iDreamPost
android-app
ios-app

బాబు, చినబాబు చెరోవైపు నుంచి బయలుదేరుతారట…

  • Published Mar 06, 2022 | 11:20 AM Updated Updated Mar 06, 2022 | 11:28 AM
బాబు, చినబాబు చెరోవైపు నుంచి బయలుదేరుతారట…

ఏపీలో వైఎస్ జగన్ హవా అడ్డుకోవడానికి టీడీపీ శతవిధాలా ప్రయత్నించాల్సి వస్తోంది. అందులో భాగంగా రెండున్నరేళ్లుగా ప్రజలకు దూరమయిన విపక్షనేతలు మరోసారి జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. త్వరలో మనకోసం పేరుతో ఓ యాత్రను ప్రారంభించాలని సంకల్పించినట్టు సమాచారం. గతంలో వస్తున్నా మీకోసం అంటూ 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్ర చేశారు. ఈసారి మన కోసం వస్తున్నా అంటూ బయలుదేరాలని భావిస్తున్నట్టు సమాచారం. అయితే చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ చెరోవైపు యాత్రలు చేయాలని ఆలోచించడమే ఆసక్తిగా మారింది.

చంద్రబాబు వయోభారం కారణంగా పాదయాత్ర చేయగలిగే అవకాశం లేదు. దాంతో నారా లోకేష్ పాదయాత్ర చేయాలని సంకల్పించారు. కానీ లోకేష్ యాత్ర పట్ల టీడీపీ నేతల్లోనే సవాలక్ష సందేహాలు వినిపిస్తున్నాయి. ఆయన కొనసాగించగలరా అనే అనుమానంతో పాటుగా ప్రజల ఆదరణ పొందగలరా అనే సందేహం వరకూ అనేక ప్రశ్నలు పార్టీ నేతల్లోనే ఉన్నాయి. దాంతో చినబాబు యాత్ర ముందుకు సాగుతుందా అనే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయినప్పటికీ తాను యాత్ర చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలోనే లోకేష్ చెప్పడం విశేషం. దాంతో కొందరు నాయకులు నసుగుతూనే యాత్రకు అర్థమనస్కంగా అంగీకరించడంతో రెండు యాత్రలకు టీడీపీ ముఖ్యనేతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.

చంద్రబాబు రాయలసీమ నుంచి బస్సుయాత్రకు దిగితే, నారా లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. టీడీపీ నేతలు కూడా ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారని చెబుతున్నారు. వేసవి తీవ్రత తగ్గిన తర్వాత జూన్ లో ఈ యాత్ర మొదలవుతుందని సమాచారం. అయితే ఇద్దరూ ఒకేసారి ఇరువైపుల నుంచి బయలుదేరుతారా లేక ఒక యాత్ర తర్వాత రెండోయాత్ర ఉంటుందా అన్నది స్పష్టత లేదు. ముఖ్యంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయమని టీడీపీ బలంగా నమ్ముతోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జుల పై దృష్టి పెట్టింది. వారిలో కొందరిని అభ్యర్థులుగానూ చంద్రబాబు ప్రకటించేస్తున్నారు.పుంగనూరులో చల్లా బాబు బరిలో ఉంటారని ఆ నియోజకవర్గ నేతలకు తేల్చిచెప్పేశారు. ఇలా చంద్రబాబు మాటలు చివరకు నిలబడతాయనే ధీమా లేనప్పటికీ ప్రస్తుతానికి ఇలాంటి ప్రకటనలు వస్తున్నాయి.

ముందస్తు మీద గట్టి నమ్మకంతో ఉన్న ఆపార్టీ నేతలు పాదయాత్రలు, ప్రచారయాత్రలకు సిద్ధపడుతుండడం విశేషంగా భావించాలి. వచ్చే ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తానని ప్రకటించిన మంగళగిరిలో ఇప్పటికే ఓసారి ఇంటింటికీ చాలావరకూ తిరిగి వచ్చేశారు. పాదయాత్రకు వెళితే మళ్లీ సొంత సీటులో తిరిగే అవకాశం ఉండదనే అంచనాతో ముందుగా మంగళగిరిలో యాత్ర చేసినట్టు కనిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో గెలిచినా లేకున్నా టీడీపీకి తదుపరి నాయకత్వంగా తన పట్టు స్థిరపడాలని లోకేష్ ఆ యాత్రలో ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్టు పలువురు భావిస్తున్నారు. దాంతో ఆయన యాత్రకు ఏమేరకు స్పందన వస్తుందన్నది చూడాలి. అయితే లోకేష్ , చంద్రబాబు ఒకేసారి యాత్రలకు దిగితే అంతిమంగా లోకేష్ యాత్రకు ప్రచారం దక్కదనే భయం బాబులో ఉంది. దాంతో ఏం చేస్తారన్నది కూడా అస్పష్టంగా కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చే నెలలో జరిగే టీడీపీ సమావేశంలో స్పష్టత వస్తుందనే అంచనా వినిపిస్తోంది.