అమావాస్య రోజున గ్రేటర్ మేయర్ ఎన్నిక జరుగుతుందా… లేదా..? అని ఓ వైపు సందేహాలు ఉండగా మరోవైపు.. ఎన్నికకు ఎన్నికల కమిషనర్ అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. 11వ తేదీన ప్రత్యేక సమావేశానికి హాజరు కావాలని ఎక్స్‌అఫిషియో సభ్యులు, కార్పొరేటర్లకు ఫారం-2 ద్వారా సమాచారం పంపారు. ఎన్నిక జరిగే కౌన్సిల్ హాల్లో ప్రోటో కాల్ ప్రకారం సీట్ల కేటాయింపు కూడా చేస్తున్నారు. ముందు మంత్రుల పేర్లు ఉండాలని, అనంతరం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల పేర్లు అల్ఫాబెటికల్ ఆర్డర్‌లో ఉండేలా చూడాల న్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేల తరువాత మంత్రుల పేర్లు ఉండొద్దని ఉనతాధికారులు సూచించారు. మరోవైపు మేయర్ ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నారు. ప్రస్తుత మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన సతీమణి, చర్లపల్లి తాజా కార్పొరేటర్ బొంతు శ్రీదేవీయాదవ్‌లు తాజాగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును ప్రగతిభవన్‌లో కలిశారు. ఈ నెల 11వ తేదీన కొత్త పాలకమండలి కొలువుదీరనున్న నేపథ్యంలో వారు కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మేయర్ పదవి రేసులో పలువురి పేర్లు వినిపిస్తోన్న తరుణంలో ప్రస్తుత మేయర్ ప్రగతిభవన్‌కు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి పాలకమండలి గడువు 10వ తేదీతో ముగియనుంది. ప్రస్తుత మేయర్ రామ్మోహ్ పదవీ నుంచి దిగిపోనున్నారు. కొత్త మేయర్ ఎంపికకు అధికార టీఆర్‌ఎస్‌లో కసరత్తు ప్రారంభమైందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరోసారి అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ను కలిసి కోరి ఉంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రామ్మోహన్ మాత్రం దీనిపై భిన్నంగా స్పందించారు. ఎన్నికల ఫలితాల అనంతరం సార్‌ను కలవలేదని, అందుకే వెళ్లామని చెప్పారు. చర్లపల్లి నుంచి కార్పొరేటర్‌గా ఎన్నికై మేయర్ అయిన రామ్మోహన్… మేయర్ పదవి మహిళా జనరల్‌గా రిజర్వ్ కావడంతో సతీమణిని రంగంలోకి దింపారు. మేయర్ పదవి కోసమే ఆమెను పోటీలో నిలిపారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు భిన్నంగా వెలువడిన నేపథ్యంలో ఎలాంటి వివాదాలు లేకుండా.. అందరిని కలుపుకొని సమర్ధవంతంగా పాలకమండలిని ముందుకు నడిపే వారికి అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. అలాగే భారతీనగర్ డివిజన్ నుండి గెలుపొందిన సింధూ ఆదర్శ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయ శాంతి రెడ్డి , ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెంది మన్నె గోవర్దన్ రెడ్డి భార్య మన్నె కవితారెడ్డి, సికింద్రాబాద్ నియో జకవర్గానికి చెందిన మోతె శోభన్ రెడ్డి భార్య శ్రీలత, టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ఇలా తదితరులు కూడా తమ ప్రయత్నాల్లో అధినేతలను కలుస్తున్నారు.
ఈ ఎన్నికలలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 44 మందికి ఇక్కడ ఓటు హక్కు ఉందని అధికారులు నిర్ధారించారు. ఇందులో టీఆర్‌ఎస్ బలం-32 కాగా.. ఎంఐఎం-10, బీజేపీకి ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులున్నారు. కౌన్సిల్‌లో టీఆర్‌ఎస్ బలం-88, ఎంఐఎం-54, బీజేపీ-49గా ఉంది. నిబంధనల ప్రకారం ఎక్కువ సభ్యుల మద్దతున్న వారికి మేయర్ పీఠం దక్కనుంది. మొత్తం సభ్యులు 193 మందిలో ప్రత్యేక సమావేశానికి 97 మంది హాజరైతేనే కోరం ఉన్నట్టుగా పరిగణిస్తారు. అప్పుడే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరుగుతుంది. టీఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ ఎంపీలలో డీ శ్రీనివాస్, కేఆర్ సురేష్‌రెడ్డి, సంతోష్‌కుమార్, డాక్టర్ కే కేశవరావు, లక్ష్మికాంతరావు, లోక్ సభ ఎంపీగా కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు వీ భూపాల్‌రెడ్డి, పురాణం సతీష్‌కుమార్, మహ్మద్ మహమూద్ అలీ, టీ. భానుప్రసాద్‌రావు, ఎంఎస్. ప్రభాకర్‌రావు, నారదాసు లక్ష్మణరావు, బొగ్గారపు దయానంద్, బాలసాని లక్ష్మినారాయణ, కల్వకుంట్ల కవిత, మహ్మద్ ఫరిదుద్దీన్, సత్యవతి రాథోడ్, బస్వరాజు సారయ్య, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు- ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ,. టీ పద్మారావు, జీ సాయన్న, మైనంపల్లి హన్మంతరావు, భేతి సుభాష్‌రెడ్డి , దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, అరెకపూడి గాంధీ, ఎల్వీన్ స్టీఫెన్‌సన్ (నామినేటెడ్ ఎమ్మెల్యే), ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీలు మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండీ, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు – అహ్మద్ బిన్ అబ్దుల్ బలాల, జాఫర్ హుస్సేన్, కౌసర్ మొహినుద్దీన్, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, అక్బరుద్దీన్ ఓవైసీ, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, మహ్మద్ మొజం ఖాన్, బీజేపీ నుంచి ఎంపీ కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే – రాజాసింగ్ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ఉన్నారు. ఎక్స్‌అఫిషియో సభ్యుల సంఖ్యతో చూసుకుంటే బీజేపీ గ్రేటర్ లో మూడో స్థానం లో ఉంది.