పోకిరీలో విలన్ గ్యాంగ్‌తో కలిసి ఉంటూ , చివరికి పోలీస్ ఆఫీసర్‌గా మహేశ్‌బాబు రివీల్ అవుతాడు. అదే విధంగా 1972లో వచ్చిన భలే మోసగాడులో కృష్ణ విలన్ గ్యాంగ్‌తో కలిసి ఉంటూ చివరికి సీఐడీ అని తెలుస్తుంది. ఇది తప్ప దానికి దీనికి పోలికలేం లేవు.
గూగుల్‌లో ఈ సినిమా రిలీజ్ 1972 అని ఉంది. అయితే అప్పటికే కృష్ణంరాజుకి అంతోఇంతో పేరుంది. కానీ దీంట్లో ఎలాంటి Importantce లేని సైడ్ క్యారెక్టర్ ఎందుకేశారో తెలియదు. గూగుల్ తప్పైనా ఉండాలి. క్యారెక్టర్‌ని ఎంచుకోవడంలో కృష్ణంరాజు తప్పైనా చేసి ఉండాలి.
కృష్ణ క్రైమ్ సినిమాల హవా నడుస్తున్నప్పుడు , ఆయన కాల్‌షీట్ దొరికితే చాలు రీళ్లు చుట్టేసే వాళ్లు. కథ , కాకర కాయ అక్కర్లేదు. రెండు క్లబ్ డ్యాన్సులు (అందులో ఒకటి జ్యోతిలక్ష్మిది) ఆరు ఫైట్స్ , నాలుగు ఛేజ్‌లు, మూడు డ్యూయెట్స్ సినిమాకి శుభం, ప్రేక్షకులకి జ్వరం. ఒక సినిమాని ఎంత చెత్తగా తీయొచ్చో ఇది ఒక ఉదాహరణ. డైరెక్టర్‌తో పని లేకుండా , కెమెరామన్, స్టంట్ మాస్టర్ , డ్యాన్స్ మాస్టర్ కలిసి తీసేసినట్టుంది.
సినిమా ప్రారంభం మాత్రం విమానం హైజాక్‌తో మొదలవుతుంది. బాబా అనే సైంటిస్ట్‌కి పనిలేక బంగారాన్ని తయారు చేసే ఫార్ములా కనిపెడ్తాడు. ఇది తెలిసిన రెడ్ టైగర్ (త్యాగరాజు) ఏకంగా విమానాన్నే హైజాక్ చేసి బాబాని ఎత్తుకెళ్తాడు. విమానాన్ని దింపాలంటే దానికో రన్‌వే ఉండాలని కూడా డైరెక్టర్‌కి తెలిసినట్టు లేదు (50 ఏళ్ల క్రితం విమానాన్ని ఆకాశంలో తప్ప నేల మీద చూసిన వాళ్లు తక్కువ కాబట్టి, ప్రేక్షకులకీ కూడా ఈ అనుమానం వచ్చి ఉండదు).
ఇంత బిల్డప్ ఇచ్చిన రెడ్ టైగర్ ఏదో చేస్తాడనుకుంటే ఏమీ చేయడు. పాత టైర్లు , తారు డ్రమ్ములు, చెక్క పీపాలున్న డెన్‌లో బాబాని , ఆయన కూతుర్ని బంధించి “చెప్పు , ఫార్ములా చెప్పు” అని బెదిరిస్తాడు. బాబా “నా కంఠంలో ప్రాణం ఉండగా చెప్పను” అని స్టాక్ డైలాగ్ వదుల్తాడు. ఎలా చెప్పవో చూస్తా అని రెడ్ టైగర్ ఒక గంటసేపు సినిమాలో ఆ విషయమే ఎత్తడు.
ఇంతలో విజయనిర్మల సీబీఐ ఆఫీసర్‌గా వస్తుంది. ఆమె తన డూప్‌తో అనేక ఫైటింగ్‌లు చేయిస్తూ , అపుడప్పుడు క్లోజప్‌లో కనిపిస్తుంది. ఒక హోటల్‌లో దిగితే, వరుసగా హత్యా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయినా హోటల్ ఖాళీ చేయదు.
