iDreamPost
android-app
ios-app

మేజిక్ చేసిన తొలిప్రేమ – Nostalgia

  • Published Jul 01, 2020 | 1:13 PM Updated Updated Jul 01, 2020 | 1:13 PM
మేజిక్ చేసిన తొలిప్రేమ – Nostalgia

(పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమా చూసిన అప్పటి ఓ టీనేజ్ యువకుడి జ్ఞాపకాల మాలిక)

మా ఊరి నడిబొడ్డున నవరంగ్ థియేటర్….

నా వయసు 17 ఏళ్ళు…….

అప్పటికే చిరంజీవి తమ్ముడి సినిమా చాలా బాగుందనే టాక్ మా ఇంటర్ మీడియట్ బ్యాచుల్లో మలేరియా జ్వరంలాగా స్ప్రెడ్ అయిపోయింది. విడుదల రోజే చూసేసిన స్నేహితులు దాని గురించి విపరీతంగా చెప్పడంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆత్రం కాలు నిలవనీయడం లేదు. ఐదు రోజులు దాటింది. నేను చదివే ఆదోనిలో ఫస్ట్ వీక్ చూసేందుకు సాధ్యపడలేదు. ఏదో పెళ్లి ఉందని నాన్న కర్నూల్ తీసుకెళ్తే అక్కడ దొరికింది ఛాన్స్. హాలు దగ్గరికి వెళ్తే ఒకటే తొక్కిడి. టికెట్ కౌంటర్లోకి దూరాలంటే ఆక్సీజెన్ మాస్క్ ఉంటే తప్ప ప్రాణాలతో బయటపడతామన్న గ్యారెంటీ లేదు. బ్లాక్ లో కొందామంటే ఒక్క టికెట్ డబ్బుతో తిరుపతి వెళ్లి ఏడుకొండలవాడి దర్శనం చేసుకుని తిరిగి వచ్చాక కూడా పర్సులో కొంత చిల్లర ఉంటుంది. ఆ స్థాయిలో రేట్లు పలుకుతున్నాయి.

వందల్లోనో వేలల్లోనో లెక్కబెట్టలేనంత జనం. యూత్ మిడిల్ ఏజ్ లేడీస్ చిన్నపిల్లలు ఫ్యామిలీస్ వృద్ధ బ్యాచులు వారా వీరా అని తేడా లేకుండా ఏదో జాతర వాతావరణాన్ని తలపించేలా ఊపిరాడనంత రద్దీ. కండబలం ఉన్నవాడు కౌంటర్ దగ్గర గుంపును నెట్టుకుని మరీ దర్జాగా టికెట్లు తెచ్చుకుంటున్నాడు. డబ్బు మదం ఉన్నవాడు బ్లాక్ లో కొనుక్కుని మైసూర్ మహారాజా లెవెల్ లో బిల్డప్ ఇచ్చుకుంటూ షోలు చేస్తున్నాడు. రెండూ లేని నాలాంటి వాడు బేలచూపులతో పాస్ పోర్ట్ పోగొట్టుకున్న బంగ్లాదేశ్ శరణార్థిలా దిక్కులు చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.

ఏదో అద్భుతం జరిగినట్టు ఓ తెలిసిన మొహం కనిపించడం, అన్నా ఓ టికెట్ ఇప్పించమని వారం రోజులుగా భోజనం చేయని వాడిలా ఎక్స్ ప్రెషన్ పెట్టి బ్రతిమాలుకోవడం, వాడు ఏ మూడ్ లో ఉన్నాడో సాక్షాత్తు దేవదేవుడిలా అసలు ధరకే ఓ ముక్క నా చేతిలో పెట్టడం లోపలికి అడగుపెట్టడం చకచకా జరిగిపోయాయి. ఓ పది ఇరవై రోజులు ఆగితే తాపీగా చూడగలిగే ఓ వినోద సాధనాన్ని ఇంత తాపత్రయ పడుతూ ఎందుకు చూడాలనిపిస్తుందో ఇప్పటికీ మొదటి రోజు మాత్రమే సినిమాలు చూసే నాకు అంతు చిక్కని ప్రశ్న

నేనీ సినిమా గురించి ఎలాంటి విశ్లేషణలు చేయదలుచుకోలేదు. ఇది కేవలం అనుభూతిని వివరించే ప్రయత్నం మాత్రమే. తెరమీద పవన్ ఎంట్రీకి దేవా కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈలలు కేకల మధ్య గాలిలో కలిసిపోవడం మినహాయిస్తే ఓ ప్రేమ కథ ను ఇలా కూడా చెప్పవచ్చా అంటూ తెరకు కళ్ళప్పగించి అలా చూస్తుండిపోయిన ప్రేక్షకుల హావభావాలు, అభిమానుల ఆనందాల కేరింతలు నాకిప్పటికీ గుర్తే. హీరో హీరోయిన్ కనీసం ఒకరినొకరు ముట్టుకోకుండా రెండున్నర గంటల పాటు కుర్చీలో కదలకుండా కూర్చోబెట్టారంటే ఆ దర్శకుడు కరుణాకరన్ ఎవరా అని సినిమా మ్యాగజైన్లు వెతికి మరీ చూసుకోవడం ఇంకా మర్చిపోలేదు

ఒక మాములు మధ్యతరగతి కుటుంబ నేపథ్యం….

ఇంటి పక్కనే కిటికీలో నుంచి తొంగిచూసినట్టు అనిపించే సహజమైన కథనం….

అన్నాచెల్లెళ్ల బంధాన్ని సున్నితంగా స్పృశిస్తూ మనకు తెలియకుండానే గుండెను తడి చేసి మెలిపెట్టే హృద్యమైన మనోహర దృశ్యం….

ప్రేమంటే ఆకర్షణ కాదని అంతకు మించిన బాధ్యతని నవ్వుతూ ఏడిపిస్తూ వెక్కిరిస్తూ చెప్పిన వైనం…..

ఒకటా రెండా తొలిప్రేమ గురించి ఇలా చెప్పుకుంటూ ఓ పుస్తకం రాసేలా ఉన్నా. ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తా. ఉదయం నుంచి మిత్రులు దీని తాలూకు జ్ఞాపకాలను పోస్టర్లు పోస్టుల రూపంలో పంచుకుంటే నాకూ మనసు ఆగలేదు. అందుకే ఇదంతా రాసి మీతో చదివించాల్సి వచ్చింది

సెలవు
ఇట్లు
మంచి సినిమా చూసిన ప్రతిసారి దానితో తొలిప్రేమలో పడిపోయే
ఓ సినిమా ప్రేమికుడు