iDreamPost
android-app
ios-app

న‌వంబ‌ర్ 3 స్పెష‌ల్ : ప్ర‌పంచం నుంచి స్థానికం వ‌ర‌కూ…

న‌వంబ‌ర్ 3 స్పెష‌ల్ : ప్ర‌పంచం నుంచి స్థానికం వ‌ర‌కూ…

ఈ రోజు (న‌వంబ‌ర్ 3) వార్త‌ల్లో ప్ర‌త్యేకంగా నిలిచింది. ఏ న్యూస్ చాన‌ల్, ఏ వెబ్ సైట్.. ఏది చూసినా.. ప‌్ర‌పంచం నుంచి స్థానికం వ‌ర‌కూ… ఎన్నిక‌ల అంశం ఓ వార్త‌గా మారింది. అందుకు కార‌ణం.. అమెరికా నుంచి దుబ్బాక వ‌ర‌కూ ప‌లు రాష్ట్రాలలో పోలింగ్ జ‌రుగుతుండ‌డ‌మే. అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు, బిహార్ లో రెండో ద‌శ ఎన్నిక‌లు, మరోవైపు మధ్యప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం దుబ్బాక‌లో ఉప ఎన్నిక‌ల పోలింగ్ ఈరోజే కావ‌డం గ‌మ‌నార్హం. అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ఒక్కోసారి కొన్నిరాష్ట్రాల‌లో ఒకేసారి జ‌రుగుతుంటాయి. అయితే ఈ రోజు దేశంలో జ‌రిగే ప‌లు ఎన్నిక‌ల‌తో పాటు అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు కూడా జ‌రుగుతుండ‌డం ప్ర‌త్యేకంగా చెప్పొచ్చు. మరోవైపు గుజరాత్‌(8), కర్ణాటక(2), చత్తీస్‌గఢ్‌(1), ఉత్తర ప్రదేశ్‌(7), జార్ఖండ్‌(2), నాగాలాండ్‌(2), హరియాణా(1), ఒడిశా(2)ల్లోనూ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.

అంత‌టా అమెరికాపైనే ఆస‌క్తి

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లంటే ప్ర‌పంచం మొత్తం దృష్టి దానిపైనే ఉంటుంది. ఎందుకంటే అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు ప్రపంచ దేశాలను ప్ర‌భావితం చేస్తాయి. ఆ దేశ అధ్య‌క్ష ఎన్నిక‌లు ఈ రోజే ప్రారంభం అయ్యాయి. భారత కాలమాన ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ మొదలైంది. న్యూ హాంప్‌షైర్‌లో తొలి ఓటు నమోదైంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తల నడుమ పోలింగ్‌ సాగుతోంది. అమెరికాలో మొత్తం 23.9 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే ముందస్తు ఓటింగ్‌లో సగం ఓట్లు పోలైయ్యాయి. దాదాపు 10 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికా ఓట‌ర్లు ఎక్కువ‌గా పోస్ట‌ల్ బ్యాలెట్ల ‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. హవాయ్‌, టెక్సాస్‌, మోంటానా రాష్ట్రాల్లో భారీగా ముందస్తు ఓట్లు పోలైయ్యాయి. ఈ పోస్టల్‌ ఓట్లపై రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ తొలి నుంచి‌ తీవ్ర అసంతృప్తి, అనుమానం వ్యక్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక అమెరికన్‌ ఓటరు జాతీయవాదానికే మళ్లీ జై కొడతారా ? ట్రంప్‌ పాలనా వైఫల్యాలతో విసిగిపోయిన ప్రజలు మార్పు కోరుకుంటారా ? అనేది వేచి చూడాలి.

బిహార్ రెండో ద‌శ‌

బిహార్‌ రెండో దశ అసెంబ్లీ పోలింగ్ న‌వంబ‌ర్ 3 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొన‌సాగింది. 17 జిల్లాల్లో విస్తరించి ఉన్న 94 అసెంబ్లీ స్థానాలకు నేడు (మంగళవారం) పోలింగ్ జరిగింది. 94 స్థానాలకు 1,463 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. భద్రత దృష్ట్యా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. రెండో ద‌శ‌లో మొత్తం ఓట‌ర్లు 2.85 కోట్ల మంది. జేడీయూ అధినేత నితీష్‌ కుమార్‌కు ఇదే చివరి ఎన్నికలని లోక్‌జన శక్తిపార్టీ (ఎల్జేపీ) చీఫ్‌ చిరాగ్‌ పాశ్వాన్‌ జోస్యం చెప్పారు. నితీష్‌ మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని, బిహార్‌ ప్రజలు ఆయన పాలనలో విసుగుచెందారని విమర్శించారు. నితీష్‌ కుమార్‌ మళ్లీ ముఖ్యమంత్రి కారని, రాష్ట్రం వెనుకబాటుతనం కారణంగా బిహారీలు తమను తాము బిహారీలుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిహారీ ప్రజలు విలువైన ఓటును వృథా చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే నుంచి విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తున్న ఎల్జేపీ నాయకుడు, బీజేపీతో తన స్నేహం చెక్కుచెదరకుండా ఉందని మరోసారి స్పష్టం చేశారు. నవంబర్‌ 10 తర్వాత నితీశ్‌ కుమార్‌ మరెన్నడూ ముఖ్యమంత్రి కారని లిఖితపూర్వకంగా రాసివ్వగలనని, బిహార్‌ మొదట-బిహారీ మొదట ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇదిలా ఉంగా.. ఏడో తేదీన 71 నియోజకవర్గాల్లో మూడో దశ పోలింగ్‌తో ఎ‍న్నికల ప్రక్రియ ముగియనుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 10న విడుదల కానున్నాయి.

