రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి నుంచి ఈ రోజు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దిగిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆది నుంచి చివరి వరకు తాను ఏ తప్పూ చేయలేదని, పరిధి మేరకే వ్యవహరించానని చెప్పుకునేందుకు నిమ్మగడ్డ తపన పడ్డారు. ఈ క్రమంలోనే ప్రభుత్వంపైనా ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ సహకారంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించానని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ప్రభుత్వంతో వివాదాన్ని టీ కప్పులో తుపానుగా వర్ణించారు నిమ్మగడ్డ.
వ్యవస్థ స్వతంత్రత కోసం పని చేశానని చెప్పుకొచ్చారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్. కోర్టుల్లో అనేక పిటిషన్లు వేశానని, ఇంకా పలు పిటిషన్లు విచారణలో ఉన్నాయని చెప్పారు. కోర్టుల్లో అన్ని విజయాలు సాధించానని చెప్పిన నిమ్మగడ్డ.. ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుని గెలిచానని చెప్పుకునేందుకు ఆసక్తి చూపారు. ప్రభుత్వంతో సానుకూలంగా ఉండాలని, తాను ఎప్పుడూ పరిధిదాటి వ్యవహరించలేదని, వ్యవస్థల మధ్య సానుకూల వాతావరణం ఉండాలంటూ సుద్దులు చెప్పారు. నామినేషన్లు వేయలేని చోట అవకాశం కల్పించడం తన కర్తవమని చెప్పుకొచ్చారు. ఆఖరుకు కోర్టు తీర్పులు గౌరవించక తప్పలేదన్నారు.
Also Read : తీరనున్న బెజవాడ వాసుల చిరకాల వాంఛ
గవర్నర్ అపాయింట్‌మెంట్ ఎందుకు కోరారో, ఎందుకు రాలేదో కూడా నిమ్మగడ్డే వెల్లడించారు. ఎన్నికల సంఘాన్ని మరింత స్వతంత్రంగా తీర్చి దిద్దేందుకు సంస్కరణలతో కూడిన ఓ నివేదికను సిద్ధం చేశానన్న నిమ్మగడ్డ.. దాన్ని గవర్నర్‌కు అందించాలనే అపాయింట్‌మెంట్ కోరానని చెప్పుకొచ్చారు. అయితే గవర్నర్ వ్యాక్సిన్ తీసుకోవడంతో కలవడం సాధ్యం కాదని రాజ్‌భవన్ నుంచి సమాచారం అందిందన్నారు. తాను ఏడేళ్లు గవర్నర్ కార్యదర్శిగా పని చేశానని.. ఏ వ్యవస్థను ఎలా గౌరవించాలో తనుకు తెలుసన్నారు.
పదవీ విమరణ చేసిన తర్వాత సాధారణ వ్యక్తిగా.. హక్కుల సాధన కోసం కోర్టులకు వెళతానని చెప్పారు. నీలం సాహ్ని నియామకాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వంతో ఎలా కలసి పని చేయాలో నీలం సాహ్నికి లేఖ రాశానని, అయితే దాన్ని బయటపెట్టలేనన్నారు. తన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవీ కూడా బయటపెట్టే విధానం తనది కాదని చెప్పుకొచ్చారు నిమ్మగడ్డ.
ఇన్ని చెప్పిన నిమ్మగడ్డ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా కేంద్ర ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదు గురించి మాత్రం మాట్లాడలేదు. మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు, షరతులు విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం, ప్రివిలేజ్ కమిటీ నోటీసులు.. వీటన్నింటిని ప్రస్తావించని నిమ్మగడ్డ.. టీ కప్పులో తుఫాను అంటూ ఏక వాక్యంతో అభివర్ణించారు. అదే సమయంలో తాను తప్పుచేయలేదని చెప్పుకునేందుకు తంటాలు పడ్డారు.
Also Read : నిమ్మగడ్డ… నీ సేవలు చాలు..!
16884