దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరగడం ప్రారంభమయ్యాయి. గడిచిన నాలుగు రోజుల్లో ధరలు మూడుసార్లు పెరిగాయి. నాలుగు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధర లీటర్‌కు 2.40 రూపాయల చొప్పన పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్‌ధరలు పెరిగాయని ఆయిల్ కంపెనీలు చెబుతుండడంతో ఈ ధరలు ఇంకా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో గత ఏడాది నవంబర్ 4వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. అంతకుముందు ప్రతిరోజూ ధరల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ లీటర్ ధర 100 మార్క్‌ను క్రాస్ చేసి గత ఏడాది రికార్డు సృష్టించింది. పెట్రోల్ ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందనే ఉద్దేశంతో బీజేపీ సర్కార్.. తాత్కాలికంగా పెంపునకు తాళం వేసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసి, ఫలితాలు కూడా రావడంతో ధరల పెంపు మళ్లీ షురూ అయింది. నాలుగు నెలలుగా ధరలు పెంచకపోవడం వల్ల తమకు 19 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు చమురు సంస్థలు చెబుతున్నాయి. అంటే ఇకపై నిరంతరం పెట్రో వాత ఖాయమైంది.
పెట్రో ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, ఎన్సీపీ, తృణముల్, డీఎంకేలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. తమ ఆందోళనలను వ్యక్తం చేస్తూ.. సభ నుంచి వాకౌట్ కూడా చేస్తున్నారు. ప్రజలు మాత్రం మౌనంగా భారాన్ని భరించేందుకు సిద్ధమయ్యారు. ఈ ధరాభారం అలవాటు కావడంతో ప్రజలు కూడా మానసికంగా సిద్ధమైనట్లు అర్థమవుతోంది.
పెట్రోల్ ధరల పెంపు, కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రభుత్వం తీరుపై ఎన్సీపీ నేత, మహిళా ఎంపీ సుప్రియా సూలే చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. పెట్రో, డీజిల్ ధరలు నియంత్రణలో ఉండాలంటే ఏమి చేయాలో ఆమె సలహా ఇచ్చారు. ఈ సలహా పాటిస్తే ధరలు తగ్గుతాయని అందరూ భావిస్తున్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నియంత్రణలో ఉండాలంటే ప్రతి నెల ఎన్నికలు ఉండాలని సుప్రియా సూలే చెప్పారు. ఆమె చెప్పింది ముమ్మాటికి నిజమేననే వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు రెండు నెలల ముందు, ఫలితాలు వచ్చిన పది రోజులు తర్వాత వరకు మొత్తంగా నాలుగు నెలల పాటు ధరలు పెరగలేదు. ఇప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి మళ్లీ ధరలు పెంచేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ పరిణామం సుప్రియా సూలే ఇచ్చిన సలహా నూరు శాతం ఉపయుక్తమని తెలియజేస్తోంది.
70601