iDreamPost
android-app
ios-app

కేరళ కాంగ్రెస్ లో కొత్త తలనొప్పి!

కేరళ కాంగ్రెస్ లో కొత్త తలనొప్పి!

రాహుల్ గాంధీ చేపలు పట్టినా, సముద్రం లో దూకి కాంగ్రెస్ పార్టీ కు మైలేజ్ కోసం ప్రయత్నాలు చేసినా, పార్టీ తన సొంత తప్పిదాలతో కేరళలో వెనుకబడుతోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎల్డీఎఫ్ నుంచి అధికారాన్ని రాబట్టుకోవాలని పట్టుదలతో ఉన్న యూడీఎఫ్ కూటమికి ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఓటమిలో కీలకమైన కాంగ్రెస్ పార్టీ లో అంతర్గత విభేదాలు బయట పడడం ఎన్నికల ముందు ప్రతికూలంగా మారే అవకాశాలు లేకపోలేదు.

కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలి రచ్చతో

కేరళ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు గా ఉన్న లతిక సుభాష్ ఆదివారం తిరువనంతపురంలోని పార్టీ కార్యాలయం ముందు చేసిన రచ్చ జాతీయ మీడియా వరకు వెళ్ళింది. కాంగ్రెస్ కేరళ ఎన్నికలకు సంబంధించి 86 మంది అభ్యర్థుల లిస్టు ను ప్రకటించిన తర్వాత, ఆమెకు టికెట్ కేటాయించలేదు అన్న కోపంతో ఆమె పార్టీ కార్యాలయం ముందే శిరోముండనం చేయించుకుని నిరసన తెలిపారు. పార్టీలో మహిళలకు అన్యాయం జరుగుతోందని 20 శాతం సీట్లు మహిళలకు కేటాయించాలని తాను కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆమె తన నిరసనను వ్యక్తం చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టు లో 9 మంది మహిళలు ఉన్నారని పార్టీ నేతలు చెప్పడం, యుటిఎఫ్ కూటమిలోని మరికొన్ని పార్టీల్లోనూ మహిళలు ఉంటారని లతికా కు చెప్పినా ఆమె కావాలనే దీనిని రచ్చ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

యుడిఎఫ్ కూటమి నిలిచేనా?

యుటిఎఫ్ కూటమిలో కీలకమైన కాంగ్రెస్తో పాటు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కీలకమైన పార్టీలు. 140 అసెంబ్లీ సీట్లు ఉన్న కేరళలో 2016 ఎన్నికల్లో యుటిఎఫ్ కూటమి 47 సీట్లను మాత్రమే గెలుచుకుంది. 91 సీట్లు గెలుచుకున్న ఎల్డీఎఫ్ అధికారంలోకి వచ్చింది. 87 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 22 సీట్లు మాత్రమే గెలుచుకుంటే, 24 సీట్లలో మాత్రమే పోటీచేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 18 సీట్లను గెలుచుకుని తన సత్తా చాటింది. దీంతో ఈసారి ఎన్నికల్లో యుటిఎఫ్ లోని ముస్లిం మరికొన్ని స్థానాలను కోరుతోంది. అయితే ముస్లిం పట్టు ఉన్న 27 సీట్లను మాత్రమే వారికి కేటాయించారు. మిత్రపక్షాలు గా యుటిఎఫ్ కూటమిలో ఉన్న మిగిలిన పార్టీలకు, 2016 ఎన్నికలలో సరైన ఓటు షేర్ రాని పార్టీలకు సీట్లను తగ్గించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 91 సీట్లలో పోటీ చేయడానికి సిద్ధమైంది. దీనిలో మొదటి వారి లిస్టు ప్రకటించిన తర్వాత వస్తున్న కొన్ని అవాంతరాలు కాంగ్రెస్కు ఇబ్బంది పెడుతున్నాయి.

రాహుల్ ప్రత్యేక దృష్టి!

తన సొంత నియోజకవర్గం అమెది నుంచి ఓడిపోయి కేరళలోని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ కేరళ ఎన్నికల పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ యుడిఎఫ్ అధికారంలోకి రావాలని ఆయన సీట్ల ఎంపిక విషయంలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఉమెన్ చాందీ, ఏకే ఆంటోనీ లను కేరళ విషయాల మీద, రాజకీయాల మీద ప్రత్యేక ద్రుష్టి పెట్టాలని సూచించారు. బీజేపీ ప్రభావం కేరళలో తక్కువగానే ఉండే అవకాశం ఉండడంతో, ఎల్డీఎఫ్ వైఫల్యాలు, ప్రభుత్వ తీరు మీద ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో ద్రుష్టి నిలపాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే టికెట్టు లభించని వారి గోల మాత్రం కాంగ్రెస్ ను వెనక్కు లాగుతుంది. దీనిని ఎలా అధిగమించి ఎన్నికల్లో ఎలాంటి వ్యూహం మీద ముందుకు వెళ్తారన్నది చూడాలి.