iDreamPost
iDreamPost
పెగాసస్ స్పైవేర్ దుర్వినియోగం అవుతుండటం మన దేశంలోనే కాకుండా.. విదేశాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచీ ఉభయ సభలను ఇదే అంశం కుదిపేస్తోంది. దేశంలో పలువురు ప్రతిపక్ష నాయకులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, ఇతర రంగాలకు చెందిన వేలాదిమంది ఫోన్లను పెగాసస్ స్పైవేర్ సాయంతో కేంద్ర ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన వ్యవహారంపై గత కొన్ని రోజులుగా పార్లమెంటు లోపలా బయటా దుమారం రేగుతోంది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నా కేంద్రం నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది. పెగాసస్ స్పైవేర్ ను ఉపయోగిస్తున్న భారత ప్రభుత్వం దాని దుర్వినియోగంపై స్పందించకపోయినా.. సదరు స్పైవేర్ ను విక్రయిస్తున్న ఎన్ఎస్వో గ్రూప్ సంస్థ, ఆ సంస్థ ఉన్న ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం దీన్ని తీవ్రంగానే పరిగణిస్తున్నాయి. తమ స్పైవేర్ దుర్వినియోగంపై స్పందించిన ఎన్నెస్వో సంస్థ ఐదు దేశాల్లో స్పైవేర్ ను వినియోగించకుండా బ్లాక్ చేసింది. దీనిపై అంతర్గత విచారణ కూడా ప్రారంభించింది.
ఆరోపణలపై విచారణలు
పెగాసస్ స్పైవేర్ దుర్వినియోగం అవుతోందంటూ కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, వాషింగ్టన్ పోస్ట్, మనదేశానికి చెందిన ది వైర్ అనే సంస్థలు దీన్ని వెలుగులోకి తెచ్చాయి. అంతర్జాతీయ మీడియా సంస్థల సమాఖ్య పెగాసస్ ప్రాజెక్ట్ పేరుతో.. పూర్తి వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో పెగాసస్ స్పైవేర్ రూపకర్త అయిన ఎన్నెస్వోతోపాటు ఇజ్రాయెల్ రక్షణ శాఖ వేర్వేరుగా విచారణ చేపట్టాయని అమెరికాకు చెందిన స్వతంత్ర మీడియా సంస్థ నేషనల్ పబ్లిక్ రేడియో వెల్లడించింది. స్పైవేర్ దుర్వినియోగం తమ వద్ద జరుగుతుందా.. బయట జరుగుతుందా అన్నది తెలుసుకునేందుకు ఎన్నెస్వో అంతర్గత విచారణ నిర్వహించింది. ప్రాథమికంగా తమ వద్ద అటువంటివి జరగడంలేదని తేలినట్లు ఆ సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అందువల్ల దుర్వినియోగం ఆరోపణలతో తమ సంస్థకు ఎటువంటి సంబంధంలేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు తమ దేశానికి చెందిన సంస్థ నిర్వహిస్తున్న స్పైవేర్ పై పలు దేశాల్లో
ఆరోపణలు, వివాదాలు రేగుతుండటాన్ని ఇజ్రాయెల్ రక్షణ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఎన్నెస్వో సంస్థకు చెందిన పలు కార్యాలయాల్లో విచారణ చేపట్టింది. టెల్ అవివ్ లోని ఎన్నెస్వో ప్రధాన కార్యాలయంలో విచారణ ప్రారంభమైనట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
పలు దేశాల్లో దుర్వినియోగం
మనదేశంతోపాతో ఈ స్పైవేర్ ను వినియోగిస్తున్న పలు దేశాల్లో అది దుర్వినియోగం అవుతోంది. 40 దేశాలకు చెందిన 60 ప్రభుత్వ విభాగాలు, సంస్థలు పెగాసస్ స్పైవేర్ వినియోగిస్తున్నాయి. ప్రధానంగా ఉగ్రవాద చర్యలు, నేరాలను కట్టడి చేసేందుకు పలు దేశాల నిఘా సంస్థలు, పోలీస్ విభాగాలు, సైనిక వ్యవస్థలు ఈ స్పైవేర్ ను వాడుతున్నాయి. అయితే చాలా దేశాల్లో ఇందుకు విరుద్ధంగా రాజకీయ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తల ఫోన్ల హ్యాకింగుకు వాడుతూ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్ లోనూ పలువురి ఫోన్లు పెగాసస్ నిఘా గుప్పిట్లో ఉన్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నెస్వో సంస్థ తాత్కాలికంగా తమ స్పైవేర్ ను వినియోగించకుండా బ్లాక్ చేసింది. ఇప్పటివరకు తమ క్లయింట్లుగా ఉన్న ఐదు దేశాలపై నిషేధం విధించారు. ఈ జాబితాలో మెక్సికో, సౌదీ అరేబియా, దుబాయ్ ఉన్నాయి. మిగిలిన రెండు ఏ దేశాలో.. వాటిలో మనదేశం ఉందా లేదా అన్నది వెల్లడి కాలేదు.
Also Read : చట్టసభల్లో ఏమి జరుగుతోంది..?