iDreamPost
iDreamPost
సినిమా పరిశ్రమే కాదు ఏ రంగంలోనైనా విజేతలకే గుర్తింపు. మనిషి విలువను ఆ క్షణంలో గుర్తుంచకపోయినా ఆ తర్వాత అతను గొప్ప విజయాలను అందుకున్నప్పుడు అందరూ వెంటపడే వాళ్లే ఉంటారు. అలాంటి ప్రత్యక్ష అనుభవం ఒకటి హాస్య నటులు రేలంగి గారికి ఎదురయ్యింది. వివరాల్లోకి వెళ్తే అప్పట్లో రేలంగికి అశేషమైన ఫాలోయింగ్ ఉండేది.పోస్టర్ మీద బొమ్మ కనపడినా పిల్లాపెద్దా తేడా లేకుండా నవ్వుకునే వాళ్ళు. స్టేజి మీద మాట్లాడేటప్పుడు సైతం చతురోక్తులతో హాస్యాన్ని పండించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.అందుకే రేలంగి గారు ఎప్పుడైనా ముభావంగా ఉన్నా అది కూడా కామెడీలో భాగమే అనుకునేవాళ్లు చుట్టుపక్కన ఉండే జనం.
1955లో రేలంగి గారికి హైదరాబాద్ లో ఓ సన్మానం చేశారు. ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఆధ్వర్యంలో ప్రముఖ రంగస్థలోపాసకులు స్థానం నరసింహారావు గారు రేలంగికి సుగంధాల పన్నీరు జల్లి శాలువా కప్పి పూల మాల వేశారు. ఇది జరుగుతున్నంత సేపు రేలంగి కన్నీరు పెడుతూనే ఉన్నారు. సభకు వచ్చిన వారు అది కూడా ఏదైనా వ్యంగ్యంలో భాగమేమో అనుకున్నారుకానీ రేలంగి మాట్లాడుతూ తాను నిజంగానే ఏడుస్తున్నానని చెప్పి అందరికి షాక్ ఇచ్చారు.
స్థానం నరసింహరావు కారణం ఏమిటి నాయనా అని అందరి ముందే అడిగారు. దాని రేలంగి బదులిస్తూ కొన్నేళ్ల క్రితం వేషాలు కావాలని తమరి దగ్గరకు వచ్చినప్పుడు నటనంటే నీకేం తెలుసని నువ్వు వేషాలు వేస్తావా పోవయ్యా పో అని తిప్పి పంపేశారని అలాంటిది మీరే ఇంతగొప్పగా సన్మానిస్తుంటే ఆనందంతో కన్నీళ్లు ఆగలేదని చెప్పి గొంతు మూగబోవడంతో సభికులంతా ఉద్వేగంతో అలా కాసేపు మౌనం వహించారు.
రేలంగి మాటలు వింటున్నంత సేపూ వాళ్ల హృదయాలు ద్రవించిపోయాయి. తమను పగలబడి నవ్వించే రేలంగి నట జీవితం వెనుక ఇన్ని అవమానాలు ఉన్నాయాని మాట్లాడుకున్నారు. నరసింహరావు గారు సైతం ఈ సంఘటనకు కదిలిపోయి రేలంగిని ఆత్మీయ ఆలింగనం చేసుకుని అప్పుడు జరిగిన దానిని మనసులో పెట్టుకోకని కోరడంతో అప్పటిదాకా గంభీరంగా ఉన్న వాతావరణం తిరిగి యథాస్థితికి వచ్చేసింది.