ఆ హోటల్‌ని కృష్ణ నడుపుతూ ఉంటాడు. ఆయన రెడ్‌టైగర్ ముఠాకి సహకరిస్తూ ఉంటాడని రెడ్‌టైగరే చెబుతుంటాడు. ఏమి సహకరిస్తాడో మనకి తెర మీద మాత్రం కనపడదు.
కృష్ణంరాజు పోలీస్ ఇన్‌స్పెక్టర్. ఆ హోటల్ మీద రెయిడ్ చేయిస్తే ఏమీ దొరకదు. ఇలా అయితే లాభం లేదని యూనిఫారం తీసేసి ఒక పిల్లి గడ్డం అతికించుకుని వస్తాడు. జయకుమారి అనే ఆవిడ డ్యాన్స్ స్టార్ట్ చేస్తే వచ్చిన పని మరిచిపోయి మైమరిచి చూస్తూ ఉండగా రెడ్ టైగర్ మనుషులు బంధించి బాబాకు తోడుగా ఉంటాడని డెన్‌లో పెడతారు.
సెకెండాఫ్‌లో బంగారం విషయం గుర్తుకొచ్చి బాబాని హింసించి , ఆయన కూతుర్ని చంపుతామని రెడ్ టైగర్ బెదిరిస్తాడు. వెయ్యి మణుగుల బంగారం (పది వేల కిలోలు) తయారు చేసివ్వాలని ఆర్డర్ వేస్తాడు. అంత చేయాలంటే నాలుగు వేల కిలోల ఇత్తడి, ఐదు వేల కిలోల రాగి , వెయ్యి కిలోల బంగారం కావాలంటాడు.
ఇత్తడి, రాగి కావాలంటే మద్రాస్ మౌంట్‌రోడ్డులో దొరుకుతాయి. బంగారం దొరకాలంటే ప్రజా బ్యాంకు దోపిడీ తప్ప వేరే దారి లేదని ఆ పనిని కృష్ణకు అప్పగిస్తాడు రెడ్ టైగర్.
ఈ మధ్యలో కృష్ణ, విజయనిర్మల ఒక పాట పాడుకుంటారు. తర్వాత విజయనిర్మలకి తాను సీబీఐ ఆఫీసర్ అని గుర్తుకొచ్చి ఒక పిచ్చి విగ్ పెట్టుకుని రెడ్ టైగర్ డెన్‌కు వెళుతుంది. పోలీసోళ్లు తక్కువోళ్లు కాదు. ఆమె విసనకర్రలో కెమెరా అమర్చి , తమ ఆఫీస్ టీవీకి కనెక్షన్ ఇచ్చుకుని డెన్ కనపెడతారు.
విగ్ పెట్టుకొచ్చిన విజయనిర్మలని గుర్తు పట్టలేని రెడ్ టైగర్ పెద్దపెద్ద డైలాగ్‌లు చెబుతాడు. ఈ లోగా పిన్నులు సరిగా పెట్టుకోనందు వల్ల విగ్ ఊడిపోతే అగ్గి మీద గుగ్గిలమై ఆమె తలకి కరెంట్ పెడతాడు. బాబాకి కూడా అదే ట్రీట్‌మెంట్ చేస్తే ఒక చిత్తు కాగితంలో ఆయన రాసుకున్న ఫార్ములా బయటపడుతుంది.
ఆ కాగితం తీసుకుని ప్రేక్షకులు భయపడేలా నవ్వి బంగారం తయారు చేస్తానని అంటూ ఉండగా కృష్ణ, పోలీసులందరూ వచ్చి చితక్కొడుతారు. రెడ్ టైగర్ జీపులో పారిపోతుండగా హీరో చేజ్ చేయగా జీపు పల్టీలు కొట్టి రెడ్ టైగర్ డెడ్ టైగర్‌గా మారిపోతాడు. కృష్ణ సీబీఐ ఆఫీసర్‌ని మన చెవిలో పువ్వు, తెరపై శుభం కనిపిస్తాయి.