iDreamPost
android-app
ios-app

బొమ్మలు వేసే భవిష్య ‘బ్రహ్మ” – Nostalgia

  • Published Sep 18, 2020 | 3:41 PM Updated Updated Sep 18, 2020 | 3:41 PM
బొమ్మలు వేసే భవిష్య ‘బ్రహ్మ” – Nostalgia

సినిమా ఏదైనా హీరో ఎవరైనా అందులో వైవిధ్యం ఉన్నప్పుడు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని చరిత్ర రుజువు చేస్తూనే ఉంది. అందులోనూ ఊహించని పాయింట్ తో ఆడియన్స్ థ్రిల్ అయ్యేలా ప్రెజెంట్ చేసినప్పుడు సూపర్ హిట్ కాకుండా ఉంటుందా. అలాంటిదే ఈ ఉదాహరణ. 1991లో సత్య రాజ్ హీరోగా తమిళంలో బ్రహ్మ అనే సినిమా వచ్చింది. ఖుష్బూ, భానుప్రియ హీరోయిన్లుగా కె సుభాష్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సూపర్ హిట్ కొట్టింది. రజనీకాంత్ దళపతి, కమల్ హాసన్ గుణలతో పోటీ పడి మెప్పించిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ. చిన్నప్పటి ఫోటోలతో వాళ్ళు పెద్దయ్యాక ఎలా ఉంటారన్న అంచనాతో ఖచ్చితంగా బొమ్మ వేసిచ్చే చిత్రకారుడు హీరో బ్రహ్మ.

ఆస్తి కోసం విలన్లు వెతుకుతున్న హీరోయిన్ స్కెచ్ ని ఇతను వేసిస్తాడు. నిజంగా బొమ్మ గీస్తే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని గుర్తించి విమాన ప్రయాణంలో చనిపోయిన తన భార్య ఫోటో ఆధారంగా వాళ్లకు తప్పుడు చార్టు ఇస్తాడు. కానీ అతని భార్య బ్రతికే ఉంటుంది. దాంతో పాటు చిన్నప్పుడు తనను చేరదీసి పెద్దవాడిని చేసిన గొప్ప వ్యక్తి కూతురే విలన్లు వెతుకుతున్న అమ్మాయని తెలుస్తుంది. దీంతో బ్రహ్మ ఇద్దరి ప్రాణాలను కాపాడే బాధ్యత పడుతుంది. అది ఎలా చేశాడన్నదే అసలు స్టోరీ. అరవంలో దీని సక్సెస్ చూసిన మోహన్ బాబు ఆలస్యం చేయకుండా రీమేక్ హక్కులు కొనేశారు. అప్పటికే అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాంలాంటి రీమేక్ హిట్లతో హ్యాట్రిక్ కొట్టి ఉన్నారు. దర్శకుడిగా బి గోపాల్ ను తీసుకున్నారు. మాస్ కి కిక్కిచ్చే పాటలిస్తారని పేరున్న బప్పీలహరిని సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ రచన చేశారు.

మెయిన్ హీరోయిన్ గా ఐశ్వర్యను తీసుకోగా కీలకమైన ఇంకో కథానాయికగా శిల్పా శిరోద్కర్ ను ఎంచుకున్నారు. ఈవిడ మాజీ హీరోయిన్, మహేష్ బాబు భార్య నమ్రతాకు స్వయానా స్వంత అక్కయ్య. ఊహించినట్టే బ్రహ్మ ఇక్కడా విజయవంతమయ్యింది. ఒరిజినల్ ట్యూన్స్ తీసుకోకుండా బప్పీలహరి స్వంతంగా కంపోజ్ చేసిన ముసిముసినవ్వులలోనా పాట బ్లాక్ బస్టర్ అయ్యింది. మిగిలిన సాంగ్స్ కూడా మాస్ కి ఓ రేంజ్ లో ఎక్కేశాయి. సినిమా మరీ ఇండస్ట్రీ హిట్ కాదు కానీ దానికి పెట్టిన బడ్జెట్ కి మోహన్ బాబు ఇమేజ్ కి మ్యాచ్ అయ్యేలా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. బయ్యర్లు కూడా హ్యాపీనే. కలెక్షన్ కింగ్ బ్రాండ్ కు తగ్గట్టు కొన్ని సెంటర్లలో వంద రోజులు కూడా ఆడింది. కాకపోతే అసెంబ్లీ రౌడీ స్థాయిని మాత్రం చేరలేకపోయింది.