ఏదైనా ఒక సంఘటన సమాజం పై ప్రభావం చూపుతుంది. ఇది సంభందిత ప్రజల పై ఏ మేర ప్రభావం చూపుతుందనేది ఘటన తీవ్రతను బట్టి ఉంటుంది. అంతేకాకుండా అది ప్రజల్లోకి ఎంత స్థాయిలో, ఎంత వేగంగా వెళుతుందన్న దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రసార మాధ్యమాలు ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. మంచి, చెడు.. ఘటన ఏదైనా సరే ఆయా సెక్టార్ ప్రజలు దాని ప్రభావానికి లోనవుతారు. కొన్ని రోజులపాటు ఆ సంఘటన ప్రభావం సమాజంపై కొనసాగుతుంది.
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ తహశీల్ధార్ విజయా రెడ్డి ని పాస్ బుక్స్ కోసం ఆమె కార్యాలయంలోనే సురేష్ అనే వ్యక్తి పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తెలుగు రాష్ట్రాలలోనే గాక యావత్ దేశమంతా దీనిపై చర్చ జరుగుతోంది. మీడియాలో కధనాలు, చర్చలు సాగుతున్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ తహశీల్ధార్ హత్య పై భిన్న వాదనలు జరుగుతున్నాయి. ఎవరికీ వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పాస్ బుక్స్ మంజూరు చేయకపోవడానికి కారణం ఏమైనా వాటి కోసమే నిందితుడి ఈ ఘాతుకానికి పాలపడ్డాడని ప్రజల్లోకి వెళ్ళింది. ఈ ఘటన వల్ల ఓ పక్క అధికారులు ఆందోళనకు గురవుతుంటే, మరో వైపు తమ పనుల కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన ప్రజలు అబ్దుల్లాపూర్మెట్ ఘటన ను ఆచరిస్తున్నారు.
కర్నూల్ జిల్లా పత్తికొండ తహశీల్ధార్ ఉమా మహేశ్వరీ ముందు జాగ్రత్తగా తన ఛాంబర్ లోకి ఎవరు రాకుండా, గది తలుపు దగ్గర నుంచే అర్జీలు ఇచేలా.. గుమ్మానికి అడ్డంగాతాడు కట్టడం అబ్దుల్లాపూర్మెట్ ఘటన అధికారులపై ఏ స్థాయిలో ప్రభావం చుపిందనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అధికారుల పరిస్థితి ఇలా ఉంటే మరో వైపు ప్రజలు తమ సమస్యల పరిస్కారానికి దుస్సాహసాలకు పాలపడుతున్నారు. మూడేళ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తన సమస్యను పరిష్కరించడం లేదంటూ కడప జిల్లా కొండాపురం మండలంలోని బుక్కపట్నం గ్రామానికి చెందిన బుడిగి ఆదినారాయణ అనే రైతు కొండాపురం తహశీల్దార్ ఛాంబర్లో అధికారి ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం దూకలపాడులో తన పోలంలో కాలువ తవ్వారని… పంచాయతీ మహిళా కార్యదర్శి జె.సుమలత పై ఏకంగా పెట్రోల్ పోసి తగలపెట్టి తాను తగలపెట్టుకుంటానని అల్లు జగన్మోహన్ రావు అనే రైతు హెచ్చరిస్తూ.. బ్యాగ్‌లోంచి పెట్రోల్ బాటిల్ తీసి తన శరీరంపై పోసుకోబోయాడు. స్థానికులు అడ్డుకోవడంతో సభలో ఉన్న అధికారులు, ఇతరులపై పెట్రోల్ పడింది. అబ్దుల్లాపూర్మెట్ ఘటన ప్రజలను ఎంతప్రభావితం చేసిందో ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది.
అబ్దుల్లాపూర్ మెట్ ఘటన ను ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ప్రజలు తమ సమస్యల పరిస్కారం కోసం తమ సమీపంలోని సంభందిత అధికారుల వద్దకు వెళతారు. ఆ పని చేయగలినదైతే.. చేస్తామని చెబుతూ ఎప్పటి లోగా చేస్తామో కూడా అధికారులు ప్రజలకు తెలియజేయాలి. ఒకవేళ ఆ పని తమ పరిధి లోది కాకపోతే.. ఆ పని జరిగేందుకు ఏమి చేయాలి, ఎవరిని సంప్రదించాలో తమ వద్దకు వచ్చిన ప్రజలకు వివరించాలి. నిబంధనల మేరకు అసలు ఆ పని చేయడం సాధ్యం కాకపోతే.. ఎందుకు సాధ్యం కాదో కూడా అధికారులు వచ్చిన వారికి అర్ధమయ్యేలా సానుకూల రీతి లో చెప్పాలి. మేమున్నది మీ ‘సేవ కోసమే.. మీ సమస్యల పరిస్కారం కోసమే అనే సందేశాన్ని అధికారులు ప్రజలలోకి పంపగలిగితే తాడికొండ ఎమ్మార్వో ఉమా మహేశ్వరీ లా ఎవరు భయపడాల్సిన పని లేదు. ప్రజల్లో అసహనాని తావుండదు. అల్లు జగన్మోహన్ రావు లా పెట్రోల్ పోసి చంపేస్తానని, తాను చస్తానని పెట్రల్ పోసుకునే ఘటనలు జరగవు.