Idream media
Idream media
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఏడుగురికి పద్మ విభూషణ్.. 10 మందికి పద్మ భూషణ్.. 102 మంది పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. దివంగత సంగీత దిగ్గజం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పద్మవిభూషణ్.. సినీగాయని చిత్ర పద్మభూషణ్ పొందారు. మరణానంతరం అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, మాజీ కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్‌లు పద్మభూషణ్ పొందారు. ఇక విదేశం నుంచి జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు పద్మవిభూషణ్ దక్కింది. వీటితో పాటు అమర జవాన్ కల్నల్ సంతోష్‌బాబుకు కేంద్రం మహా వీరచక్ర పురస్కారం ప్రకటించింది.
తెలుగురాష్ట్రాల నుంచి నలుగురు…
కేంద్రం ప్రకటించిన పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సంగీత విద్వాంసులు అన్నవరపు రామస్వామి, నిడుమోలు సుమతి, పద్యకవి ఆశావాది ప్రకాశరావులకు ఈ పురస్కారం లభించింది. వీరిలో అన్నవరపు రామస్వామి, సుమతి ఇద్దరూ పశ్చిమ గోదావరిలోనే జన్మించారు. విజయవాడలో స్థిరపడ్డారు. అన్నవరపు రామస్వామి 1923 మార్చి 23న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామంలో జన్మించారు. పెద్దయ్య, లక్ష్మి ఆయన తల్లిదండ్రులు. మొత్తం పది మంది సంతానంలో రామస్వామి ఎనిమిదోవారు. ఒకటో తరగతి వరకే చదువుకున్న ఆయన, ఎనిమిదేళ్ల వయస్సులో ఏలూరులోని మాగంటి జగన్నాథ చౌదరి అనే సంగీత విద్వాంసుడి వద్ద వయోలిన్ శిక్షణ తీసుకున్నారు.
13వ ఏట నుంచే సంగీత కచేరీలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ తర్వాత విజయవాడలో పారుపల్లి రామకృష్ణ పంతులు వద్ద శిక్షణ పొందారు. అక్కడే శిక్షణ పొందుతున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణతో స్నేహం ఏర్పడి, ఒకే ప్రాణంలా మెలిగారు. బాలమురళీకృష్ణ చేసిన 10వేలకు పైగా కచేరీల్లో అన్నవరపు వయోలిన్ సహకారమందించారు. అన్నవరపు సంగీతంలో ఉన్న సప్తస్వరాల్లో నాలుగు స్వరాలతో రెండు కొత్త రాగాలను సృష్టించారు. సగమని స్వరాలతో వందన రాగాన్ని, సమపద స్వరాలతో శ్రీదుర్గ రాగాలను చేశారు. 1986లో రామస్వామి శిష్యులంతా కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఆయనకు షష్టిపూర్తి ఉత్సవం నిర్వహించారు. దానికి మంగళంపల్లి బాలమురళీకృష్ణ చైర్మన్‌గా వ్యవహరించారు.
మృదంగ విద్వాంసురాలు నిడుమోలు సుమతి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 1950లో జన్మించారు. రాఘవయ్య, వెంకటరత్నం ఆమె తల్లిదండ్రులు. తండ్రి మృదంగ విద్వాంసుడు కావడంతో చిన్నతనం నుంచే ఆయన వద్ద సుమతి శిక్షణ తీసుకున్నారు. విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో దండమూడి రామ్మోహనరావు వద్ద శిక్షణ పొందారు. తర్వాత ఆయననే వివాహం చేసుకున్నారు. మంగళంపల్లి బాలమురళీకృష్ణతోపాటు ఎందరో ప్రముఖ సంగీత విద్వాంసులకు సుమతి మృదంగ సహకారం అందించారు. విజయవాడ ఆకాశవాణిలో ఆమె ‘ఏ’ గ్రేడ్ కళాకారిణి. మృదంగ శిరోమణి, మృదంగ మహారాణి, నాదభగీరథ, మృదంగలయ విద్యాసాగర వంటి బిరుదులు అందుకొన్నారు. 1974, 82, 85 సంవత్సరాల్లో ఉత్తమశ్రేణి వాయిద్య కళాకారిణిగా ఎంపికయ్యారు. 2009లో సుమతిని కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం వరించింది. ‘లయవేదిక’ అనే సంస్థను స్థాపించి.. భర్త దండమూడి రామ్మోహనరావు పేరుమీద మృదంగ కళాకారులను ఏటా సన్మానిస్తున్నారు.
అనంతపురం జిల్లా నుంచి…
పద్యకవి, అవధాని ఆశావాది ప్రకాశరావు అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవలి గ్రామంలో 1944 ఆగస్టు 2న జన్మించారు. ఎలిమెంట్రీ స్కూల్ టీచర్ పక్కీరప్ప, కుళ్లాయమ్మ ఆయన మాతాపితలు. స్కూల్‌లో 8వ తరగతి చదివేటప్పుడు తెలుగుపండితుడు పులిపాటి సుబ్బరామయ్య ఆయనకు చందస్సుపై మంచి పట్టు కల్పించారు. 10వ తరగతికల్లా ఆశావాది పద్యాలు రాయగల సామర్థ్యాన్ని పెంచుకున్నారు. సాహిత్యసాధన చేస్తూ డిగ్రీ మొదటి సంవత్సరంలోనే తొలి అవధానం చేశారు. గుర్రం జాషువా స్ఫూర్తితో తన సాహిత్య ప్రయాణం మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఇతర ఏ జిల్లావాసీ రాయనన్ని గ్రంథాలు పద్యకవిత్వ ప్రక్రియలో వెలువరించారు. ఇప్పటికి 60 గ్రంథాలు ముద్రించారు. 170 అవధానాలు చేశారు. ఆయన సాహితీ కృషిపై 22 గ్రంథాలు వెలువడ్డాయి. వివిధ విశ్వవిద్యాలయాలు ఆయన రచనలను పాఠ్యాంశాలుగా స్వీకరించాయి.
ఇక తెలంగాణ నుంచి ఆర్ట్ విభాగంలో కనక రాజుకు పద్మశ్రీ దక్కింది.మార్లవాయి గ్రామానికి చెందిన కనకరాజు 1940లో జన్మించారు. గుస్సాడి కళా రూపం అంతరించి పోకుండా కృషి చేశారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధి ముందు తొలిసారిగా ఆదివాసీల సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. అబ్దుల్ కలామ్ రాష్ట్రపతి గా ఉన్నప్పుడు రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోటపై తన భృందంతో ఈ నృత్యం ప్రదర్శించి ప్రపంచానికి పరిచయం చేశారు. గుస్సా డి రాజుగా గుర్తింపు పొందిన కనకరాజు ను ఇప్పుడు పద్మం వరించింది.