Idream media
Idream media
కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ఆయా రంగాల్లో వివిధ కార్యక్రమాలు అనుకున్న సమయానికి జరగకుండా వాయిదా పడ్డాయి. అందులో చిన్న చిన్న కార్యక్రమాల నుంచి పెద్ద పెద్ద ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒలింపిక్స్ వంటి క్రీడల నిర్వహణ వాయిదా పడ్టాయి. అయితే తాజాగా ఒలింపిక్స్ నిర్వహణకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది ఒలింపిక్స్ క్రీడలు నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది జులైనాటికి కరోనా తగ్గినా.. తగ్గకపోయినా… ఒలింపిక్స్ జరిపి తీరుతా మని టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ చీఫ్ తోషిరో ముటో స్పష్టం చేశారు. ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడడంతో ఆతిథ్య జపాన్‌కు 800 మిలియన్ డాలర్లు అదనపు ఖర్చు పడింది. 2021 ఒలింపిక్స్ కొత్త స్పాన్సర్‌గా ప్రపంచంలో ఎత్తైన టవర్ స్కైట్రీ ముందుకు రావడం కొద్దిగా ఉపసమనం. కరోనా నేపథ్యంలో జపాన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ కలిసి అథ్లెట్లు, అధికారులు, సహాయ సిబ్బంది, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఏడాదికి వాయిదా వేయడం మంచి నిర్ణయమేనని ముటో అన్నారు.
వైరస్ తీవ్రత ఇప్పటికీ తగ్గుము ఖం పట్టలేదని, చాలా దేశాల్లో కరోనా కేసులు పెరుగు తున్నాయన్నారు. షెడ్యూల్ ప్రకారం ఒలింపిక్స్ శుక్రవారం నుంచి(2020 జులై 24) ప్రారంభం కావాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి కారణంగా 2021 జులై 2కు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ వాయిదాతో స్పాన్సర్లు తీవ్ర ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే కొత్త స్పాన్సర్ల వేట మొదలుపెట్టారు.
కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. అయినా కొత్త స్పాన్సర్‌గా స్కైట్రీ ముందుకు వచ్చింది. స్కైట్రీ ఒలింపిక్స్ కొత్త స్పాన్సర్‌గా చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌కు స్పాన్సర్లుగా ఉన్న వారందరూ వచ్చే ఏడాది క్రీడల ప్రారంభం వరకూ తమ ఒప్పందాలను పొడిగిస్తారని ఒలింపిక్స్ కమిటీ ఆశిస్తోంది. గత నెలలో జపాన్ పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్ హెచ్‌కె జరిపిన సర్వేలో మూడింట రెండు వంతుల కార్పొరేట్ స్పాన్సర్ కంపెనీలు కొనసాగాలా? వద్దా? అనే విధంగా ఉన్నరని తేలింది. ఈ విషయంపై ఏ తీర్మానం తీసుకోలేదని కంపెనీలు తెలిపాయి.
సెప్టెంబర్‌లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి), జపాన్, ఇతర ఒలింపిక్ కమిటీలతో సమా వేశం జరగనున్నది. అలాగే 2020 ఒలింపిక్స్ వాయిదా వేయడానికి ముందే జపాన్ ప్రభుత్వం 1.35 ట్రిలియన్ యెన్లను ఖర్చు చేసేసింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని భర్తీ చేసుకోవాల్సి ఉంది. ఇటీవల జపాన్ స్థానిక మీడియా ప్రజాభిప్రాయ సర్వేలోనూ నలుగురిలో ఒకరు మాత్రమే వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రచురించింది. ఈ క్రమంలో ఆ సమావేశం వేసవి క్రీడలకు ప్రజల మద్దతు కూడగట్టడంపై కూడా దృష్టి పెడతామని ముటో అన్నారు.