iDreamPost
android-app
ios-app

ఉపాధి మంత్రం చెప్పిన ప్రధాని మోడీ..! అదేమిటంటే..?

ఉపాధి మంత్రం చెప్పిన ప్రధాని మోడీ..! అదేమిటంటే..?

దేశంలో నిరుద్యోగ రేటు రోజు రోజుకు పెరుగుతోంది. గత ఆరేళ్ళలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగ రేటు పెరిగింది. దేశంలో గత 45 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్ వల్ల కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. దాదాపు 23 కోట్ల మంది ఉపాధి కోల్పోయినట్లు ప్రభుత్వ సంస్థలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ యువతకు ఉపాధి మంత్రం చెప్పారు.

“వరల్డ్‌ యూత్‌ స్కిల్‌ డే” సందర్భంగా ప్రధాని మోడీ యువతకు వీడియో ద్వారా తన సందేశాన్నిచ్చారు. ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారితో దాదాపు అన్ని దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సంక్షోభ సమయంలో యవత ఉపాధిని మార్గాలను అన్వేషించుకోవడంతోపాటు ఉద్యోగ విపణిలో దీటుగా నిలబడేందుకు ప్రధాని మోడీ పలు సూచనలు చేశారు. ‘’స్కిల్‌, రీ-స్కిల్‌, అప్‌స్కిల్’‌’ ఎంతో కీలకమని, ఇదే యువతకు ఉపాధి మంత్రమని ప్రధాని సూచించారు. ఉద్యోగ విపణిలో నిలదొక్కుకోవడానికి ఇవి ఎంతో ముఖ్యమని మోడీ అన్నారు.

నైపుణ్యం అనేది మనకు మనమే స్వయంగా అలవరచుకొని వృద్ధి చేసుకునేది. నైపుణ్యం అనేది స్వావలంబన కలిగించడమే కాకుండా మనతోపాటు తోటివారికి ఉపాధి కల్పిస్తుంది. ఇలాంటి సంక్షోభ సమయంలో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ఎంతో కీలకమని దేశయువతకు ప్రధాని మోడీ సూచించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో పని విధానంతోపాటు ఉద్యోగ స్వభావం కూడా మారిపోయింది. దీనికితోడు సాంకేతిక పరిజ్ఞానంలోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సందర్భంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత నూతన నైపుణ్యాలను పొందుతోందని ప్రధాని అభిప్రాయపడ్డారు.

నేడు వేగంగా మారుతున్న ప్రపంచంలో, అనేక రంగాలలో మిలియన్ల మంది నైపుణ్యం గల వ్యక్తుల అవసరం ఉందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆరోగ్య సేవల్లో నైపుణ్యం గల వారి అవసరం అధికంగా ఉందన్ననారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ‘’స్కిల్ ఇండియా మిషన్‌’’ను ప్రారంభించిందని తెలిపారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా వందలాది ప్రధాన మంత్రి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ప్రారంభించబడ్డాయన్నారు. ఐటిఐల సంఖ్యను పెంచామని, లక్షలాది కొత్త సీట్లను చేర్చామన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా యువతలో నైపుణ్య అభివృద్ధి జరిగిందని తెలిపారు.  

నాలుగైదు రోజుల క్రితం దేశంలోని కార్మికుల కోసం ‘‘స్కిల్ మ్యాపింగ్ పోర్టల్’’ని ప్రారంభించామని మోడీ తెలిపారు. నైపుణ్యం కలిగిన వ్యక్తులను, కార్మికులను మ్యాపింగ్‌ చేయడంలో ఈ పోర్టల్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థలు, ఈ పోర్టల్‌ ద్వారా నైపుణ్యం కలిగిన కార్మికులను ఒకే క్లిక్‌తో చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. కరోనా వల్ల ఏర్పడిన ఈ సంక్షోభం ప్రపంచంలో అన్నిదేశాలలో సమానంగా ఉంటుందన్నారు. ఈ ప్రభావంతో ఉద్యోగ స్వభావం కూడా మారిందన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతికత కూడా ఉద్యోగులను ప్రభావితం చేస్తుందని తెలిపారు. చిన్న, పెద్ద ప్రతి రకమైన నైపుణ్యం కూడా స్వావలంబన భారతదేశానికి చాలా పెద్ద శక్తిగా మారుతుందని మోడీ స్పష్టం చేశారు.

ఈ సందర్భంలో వలస కార్మికులకూ తోడుగా నిలవాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉపాధి కల్పించే సంస్థలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పోర్టల్‌ ద్వారా నైపుణ్యమున్న కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచించారు. కరోనా కారణంగా తమ సొంత ప్రాంతాలకు వెళ్లిన కార్మికులకు ఇది ఎంతగానో తోడ్పడుతుందని ప్రధానమంత్రి అన్నారు. యువతను నైపుణ్యమున్న కార్మిక శక్తిగా మలిచేందుకు ప్రభుత్వం ప్రారంభించిన స్కిల్‌ ఇండియా మిషన్‌ ద్వారా గత ఐదు సంవత్సరాలలో ఇప్పటివరకు దాదాపు ఐదు కోట్ల మంది యువత వివిధ రంగాల్లో తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకున్నట్లు ప్రధాని వెల్లడించారు.