iDreamPost
android-app
ios-app

విశ్వకర్మను మించిన ఇంజనీరు.. విశ్వేశ్వరయ్య

  • Published Sep 15, 2021 | 11:46 AM Updated Updated Sep 15, 2021 | 11:46 AM
విశ్వకర్మను మించిన ఇంజనీరు..  విశ్వేశ్వరయ్య

1861 సెప్టెంబర్ 15వ తేదీన బెంగళూరుకు సమీపంలో ముద్దెనహళ్ళి గ్రామంలో శ్రీనివాస శాస్త్రి, వెంకాయమ్మ దంపతులకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మించారు.‌ వీరి పూర్వీకులు ప్రకాశం జిల్లా మోక్షగుండం గ్రామానికి చెందినవారు.

ఆసియాలో 3వ అతి పురాతనమైన పూణే లోని ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి, బొంబాయి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ఇంజనీర్ గా 1885లో ఉద్యోగంలో చేరి, 1894లో సుక్కూర్, సింథ్ మున్సిపాలిటీలో, 1896లో సూరత్ లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పూణే లో 1897-99మధ్య పనిచేసి, 1907లో సూపరింటెండెంట్ ఇంజనీర్ గా పని చేశారు. దేశవ్యాప్తంగా అనేక నిర్మాణాలు పూర్తిచేసి ఇంజనీర్స్ కు ఆరాధ్యదైవమైన విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని జాతీయ ఇంజనీర్స్ దినోత్సవంగా జరుపుకుంటారు.

కర్ణాటక రాష్ట్రంలోని కావేరి నదిపై నిర్మించిన “క్రృష్ణరాజసాగర్ (కె.ఆర్.యస్) ” అయిన నిర్మాణ దక్షతకు, సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణానికి ప్రతీక. ఆరోజుల్లో 10.34 మిలియన్ల రూపాయల ఖర్చుతో పదివేల మంది శ్రమతో 1911లో ప్రారంభమైన ఈ డామ్ నిర్మాణం 1932లో పూర్తి అయి ముఖ్యంగా మాండ్య ప్రజల జీవితాలతో వెలుగులు నింపటమే కాకుండా, మంచినీరు, సాగునీరు తో కొన్ని లక్షల మంది‌ జీవితాలను, మైసూర్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసింది. ఈనాటికీ ఈ డామ్ పటిష్టంగా ఉంటూ, విశ్వేశ్వరయ్య నైపుణ్యతకు నిలువెత్తు నిదర్శనంగా అలరారుతోంది. ప్రతీ సంవత్సరం 25 లక్షల మంది ఈ డాం చూడటానికి వస్తున్నారు. ఈ డాం ను అనుకుని ఉన్న “బ్రృందావన్ గార్డెన్ ” అదనపు ఆకర్షణగా ప్రసిద్ధి చెందింది.

Also Read : దేశంలోనే మొదటి హరికథా పాఠశాల ఏపీలో ఎక్కడ ఉందో తెలుసా..?

1903లోనే “ఖడ్కవసల రిజర్వాయర్” ఆటోమేటిక్ వేర్ వాటర్ ఫ్లడ్ గేట్స్ అమర్చి నిర్మాణం వ్యవస్థలో నూతన శకానికి నాంది పలికారు. గ్వాలియర్ లోని “టిగ్రా” డామ్, తదుపరి కె.ఆర్.యస్ డామ్ కు ఈ ఆటోమేటిక్ ఫ్లడ్ గేట్స్ అమర్చి అందరికి తన ప్రతిభా నిర్మాణం చూపి, అనేక పురస్కారాలు అందుకున్నారు విశ్వేశ్వరయ్య.

తరచూ “విశాఖ పోర్టు” సముద్ర కోతకు గురవుతుంటే చక్కటి పరిష్కారం చూపారు. అదేవిధంగా హైదరాబాద్ నగరాన్ని మూసి నది వరదల నుండి కాపాడడానికి అనేక నిర్మాణాలకు సూచనలు చేశారు. తిరుమల-తిరుపతి రోడ్ మార్గానికి దిశానిర్దేశం చేసాడు. బీహార్ లోని గంగా నదిపై నిర్మించిన “మెక్మా బ్రిడ్జి” నిర్మాణంలో సేవలు అందించారు. మైసూరు సోప్ ఫ్యాక్టరీ, బెంగళూరు ప్రెస్, బ్యాంకు ఆఫ్ మైసూర్, బెంగళూరు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు . దక్షిణ బెంగళూరు లోని “జయానగర్” నివాస గృహాల కాలనీ చక్కగా డిజైన్ చేసి, నేటికి ఆదర్శంగా వెలుగొందుతుంది.‌ అందుచేతనే ఈయనను ” ఫాదర్ ఆఫ్ మోడరన్ మైసూర్” అని పిలుస్తారు.‌

దేశవ్యాప్తంగా అనేక నిర్మాణాలు పదికాలాలపాటు పదిలంగా నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి మనదేశంతో పాటు శ్రీలంక, టాంజానియా దేశాలు కూడా ఇంజనీర్స్ దినోత్సవంగా జరుపుకుంటుండడం మనకు గర్వకారణం.‌

Also Read : తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?

నీతిగా నిజాయితీగా తన జీవితాన్ని దేశానిర్మాణానికి అంకితం చేసిన విశ్వేశ్వరయ్య గారి సేవలు గుర్తిస్తూ అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ” నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్” అని బిరుదుతో సత్కరిస్తే, 1955లో భారత ప్రభుత్వం అత్యున్నత “భారతరత్న” అవార్డు తో గౌరవించింది. మరియు భారత తపాలా శాఖ ఆయన శత జయంతి సందర్బంగా “15 పైసలు తపాలా స్టాంప్” 1960లో ఆయన గౌరవార్ధం విడుదల చేసింది.‌ ఈయన పేరున అనేక ఇంజనీరింగ్ కాలేజీలు వెలిసాయి. దేశవ్యాప్తంగా 8 యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు విశ్వేశ్వరయ్య గారికి ప్రధానం చేసాయి. “ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఇంజినీరింగ్” గా విశ్వేశ్వరయ్య ఎల్లప్పుడూ గుర్తుంటారు.

నేడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి జయంతి జాతీయ ఇంజనీర్స్ దినోత్సవం సందర్భంగా…