Idream media
Idream media
కరోనా కలకలం అనంతరం ఆరుమాసాలుగా దేశంలోని 130 కోట్ల మందిని రక్షించే బాధ్యతను ప్రభుత్వాలు తలకెత్తుకున్నాయి. వ్యాధి వ్యాప్తి అరికట్టేందుకు నిబంధనలు, నిషేధాజ్ఞలు విధించాయి. పోలీసు బలగాలతో కట్టుదిట్టం చేశాయి. అయినప్పటికీ కొందరిలో నిబంధనలు పాటించాలన్న చైతన్యం రాలేదు. రోజురోజుకు కరోనా బాధితులు పెరుగుతూనే ఉన్నారు. అయితే ఈ కాలంలో కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు దీనిపై స్పష్టత పెరిగింది. ఇప్పటికే రోగగ్రస్తులకు అవసరమైన మందులు అంచెలంచెలుగా అందుబాటులోకొస్తున్నాయి. మరోవైపు రోగం రాకుండా కట్టడి చేయగలిగే టీకాలు దేశీయంగా అభివృద్ధి చేస్తున్నట్లు సాక్షాత్తు ప్రధానమంత్రి ఎర్రకోట ప్రసంగంలో వెల్లడించారు.
సహజీవనంతో కూడిన జీవితం..
ప్రధాని నరేంద్రం మోదీ నుంచి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ వరకూ అందరూ ఎప్పటి నుంచో చెబుతున్న మాట కరోనాతో సహజీనం చేస్తూ బతకాల్సిందే అని. ఇప్పటికే చాలా వరకూ అదే జరుగుతోంది కూడా. సెప్టెంబర్ 1 నుంచి పూర్తి స్థాయిలో సాధారణ జనజీవితం కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఇక కరోనా నుంచి రక్షించుకునే బాధ్యత ప్రతి వ్యక్తిపైనా పడింది. తమ కుటుంబ సభ్యులు, సహచరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతర రోగాల తరహాలోనే ప్రభుత్వాస్పత్రిలో దీనికి వైద్యం లభిస్తుంది. ఇక పరిశ్రమలు, వ్యాపార సంస్థలు యదావిధిగా పనులు ప్రారంభించొచ్చు. అయితే వీటిలో పని చేసే కార్మికులకు కరోనా నుంచి రక్షణ చర్యల్ని మాత్రం ఆయా సంస్థల యాజమాన్యాలే భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైతే కార్మిక చట్టంలో సవరణలకు కూడా కేంద్రం సిద్దపడుతోంది.దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణంటూ కేంద్రం నడుంకడుతోంది. ఇందుకోసం లాక్‌డౌన్ ఆంక్షలన్నింటినీ ఈనెలాఖరుతో ఉపసంహరించేందుకు సమాయత్తమౌతోంది.
వైద్య సేవలు కొనసాగిస్తూ…
కొవిడ్–19కు సంబంధించి ప్రభుత్వం తన పాత్రను పరిమితం చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ వైరస్ బారిన పడకుండా ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇక ఏర్పడనుంది. ప్రజలకే ఈ బాధ్యతను బదలాయించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. రోగులకు వైద్యం తప్ప మిగిలిన ఏ అంశాల్లోనూ సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వాలు తలదూర్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నెలాఖరుతో అన్ని నిబంధనలు ఉపసంహరించబడితే విద్యాలయాలు, షాపింగ్‌మాల్స్, సినిమా థియేటర్లు, రైల్వేస్టేషన్లు.. ఇలా ఒకటేమిటి అన్నీ తిరిగి ప్రారంభమయ్యేందుకు మార్గం ఏర్పడుతుంది. ఇకముందు కరోనాను ప్రభుత్వాలు ఒక వ్యాధిగానే పరిగణించాలన్న నిర్ణయానికొచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఇతర వ్యాధుల తరహాలోనే దీన్ని కూడా చూస్తాయి. ఈ వ్యాధి సోకకుండా రక్షించుకునే బాధ్యత ఇక ప్రజలదే. వ్యాధిగ్రస్తులైతే అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులకే తొలి ప్రమాదం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికి వారు నిబంధనల్ని తమంత తాము రూపొందించుకుని అమలు చేయాలి. వ్యాధిగ్రస్తులన్న సందేహమొస్తే ప్రభుత్వ వైద్యశాలకెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. వైద్యం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా అందిస్తాయి.
ఆర్థిక వ్యవస్థ పటిష్ఠతకు తప్పదు…
ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్-19పై పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృక్పథాలు మారుతున్నాయి. కోవిడ్‌తో సహ జీవనం తప్పదన్న నిర్ణయానికొచ్చేశాయి. దేశంలో కోవిడ్ ప్రబలిన తొలినాళ్ళలోనే దీని నియంత్రణకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిం చింది. వేగంగా స్పందించింది. మూడు విడతలుగా లాక్‌డౌన్ ప్రకటించింది. అనంతరం అంచెలంచెలుగా లాక్‌డౌన్‌ల ఉపసంహరణ మొదలెట్టింది. అయితే మార్చి 24న మొదలైన లాక్‌డౌన్‌ల ప్రక్రియ సడలింపు ఇంకా పూర్తి కాలేదు. ఈ ఆరుమాసాల్లో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. ఉత్పాదకత పడిపోయింది. వ్యాపారాలు నిర్వీర్యమయ్యాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. బ్యాంకింగ్ నుంచి అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అభివృద్ధి నిలిచిపోయింది. సంక్షేమానికి కొంతమేర నిధులందాయి. ఇదే పరిస్థితి మరికొన్నాళ్ళు సాగితే పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వాలు పంథా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు, 0సినిమా థియేటర్లు, మెట్రో రైళ్లు అన్నీ అంచలంచెలుగా తెరుచుకునే అవకాశాలు ఉన్నాయి. వాటి సేవలన్నీ పొందుతూ కరోనా బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక ప్రజలదే.