iDreamPost
android-app
ios-app

పాలమూరు-రంగారెడ్డి పై కేఆర్ఎంబీ, రాయలసీమ కోసం పర్యావరణ శాఖ

  • Published Aug 28, 2021 | 3:49 AM Updated Updated Aug 28, 2021 | 3:49 AM
పాలమూరు-రంగారెడ్డి పై కేఆర్ఎంబీ, రాయలసీమ కోసం పర్యావరణ శాఖ

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. అటు తెలంగాణా, ఇటు ఏపీ ప్రభుత్వ పరిధిలోని ప్రాజెక్టుల విషయమై ముసురుతున్న వివాదాల పరిష్కారం కోసం మరో ప్రయత్నం చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ కి ఎగువన ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ పై తెలంగాణా ప్రభుత్వం ఫిర్యాదులు చేసింది. ఇప్పటికే ఎన్జీటీ ఆదేశాలతో కేఆర్ఎంబీ క్షేత్రస్థాయి పర్యటనలు చేసింది. నివేదిక అందించింది. ఈ నేపథ్యంలో తాజాగా రాయలసీమ లిఫ్ట్ కి సంబంధించి పర్యావరణ శాఖ అభిప్రాయాన్ని కోరుతూ ఎన్జీటీ కేంద్రానికి ఆదేశాలిచ్చింది. జాప్యం లేకుండా తమ అభిప్రాయం తెలియజేయాలని సూచించింది.

అదే సమయంలో పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ నిర్మాణంలో తెలంగాణా ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించడంపై కూడా ఎన్జీటీ విచారించింది. దానిపై నోడల్ ఏజన్సీగా కేఆర్ఎంబీని నియమిస్తూ ఆదేశాలిచ్చింది. అదే సమయంలో ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ ని ఎన్జీటీ అంగీకరించింది. ఈ వ్యవహారంలో తెలంగాణా ప్రభుత్వం పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తుందంటూ మహాబూబ్ నగర్ కి చెందిన కోస్గి వెంకటయ్య ఫిర్యాదు చేశారు. కడప జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వర్ రెడ్డి మరో ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. దానిలో ఏపీ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అయ్యింది. దాంతో తెలంగాణా ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం అడ్డుకుని సీమ ప్రజలకు నీటికొరత తీరకుండా చేసే ప్రయత్నంలో ఉండగా ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వ ప్రాజెక్టులకే ఎసరు వచ్చేలా ఉంది. ఇది తెలంగాణా ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారడం అనివార్యంగా కనిపిస్తోంది. ఏపీ ఇరుక్కుంటుందని ఆశిస్తే తాము ఊబిలో దిగాల్సిన పరిస్థితి వస్తోందని తెలంగాణా అధికారులే తలలు పట్టుకోవాల్సిన స్థితి వస్తోంది.

పీఆర్ఎల్ఐసీ పనులను పరిశీలించి 8వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ ఆదేశించడం టీఎస్ అధికారులకు మింగుడుపడని అంశంగా మారింది. అదే సమయంలో కేసు విచారణ కూడా సెప్టెంబర్ 22కి వాయిదా వేశారు. దాంతో క్షేత్రస్థాయి పరిశీలన కమిటీ ఇచ్చే నివేదిక కీలకం కాబోతోంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం కూడా తన అభ్యంతరాలను సూటిగా తెలియజేసింది. అంతర్రాష్ట్ర నీటి ఒప్పందాలకు విరుద్ధంగా ప్రాజెక్ట్ ఉందని పేర్కొంది. పర్యావరణ అనుమతులు లేవని తెలిపింది. సాగు, తాగు నీటి అవసరాల కోసం పర్యావరణ అనుమతుల కోసం దరఖాస్తు చేస్తే ఇంకా రానందున కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే నిర్మించాల్సి ఉందన్నారు. దానికి భిన్నంగా పనులు సాగుతున్న విషయాన్ని ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు. వాస్తవంగా తెలంగాణా ప్రభుత్వం ఈ లిఫ్ట్ స్కీమ్ విషయంలో చొరవ చూపడాన్ని ఏపీ ప్రభుత్వం తప్పుబట్టలేదు. కానీ రాయలసీమ అడ్డుకునే యత్నంలో తెలంగాణా వివాదం రాజేసిన క్రమంలో ఇది కూడా ముందుకొచ్చింది. దాంతో వ్యవహారం టీఎస్ మెడకు చుట్టుకునేలా ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

Also Read : రాయలసీమ ఎత్తిపోతలు.. ఎన్జీటీ విచారణ అసంపూర్ణం