మధ్య‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక‌ల కోలాహ‌లం

మరోవైపు మధ్యప్రదేశ్‌లో 28 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రత్యేక దృష్టికి ఆకర్షించాయి. కమల్‌నాథ్‌ సర్కార్‌ను కూల్చి బీజేపీ గూటికి చేరిన 25 మంది ఎమ్మెల్యే రాజీనామాతో ఈ ఎన్నికలు అనివార్యం అయ్యాయి. మరో మూడు స్థానాలు కలుపుకుని మొత్తం 28 స్థానాలకు పోలింగ్ జ‌రిగింది. ఈ ఎన్నికను అధికార బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 28 స్థానాల్లో తొమ్మిదింటిలో గెలిస్తే శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే ప్రభుత్వం మైనార్టీలో పడే అవకాశం ఉంటుంది. అలాగే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన జ్యోతిరాధిత్య సింధియాకూ ఈ ఎన్నిక కీలకమైనది. ఆయన వర్గంగా భావిస్తున్న ఎమ్మెల్యేలంతా పోటీలో ఉండటంతో బీజేపీ నాయకత్వంలో వారి గెలుపు బాధ్యతను యువ నేతపై మోపింది. కాంగ్రెస్‌ నుంచి అవమానానికి గురై తిరుగుబాటు చేసిన సింధియా ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకుని హస్తం పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలని కసితో రగిలిపోతున్నారు. అదే స్థాయిలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం సైతం జోరుగా నిర్వహించారు. మరోవైపు చేతిలో ఉన్న అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ఉప ఎన్నికలు జరుగుతున్న 28 సీట్లు గెలిచినా మ్యాజిక్‌ ఫిగర్‌కు ఒక్క అడుగు దూరంలో ఆ పార్టీ నిలిచిపోతుంది. అయినప్పట్టికీ స్వతంత్రుల మద్దతులో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కమల్‌నాథ్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ఎన్నికలు మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని మారుస్తాయా? లేక ఏకపక్ష తీర్పు రానుందా అనేది వేచి చూడాలి.

ఆస‌క్తిక‌రంగా దుబ్బాక పోలింగ్

ఇక తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ఆస‌క్తిక‌రంగా సాగింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా పోలింగ్ శాతం మెరుగ్గా న‌మోదైంది. మధ్యాహ్నం 3గంటల వరకు 71.10శాతం పోలింగ్ నమోదు అయింది. ఉదయం 7గంటలకు ప్రారంభమయిన పోలింగ్‌ సాయంత్రం 6గంటల వరకు కొన‌సాగింది. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బూతులో పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. చేగుంటలో దొంగ ఓటు నమోదు కావ‌డం గంద‌ర‌గోళం సృష్టించింది. అసలు ఓటరు రావడంతో అధికారులు గుర్తించారు. తన ఓటు వేరేవారు వేశారని అసలు ఓటరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ్ముడి ఓటు అన్న వేసి వెళ్లారు. పోలింగ్‌ ఏజెంట్‌కి తెలిసే జరిగిందని అసలు ఓటరు ఆరోపించారు. ఓటరు ఆందోళనతో టెండర్‌ ఓటుకు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ అనుమతి ఇచ్చారు.

కొవిడ్ ఎన్నిక‌లు…

ఈ సారి ఎన్నిక‌ల‌కు మ‌రో ప్ర‌త్యేక‌త ఉంది. ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కొవిడ్ మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ప్ర‌త్యేక జాగ్ర‌త్త‌ల మ‌ధ్య ఈ ఎన్నిక‌లు కొన‌సాగుతున్నాయి. వైర‌స్ నేప‌థ్యంలో వృద్ధులు, పాజిటివ్ బాధితుల‌కు ఎన్నిక‌ల సంఘం పోస్ట‌ల్ బ్యాలెట్ అవ‌కాశం క‌ల్పించింది. కొన్ని చోట్ల క‌రోనా పాజిటివ్ ల‌కు ప్ర‌త్యేక స‌మ‌యం కేటాయించారు. దుబ్బాక‌లో సాయంత్రం 5 గంట‌ల నుంచి 6 గంట‌ల మ‌ధ్య ఓటింగ్ వేసేలా ఏర్పాట్లు చేశారు. లచ్చపేటలోని దుబ్బాక జిల్లా పరిషత్ హైస్కూలోని పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ భారతి హోళ్ళీకేరి పరిశీలించారు. ఈ మేరకు కోవిడ్ నిబంధనల మేరకు ప్రతీ ఓటరుకు థర్మల్ స్క్రీనింగ్ చేసి, శానిటైజరు అందిస్తూ.. చేతికి గ్లౌజు ఇవ్వడంతో పాటు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్న ఎన్నికల అధికారుల పనితీరును కలెక్టర్ అభినందించారు. దుబ్బాకలో మొత్తం ఓటర్లు 1,98,807 మంది కాగా, పురుష ఓటర్లు 98,028 మంది.. మహిళా ఓటర్లు 1,00,719 మంది ఉన్నారు.