iDreamPost
iDreamPost
అమరావతి అసెంబ్లీలో నీరు కారుతుంటే అయ్యో అనుకున్నారు. హైకోర్టు భవనంలోకి వర్షపు నీరు చేరితే అయ్యయ్యో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా బహుళార్థక సాధక ప్రాజెక్టు నిర్మాణంలోనే లోపాలు బయటపడుతున్నాయి. అత్యంత నాసిరకం నిర్మాణాల గుట్టురట్టవుతోంది.
అసెంబ్లీ, హైకోర్టు భవనాల లోపాలు అంతటితో సరిపోయాయి. కానీ పోలవరం నిర్మాణంలో తేడాలు వస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షల మంది ప్రజల భద్రతకు పెను ముప్పు ఏర్పడుతుంది. పోలవరం దిగువన ఇరువైపులా ఉన్న ప్రాంతాలన్నీ విలవిల్లాడాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన ప్రాజెక్టు విషయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించదన్నది తాజాగా వెలుగులోకి వచ్చింది. సుమారు 200 మీటర్ల పొడవునా డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడం కలవరపెడుతోంది. 2018లో నిర్మించిన డయాఫ్రం వాల్ ఇంత నాసిరకంగా ఉంటే ఇతర నిర్మాణాల పరిస్థితి ఏమిటోననే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ప్రాజెక్టులకు దిగువన డయాఫ్రం వాల్ కీలక నిర్మాణం. నదీ జలాలు విడుదలయినప్పుడు వాటి నియంత్రణలో ఈ వాల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే పనులు పూర్తికావస్తున్న దశలో డయాఫ్రం వాల్ వరదల సమయంలో కొట్టుకుపోయిన తీరు విస్మయకరంగా మారింది. గడిచిన రెండేళ్లలో వచ్చిన వరదలకే ఈ గోడ ఒకవైపు కొట్టుకుపోతే భవిష్యత్తులో మిగిలిన భాగం ఎంతమేరకు నాణ్యతతో నిలబడుతుందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అప్పట్లో ట్రాన్స్ ట్రాయ్, ఆ తర్వాత నయయుగ కంపెనీలు చంద్రబాబు హయంలో చేపట్టిన పనుల నాణ్యతపై సందేహాలు అలముకుంటున్నాయి.
వైఎస్సార్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టుని తన చేతుల మీదుగా ప్రారంభించాలనే సంకల్పంతో ఉన్న వైఎస్ జగన్ దానికి అనుగుణంగా చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా పనులు మేఘా కంపెనీకి అప్పగించడంతో బాధ్యతాయుతంగా పనులు సాగుతున్నాయి. కరోనా వంటి విపత్తులు, వరదల సమయంలో వచ్చిన ఆటంకాలను కూడా ఎదురొడ్డి స్పిల్ వే పనులు వేగంగా పూర్తి చేశారు. మే నాటికి స్పిల్ వే నిర్మాణం పూర్తిగా అయిపోతుందని పార్లమెంట్ లో కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. వచ్చే ఏడాదికి పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే ధీమా వ్యక్తం చేసింది. ఇలాంటి ఆశావాహ పరిస్థితుల్లో గత ప్రభుత్వ హయంలో చేపట్టిన నాణ్యతాలోపాలు వెలుగులోకి వస్తుండడంతో పోలవరం పరిస్థితి మరింత జాప్యం తప్పదా అనే అనుమానాలు వస్తున్నాయి.
ఇప్పటికే డయాఫ్రం వాల్ కొట్టుకుపోవడంతో 4 నుంచి 8 మీటర్ల లోతు వరకూ దానిని సరి చేయాల్సి ఉంటుంది. దానికోసం అదనపు వ్యయం. కాలం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. పైగా మొత్తం డయాఫ్రం వాల్ నిర్మాణమే నాణ్యతాలోపం తో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే మొత్తం పునర్నిర్మాణం పెద్ద పనితో కూడుకున్న అంశం. ఇప్పటికే కాఫర్ డ్యామ్ లో నాణ్యతాలోపం బయటపడింది. ఇప్పుడు డయాఫ్రం వాల్. ఇంకా మిగిలిన నిర్మాణా లపరిస్థితి ఏమిటన్నది అనుమానమే. ఎక్కడ తేడా వచ్చినా ఇలాంటి భారీ ప్రాజెక్టుల మూలంగా అపారనష్టం సంభవించే ముప్పు ఉంటుంది. దానికి అనుగుణంగా జాగ్రత్తలు పడాల్సింది పోయి కేవలం అవినీతితో అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి ఇప్పుడు గత ప్రభుత్వ వైఫల్యం అందరినీ కలచివేసే పరిస్థితిని తీసుకురావడం ఆందోళన కలిగిస్తోంది.
వాస్తవానికి డయాఫ్రం వాల్ నిర్మాణలోపాలను 2018లోనే గుర్తించిన నిపుణుల కమిటీ హెచ్చరించింది. వాటిని సరిచేయాలని ఆనాడే నిపుణులు ప్రబుత్వానికి హెచ్చరించినా పట్టించుకోని చంద్రబాబు వైఖరి మూలంగానే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయినట్టు కనిపిస్తోంది. ఆనాటి ప్రభుత్వ వైపల్యం ఇప్పుడు అందరూ పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో నాటి నష్టాన్ని కూడా నిర్మాణదారుడి నుంచే రికవరీ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది.