూ ఏకమై మంత్రి నానిని చెడామడా, ఎడాపెడా తిట్టేశారని మనం అర్థం చేసుకోవాలన్న మాట.
ఆ విధంగా రాష్ట్రంలోని కాపులు మంత్రి పేర్ని నానికి
తద్వారా వైఎస్సార్ సీపీకి దూరం అయినట్టు మనం గ్రహించాలి. లేదంటే మనకు తెలివితేటలు లేనట్టే!
ఏది రాక్షసానందం?
సినిమా టికెట్ల ధరలు తగ్గించడం, బ్లాక్ మార్కెట్ కు అనుమతించకపోవడం ప్రభుత్వం చేస్తున్న తప్పుగా చిత్రీకరించడం ఏమిటి? పైగా ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం లేదేమని సినిమా పరిశ్రమ పెద్దలను ఆడిపోసుకోవటం. ప్రేక్షకులను ముఖ్యంగా పవన్ కల్యాణ్ అభిమానులను ప్రభుత్వంపై రెచ్చగొట్టడం.. ఇది ఏ తరహా జర్నలిజం? ప్రతిపక్షమైనా, పత్రికలైనా ప్రజాపక్షం వహించాలి కాని ఇలా బ్లాక్ మార్కెట్ దందాకు, టాక్స్ ఎగ్గొట్టే వారికి కొమ్ము కాయడం ఏమిటి? ముఖ్యమంత్రిని ఉద్దేశించి పాలెగాడు, రాక్షసానందం అంటూ రాసి ఆనందపడిపోవడం ఏమిటి? ఈ రాతలను బట్టి అర్థంకావడం లేదా? రాక్షసానందం
అక్షరరూపం ధరిస్తే ఎంత వికృతంగా ఉంటుందో..