iDreamPost
android-app
ios-app

బిబి3 తర్వాత బాలయ్య సినిమాలు

  • Published Dec 06, 2020 | 4:46 AM Updated Updated Dec 06, 2020 | 4:46 AM
బిబి3 తర్వాత బాలయ్య సినిమాలు

వరస డిజాస్టర్లు ఎన్టీఆర్ రెండు భాగాలూ,రూలర్ లతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు బోయపాటి శీనుతో చేయబోతున్న సినిమాతో మళ్ళీ గట్టి కంబ్యాక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్ వర్గాలు. ఫ్యాక్షనిస్ట్ గా, అఘోరాగా రెండు డిఫరెంట్ షేడ్స్ చేస్తున్న బాలయ్యను సింహా, లెజెండ్ తరహాలో మరోసారి చూపిస్తాడని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉండగా దీని తర్వాత బాలకృష్ణ ఎవరితో సినిమాలు చేస్తాడనే క్లారిటీ ఇంకా లేదు. తనకు మూడు మర్చిపోలేని ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన బి గోపాల్ కు మరో అవకాశం ఇవ్వొచ్చని ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఆయన కూడా ఒక స్క్రిప్ట్ ని సిద్ధం చేసే పనిలో ఉన్నారట.

సాక్ష్యం ఫేమ్ శ్రీవాస్ కూడా ఓ లైన్ చెప్పి మెప్పించినట్టు సమాచారం. తనకు డిక్టేటర్ రూపంలో ఫ్లాప్ ఇచ్చినప్పటికీ బాలయ్య ఇంకో ఛాన్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వాస్తవానికి కథ నచ్చాలే కానీ బాలయ్య కొత్త పాత హిట్టు ఫ్లాపు అని డైరెక్టర్ల ట్రాక్ రికార్డు ఎప్పుడూ చూడడు. ఒకరకంగా ఈ ధోరణే చాలా అపజయాలను తెచ్చింది. అయినా కూడా ఈయన దారి ఈయనదే. వీళ్ళు కాకుండా ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ చేస్తున్న సంతోష్ శ్రీనివాస్ కూడా ఒక స్టోరీ చెప్పి మెప్పించాడని వినికిడి. ఈ ముగ్గురిలో ఎవరికి ఫైనల్ గ్రీన్ సిగ్నల్ దక్కుతుందనేది వేచి చూడాలి.

బలరామయ్య బరిలో దిగితే టైటిల్ కూడా దీని కోసం పరిశీలనలో ఉన్నట్టుగా చెబుతున్నారు. ప్రస్తుతం చేస్తున్న బోయపాటి శీను వచ్చే ఏడాది మార్చ్ లోగా పూర్తి చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. వేసవిలో విడుదల చేసేలా నిర్మాత స్కెచ్ వేస్తున్నారు. బడ్జెట్ కూడా బాగా కంట్రోల్ లో పెట్టారు. ప్రగ్య జైస్వాల్ ఒక హీరోయిన్ గా ఎంపిక కాగా ఇంకో రెండు కీలక పాత్రలకు అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. నెగటివ్ షేడ్స్ లో శ్రీకాంత్ ఒక క్యారెక్టర్ చేస్తుండగా అసలు విలన్ ఇంకా ఫైనల్ కాలేదని ఇన్ సైడ్ న్యూస్. టీజర్ కు చాలా మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ ఆఫర్స్ కూడా భారీగానే వస్తున్నాయి. మరి వాటిని నిలబెట్టుకునేలా సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.