iDreamPost
android-app
ios-app

ప్రేక్షకులు నో అన్న ‘చిరంజీవి’ – Nostalgia

  • Published Jul 06, 2020 | 2:27 PM Updated Updated Jul 06, 2020 | 2:27 PM
ప్రేక్షకులు నో అన్న ‘చిరంజీవి’ –  Nostalgia

సాధారణంగా స్టార్ హీరో పేరునే సినిమా టైటిల్ గా పెట్టినప్పుడు అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ అభిమానులు ఆకాశమే హద్దుగా అందులో ఏవేవో ఊహించుకుంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద ఫలితం బోల్తా కొట్టేస్తుంది. ఇది మెగాస్టార్ కు సైతం అనుభవమే. 1984 సంవత్సరం కన్నడలో రవిచంద్రన్ హీరోగా నానే రాజా మూవీ వచ్చింది. అప్పటికి అతనికి పెద్దగా ఫాలోయింగ్ లేదు. కథ వెరైటీగా ఉండటంతో పాటు ట్రీట్ మెంట్ డిఫరెంట్ గా అనిపించి ప్రేక్షకులు దాన్ని సూపర్ హిట్ చేశారు. ఇది చూసిన కైకాల సత్యనారాయణ గారికి దాన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందనిపించి వెంటనే హక్కులు కొనేశారు. దర్శకుడిగా ఒరిజినల్ వెర్షన్ టేకప్ చేసిన సివి రాజేంద్రన్ ను తీసుకున్నారు.

ఆ టైంలో చిరంజీవి మంచి ఫాంలో ఉన్నారు. ఖైది తర్వాత అమాంతం పెరిగిన ఫ్యాన్స్ దాని తర్వాత చాలా హిట్లు ఇచ్చారు. అప్పుడు వచ్చిందే చిరంజీవి. హీరొయిన్లుగా విజయశాంతి, భానుప్రియలు సెట్ అయ్యారు. అగ్ర రచయిత సత్యానంద్ రచన చేశారు. వేటూరి పాటలు, చక్రవర్తి సంగీతం ఇంత కన్నా కాంబో ఇంకేం కావాలి. అనుకోకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పులు చేస్తూ ఆఖరికి నేరస్థుడిగా మారి చివరికి ప్రాణాలు కోల్పోయే విభిన్న హీరో పాత్రను చిరంజీవి చేశారు. ఇందులో నెగటివ్ షేడ్ కూడా ఉంటుంది. చిరుకున్న ఇమేజ్ దృష్ట్యా మనవాళ్లు ఈ సినిమాను రిసీవ్ చేసుకోలేకపోయారు. కర్ణాటకలో ఎంత ఘన విజయం సాధించిందో ఇక్కడ అంత పెద్ద ఫ్లాప్ అయ్యింది.

నిజానికి నానే రాజాను ముందు డబ్బింగ్ చేయాలనుకున్నారు. అంబరీష్ పోషించిన ఇన్స్ పెక్టర్ పాత్రను చిరుతో వేయించి మిగిలింది అనువదించాలని ముందు అనుకున్న ప్లాన్. కాని చిరుకి రవిచంద్రన్ క్యారెక్టర్ నచ్చింది. పైగా ఛాలెంజింగ్ గా అనిపించింది. కానీ ఆడియన్స్ లెక్కలు వేరే ఉన్నాయి. తమకు అత్యంత ఇష్టమైన హీరో స్క్రీన్ మీద అలా ప్రవర్తించడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఫైనల్ గా పరాజయం తప్పలేదు. అందుకే ప్రయోగాలు స్టార్లకు అంత ఈజీగా అచ్చిరావని చాలా సార్లు ఋజువవుతూనే ఉంటుంది. అయినా విలన్ కి బదులు హీరోనే అన్యాయంగా మర్డర్లు చేయాల్సి వస్తే అది తెలుగు ప్రేక్షకులు ఒప్పుకుంటారా. అందుకే చిరంజీవికి ఫ్లాప్ తప్పలేదు. 1985 ఏప్రిల్ 18న చిరంజీవి రిలీజైంది.