iDreamPost
android-app
ios-app

ఒక్కడే గెలిస్తే బాగోదని ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌, వెల్లడించిన నాదెండ్ల మనోహర్

  • Published Sep 29, 2021 | 9:17 AM Updated Updated Sep 29, 2021 | 9:17 AM
ఒక్కడే గెలిస్తే బాగోదని ఓడిపోయిన పవన్ కళ్యాణ్‌, వెల్లడించిన నాదెండ్ల మనోహర్

పవన్ కళ్యాణ్‌ ఎందుకు ఓడిపోయారంటే రాష్ట్రంలో ఎవరైనా చెబుతారు.. గాజువాక, భీమవరంలో ఆయన్ని జనం ఆదరించలేదని. ప్రజలు తిరస్కరించడం వల్లనే టాలీవుడ్ పవర్ స్టార్ పొలిటిక్స్ లో పవర్ లెస్ అయిపోయారని. కానీ జనసేన నేతలు మాత్రం కొత్త సూత్రం చెప్పారు. ఏపీలో జనసేన అభ్యర్థుంతా ఓడిపోయిన తరుణంలో తానొక్కడే గెలిస్తే బాగోదని పవన్ ఓడిపోయారంటూ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. చివరకు జనసైనికులే నోరెళ్లబెట్టేలా ఉన్నాయి.

2019 ఎన్నికల్లో ఏపీలో తన కులస్తులు ఎక్కువగా ఉన్న సీట్లు, గెలిచేందుకు అవకాశం ఉందని భావించిన సీట్లు పవన్ ఎంచుకున్నారు. అందులో భాగంగా గాజువాక,, భీమవరం నుంచి బరిలో దిగారు. జగన్, చంద్రబాబు కూడా ఒక్కో స్థానం నుంచి పోటీ చేసినా పవన్ మాత్రం రెండు సీట్లలో బరిలో దిగారు. తన అన్నయ్య మాదిరిగా పాలకొల్లులో ప్రజలు తిరస్కరించినా, తిరుపతిలో ఆదరించినట్టుగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం వస్తుందని ఆశించారు. కానీ అనుకున్నొదక్కటి, అయ్యిందొకటి అన్నట్టుగా ఫలితాలు వచ్చాయి.

Also Read : సినీ ఫంక్షన్ నుంచి పొలిటికల్ కామెంట్స్ తో పవన్ ఏం ఆశించినట్టు

గాజువాకలో 16,573 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పవన్ కళ్యాణ్ కి అక్కడ కేవలం 29 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 38 శాతం పైబడి ఓట్లు దక్కించుకున్న వైఎస్సార్సీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో పవన్ కి పరాజయం తప్పలేదు. అంటే ముగ్గురిలో ఒక్కరు కూడా పూర్తిగా పవన్ కి ఓటు వేయలేదని అర్థమవుతోంది. ఇక భీమవరం అసెంబ్లీ స్థానంలో 8,357 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. ఇక్కడ మాత్రం పవన్ కి 32 శాతం ఓట్లు దక్కాయి. మూడో వంతు ఓట్లు కూడా దక్కించుకోలేక ఓటమి పాలయిన పవన్ వ్యవహారంలో ఇప్పుడు కొత్త సూత్రీకరణలకు జనసేన సిద్ధం కావడం ఆశ్చర్యంగా మారింది.

అప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఫలితాలు వస్తున్న తరుణంలో తానొక్కిడినే గెలిస్తే బాగోదని పవన్ అన్నారంటూ ఆపార్టీ కార్యకర్తల సమావేశంలో నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. వాస్తవానికి భీమవరం ఫలితాలు ఆరోజు చాలావేగంగా వెల్లడయ్యాయి. అన్ని రౌండ్లలోనూ పవన్ వెనుకబడే ఉన్నారు అయినప్పటికీ మూడు రౌండ్లు ఉండగా తాను గెలవడం బాగోదని చెప్పారంటూ నాదెండ్ల చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి. పైగా కొన్ని ఫలితాలు తారుమారు చేశారంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉంది.

Also Read : స్వయంప్రక్షాళన దిశగా తెలుగు సినిమా పరిశ్రమ అడుగులేయదా?

రాజకీయంగా ప్రజాదరణ దక్కని సమయంలో ఓటమి పాలుకావడం ఎవరికైనా సహజం. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తే వారు రాజకీయంగా మళ్లీ విజయాలు అందుకు అవకాశం దక్కుతుంది. కానీ తామే కావాలని ఓడిపోయాము, తానొక్కడే గెలవడం బాగోదని అనుకున్నారంటూ కలరింగులు ఇవ్వడం జనాల్లో పరువు పెంచకపోగా, ఉన్న గౌరవం కోల్పోవడానికి దారితీస్తుంది. ఇలాంటి విషయాలు పట్టని సినిమా ఫ్యాన్స్ ఈలలు, అరుపులు చాలు అనుకుంటే ఎవరికైనా చివరకు మిగిలేది అవేనన్నది ఇట్టే అర్థమవుతుంది.