iDreamPost
android-app
ios-app

రాజకీయ ‘సన్యాసులు’

రాజకీయ ‘సన్యాసులు’

ప్రతి అంశంలో ప్రత్యర్దులకంటే నాలుగాకులు ఎక్కువ తిన్నట్టు డాంబికాలకు పోయే రాజకీయ నాయకులు, నైతిక విలువల విషయం వచ్చేసరికి బాణీ మారుస్తుంటారు. కొన్ని అనైతిక పనులు గతంలో తామూ చేయకపోలేదనీ, కాకపొతే తమ ప్రత్యర్ధులు ప్రస్తుతం చేస్తున్నంత నిస్సిగ్గుగా తాము ఎన్నడూ ప్రవర్తించలేదని తమకు తామే ఒక కితాబు ఇచ్చుకుంటూ వుంటారు. నైతికతలో కూడా హెచ్చుతగ్గులు నిర్ధారించే స్థాయికి దిగజారడం అన్నదే ‘అనైతికతకు’ పరాకాష్ట అని వారి ప్రత్యర్ధులు ఎత్తిపొడుస్తుంటారు.
ఏతావాతా ఉభయుల వాదన ఒక్కటే. గమ్యం చేరుకోవడం కోసం కాసింత దారి తప్పినా పరవాలేదన్నదే అసలు విషయం. లక్ష్య శుద్ధి ముఖ్యం కానీ దాన్ని అందుకునే విధానం ప్రధానం కాదన్నది వారి మనోగతం.

నిజానికి దశాబ్దాల క్రితమే రాజకీయాల్లో విలువల పతనం మొదలయింది. కాకపొతే ఆ పతనవేగం, ఉరవడి ఇటీవలి కాలంలో మరింత ఊపు అందుకున్న మాట నిజం.

పూర్వపు రోజుల్లో కొందరు అసలు సిసలయిన ‘సన్యాసి’ నాయకులు వుండేవాళ్ళు. వాళ్ళల్లో కొందరిని స్మరించుకోవడం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం.

నేను రేడియో విలేకరిగా చేరిన కొత్తల్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారితో పరిచయం ఏర్పడింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, మద్యపాన వ్యతిరేకోద్యమ నేతగా ఆయన పలుపర్యాయాలు రేడియో స్టేషన్ కు వచ్చేవారు. నీరు కావి రంగు ఖద్దరు దుస్తులు, భుజం మీదుగా వేలాడుతూ ఒక గుడ్డ సంచి. దూరం నుంచే చూసి చెప్పొచ్చు ఆ వచ్చేది వావిలాల వారని. ముతక ధోవతి, ముడతలు పడ్డ అంగీ, ఇక ఆ చేతి సంచిలో వుండేవి నాలుగయిదు వేపపుల్లలు, మరో జత ఉతికిన దుస్తులు, నాలుగయిదు పుస్తకాలు, నోటుబుక్కు.

1955 నుంచి 1967 వరకు ఆయన ఇండిపెండెంటుగా గెలుస్తూ వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను ఆయన కాలినడకనే తిరిగేవారు. యెంత దూరమైనా కాలి నడకే. వూరు దాటి వెళ్ళాల్సివస్తే ఆర్టీసీ బస్సు లేదా సెకండు క్లాసు రైలు. ఒకసారి అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా వున్నప్పుడు నాగార్జున సాగర్ వెళ్ళారు. గెస్టు హౌస్ లో దిగిన వావిలాల వారిని మర్యాద పూర్వకంగా కలుసుకునే నిమిత్తం జిల్లా కలెక్టర్ వెళ్లి గదిలో చూస్తె ఆయన లేరు. బయటకు వచ్చి వాకబు చేస్తే ఆ సమయానికి వావిలాల గెస్టు హౌస్ దగ్గర కృష్ణా నదిలో స్నానం చేసి బట్టలు ఉతుక్కుంటూ కానవచ్చారు. ‘అదేమిట’ని కలెక్టర్ ఆశ్చర్యంతో అడిగితే, ‘వున్నవి రెండే జతలు, ఏరోజుకారోజే ఉతుక్కోవడం తనకు అలవాట’ ని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పని చేసిన శ్రీ మండలి బుద్ధప్రసాద్, వావిలాల గురించిన ఒక ఆసక్తికర కధనాన్ని కొన్నేళ్ళ క్రితం రాసారు.

