Idream media
Idream media
అయోధ్యపై వచ్చే తీర్పు ఏ వర్గానికి లాభమో, నష్టమో కాదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయోధ్యపై సుప్రీం శనివారం తీర్పును వెలువరించనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ స్పందించారు. ఈ తీర్పు భారత దేశ శాంతి, ఐక్యత మరియు సద్భావన గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా అయోధ్యపై సుప్రీం వెలువరించే తీర్పు ఒకరి విజయంగా, మరొకరి అపజయంగా చూడరాదని ప్రజానీకానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
‘‘అయోధ్యపై రేపు తీర్పు వెలువడనుంది. కొన్ని రోజులుగా ఈ విషయం సుప్రీం కోర్టులో నిరంతరం వినబడుతోంది. దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. ఈ సమయంలో సమాజంలోని అన్ని వర్గాలు దేశంలో సద్భావన నెలకొనడానికి చేసిన కృషిని ఎంతో అభినందిస్తున్నాను’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక, సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయని అన్నారు. కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్ దేశం కలిసి మెలిసి నిలబడదామని మోదీ పిలుపునిచ్చారు.