iDreamPost
android-app
ios-app

ప్లాస్మా డోనర్లు…పట్టుమని పది మందేనా…?!

ప్లాస్మా డోనర్లు…పట్టుమని పది మందేనా…?!

ప్రభుత్వం, ప్రజలు కలిసికట్టుగా పనిచేసినప్పుడే కరోనాను పూర్తిగా జయించగలం. కానీ, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే కరోనాపై పోరు కేవలం ప్రభుత్వాలకే పరిమితమైందా? ప్రజలకు పట్టదా అనే సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కేవలం పది మంది మాత్రమే ప్లాస్మా దానం చేయడం చూస్తుంటే కరోనాపై పోరులో పౌర సమాజం సరిగ్గా స్పందించడం లేదనే వాదనకు బలం చేకూరుతోంది.

కరోనా చికిత్సలో ప్లాస్మా థెరపీ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందింది. ప్లాస్మా థెరపీ కోసం కరోనా నుంచి కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారి నుంచి ప్లాస్మాను సేకరిస్తారు. అలా సేకరించిన ప్లాస్మాను విషమ పరిస్థితిల్లో ఉన్నవారికి ఇస్తారు. ఈ ప్రక్రియనే ప్లాస్మా థెరపీ అంటారు. ప్రస్తుతం అన్ని దేశాల వైద్యులు ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు.

ఏపీలో జూలై 24 నాటికి 39,935 వేల మంది కరోనాను జయించారు. ఇందులో 70 శాతం మంది 40 ఏళ్లలోపు వారే. అయితే వీరిలో ఇప్పటి వరకు కేవలం 10 మంది మాత్రమే ప్లాస్మాను దానం చేశారు. దీంతో ప్రజల్లో కనీస సామాజిక బాధ్యత లోపించిందా? అవగాహన లేమే దీనికి కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కరోనా వ్యాధి సోకి దాన్నుంచి కోలుకున్న వారిలో 28 రోజుల తర్వాత యాంటీబాడీస్‌ బాగా వృద్ధి చెంది ఉంటాయి. ప్లాస్మా థెరపీ కోసం కరోనా విజేతలు కేవలం 400 మిల్లీలీటర్ల రక్తాన్ని దానం చేస్తే సరిపోతుంది. తద్వారా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు మనవంతు సహకారం అందించిన వారిమవుతాము.

కాగా, కరోనాతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న యువకులు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాలంటూ శుక్రవారం ఏపీ వైద్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కె.ఎస్‌ జవహర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

తిరుపతిలోని స్విమ్స్, కర్నూలు జీజీహెచ్‌లో ప్లాస్మా సేకరణ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో విజయవాడ, గుంటూరుల్లోనూ సేకరణను ప్రారంభించనున్నట్లు తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేక అధికారి డా.కె.ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్లాస్మా ఇస్తే ఏదో జరిగిపోతుందనే అనుమానాలొద్దన్నారు. ప్రపంచం మొత్తం ఈ పద్ధతిని అనుసరిస్తోంది. ప్లాస్మా సేకరణ ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకే జరుగుతుందన్నారు. కాబట్టి కరోనాను జయించిన యువత ఇకపై సామాజిక బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.