ఒకసారి వావిలాల గుంటూరు నుండి రైల్లో సత్తెనపల్లి వెడుతుంటే ఒక ముసలవ్వ ఆయన్ని తేరిపార చూసి, ‘బాబూ! గోపాల కిష్టయ్యవా’ అందట. ‘అవునవ్వా! నేను నీకు తెలుసా!’అన్నారాయన. ‘తెలియకపోవడమేంబాబూ, నువ్వేగా మాకు బువ్వ పెట్టింది, నందికొండ నువ్వు తీసుకురాకపోతే మాకు బువ్వేడది?’ అందట ఆ అవ్వ.

రాజకీయ పార్టీలను కాదని ఇండిపెండెంటుగా పోటీ చేసిన ఆయన్ని, నందికొండ (నాగార్జునసాగర్) ప్రాజెక్టు సాకారం కావడంలో ఆయన కృషిని గుర్తించి, అక్కడి ప్రజలు వరసగా అనేక పర్యాయాలు తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. తిరిగి అదే వావిలాల వారిని 72, 78 లో జరిగిన ఎన్నికల్లో ఓడించారు. అంటే ఎన్నికల్లో డబ్బు ప్రభావం అప్పటికే మొదలయిందన్న మాట. ఆ తరువాత వావిలాల ఎన్నికల రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకున్నారు.

ఇక మరో రాజకీయ సన్యాసి కధ. ఇది చాలామందికి తెలిసే అవకాశం లేదు.

కృష్ణాజిల్లాలోని (ఒకప్పటి) నందిగామ తాలూకా లో బొద్దిల్లపాడు అనే వూరు వుంది. ఆ గ్రామానికి వరసగా అనేక సంవత్సరాలపాటు సాయి అనే ఆయన సర్పంచుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వచ్చారు. చాలా సాదాసీదా మనిషి. సైకిల్ వేసుకుని ఊళ్ళు తిరుగుతూ ప్రజల సమస్యలని దగ్గరనుంచి గమనిస్తూ, వాటి పరిష్కారంకోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఆయన నిరాడంబరతను గమనించి స్థానికులు ఆయన్ని ‘నందిగామ గాంధీ’ అని పిలుచుకునే వాళ్ళు.

ప్రజలు ఏదైనా సమస్యతో వస్తే వాటిని పరిష్కరించే రాజకీయ నాయకులు చాలామంది వుంటారు. ఈ ‘గాంధీ’ అలా కాదు, ఎవరు ఎక్కడ ఏ సమస్యలతో వున్నారో వెతుక్కుంటూ సైకిల్ పై గ్రామాలు పట్టి తిరుగుతూ ఉండేవాడు. అందుకే చుట్టుపక్కల వూళ్ళ జనాలు ఆయన అంటే ప్రాణం పెట్టేవాళ్ళు. అలాటి గాంధీని ఒక రాజకీయ పార్టీ వాళ్ళు పట్టుకుని అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్ధిగా నిలబెట్టారు. అయన సైకిల్ మీదనే ప్రచారం చేసుకున్నారు. అయినా ఏం లాభం? సమస్యల పరిష్కారానికి పనికివచ్చిన మనిషి, ఎవరికి ఏ సమస్య వున్నా నేనున్నానంటూ పరిగెత్తుకు వచ్చే మనిషి ఎన్నికల్లో మాత్రం పనికి రాకుండా పోయాడు. ప్రజల చేతుల్లో పరాజయమే ఆ ‘నందిగామ గాంధీకి’ చివరికి మిగిలింది.

గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న చరిత్రను గమనిస్తే ఈ తరగతికి చెందిన ‘రాజకీయ సన్యాసులు’ ఇక చరిత్ర పుటలకే పరిమితం అన్న నిర్వేదం కలగడం సహజం. ఎన్నికల్లో చేతులు మారుతున్న డబ్బు సంచులు, ఏరులై పారుతున్న మద్యం, కులాల కుంపట్లు, వెరసి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియని అపహాస్యం పాలు చేస్తున్నాయి. ఎంతటి ప్రజాభిమానం కలిగిన నాయకులయినా, లేదా వారు నేతృత్వం వహించే పార్టీలయినా ‘నైతికతకు’ కట్టుబడి వ్యవహరించడం కనాకష్టంగా మారిన పరిస్తితులు ఏర్పడ్డాయి.

ఈ దుస్తితికి ఏ ఒక్కరో, ఏ ఒక్క పార్టీనోపార్టీనో కారణం కాదు. అందరికీ ఇందులో ఎంతో కొంత వాటా వున్న మాట నిజం. అందరికీ ఆ విషయం తెలుసు. తెలిసీ ఆ ‘అడుసు’ నుంచి బయటపడలేని అనివార్యత వాటిది.

ఎన్నికల్లో ఖర్చు అలవికాని విధంగా పెరిగిపోతోందని రాజకీయ నాయకులు తరచుగా అంటుంటారు. అయిదారు ఎన్నికల్లో వరసగా గెలుస్తూ వచ్చిన ఒకాయన, పోటీ చేయడం భవిష్యత్తులో తనవల్ల కాదని చెప్పారు.

ఓటర్లకు ఆశలు బాగా పెరిగిపోతున్నాయని వారి గొంతెమ్మ కోర్కెలు తీర్చడం కుదిరేపని కాదని రాజకీయ నాయకులు అంటుంటారు. ‘పదీపరకా తమకిచ్చి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గెలిచిన నాయకులు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాగించిన బేరసారాలతో పోలిస్తే ఇదెంత పాట’న్నది వారికి ఓటు వేసిన వారి అభిప్రాయం. ఓట్ల కొనుగోలు అన్నది ‘అభిలషించని అనివార్యత’ గా మారిపోయినప్పుడు ఇటువంటి తలనొప్పులు తప్పవు.

ఎన్నికలకు ముందు ‘ఎన్నికల ప్రణాళిక’ పేరుతొ ఓటర్లకు వేసే వాగ్దానగాలాలు ఒక ఎత్తు. గెలిచి అధికారంలోకి వచ్చిన తరువాత, పన్నుల పేరుతొ ఖజానాలో చేరిన ప్రజాధనాన్ని ‘రద్దుల’ పేరిట ఇష్టారాజ్యంగా పేలాలుగా పందారం చేయడం మరో ఎత్తు. ఈ ఎత్తుజిత్తులన్నీ అధికార పీఠాన్ని పది కాలాలపాటు పదిలం చేసుకోవడం కోసమే అని ఎవరయినా అంటే అసహనం ప్రదర్శించడం ఇంకో ఎత్తుగడ.

ఉపశ్రుతి: ముళ్ళపూడి వారి అప్పారావు పాత్ర అంటుందో సందర్భంలో. సూర్యుడు సముద్రం నుంచి మేఘాల రూపంలో నీటిని అప్పుతీసుకుని తిరిగి వానల రూపంలో చెల్లిస్తాడని. అలాగే వుంది నేటి రాజకీయ వ్యవస్థ.

ఎన్నికల్లో ఓట్లు కొనుక్కుని అధికారంలోకి రావడం, దాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారుల్లో సంపాదించిన డబ్బుని తిరిగి ఎన్నికల్లో గెలవడానికి ఖర్చు పెట్టడం. ఇదొక విష చక్ర భ్రమణం.

Written by – భండారు శ్రీనివాసరావు