iDreamPost
iDreamPost
వ్యవసాయ చట్టాల సవరణతో మొదలయిన మంట మరింత రాజుకుంటుంది. ప్రస్తుతం అది దేశ రాజధానిని తాకింది. పంజాబ్, హర్యాన తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చిన క్రమంలో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసిన మోదీ సర్కారుకి తలబొప్పి కొట్టింది. రైతులు వెనకడుగు వేయకుండా భీష్మించుకుని కూర్చోవడంతో చివరకు ప్రభుత్వమే తగ్గాల్సి వచ్చింది. ఢిల్లీలో అడుగుపెట్టేందుకు రైతులకు అనుమతివ్వాల్సి వచ్చింది. ఈ సందర్భంగా సాగిన వ్యవహారాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా రైతులను అణచివేసేందుకు ఆర్మీని కూడా రంగంలో దింపినప్పటికీ , అన్ని అడ్డంకులను అధిగమించిన వేలమంది రైతులు ఢిల్లీ వీధుల్లో భారీ ప్రదర్శనకు దిగడం దేశమంతా చర్చకు దారితీసింది.
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేసి ఐదేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ దేశవ్యాప్తంగా దానికి భిన్నమైన పరిస్థితులున్నాయన్నది కాదనలేని సత్యం. ఈ పరిస్థితుల్లోనే గడచిని ఏడేళ్లలో రైతు ఉద్యమాలు తీవ్రమయ్యాయి. దేశమంతటా ప్రభావితం చేసే స్థాయిలో పోరాటాలు సాగుతున్నాయి. గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత ఉధృతంగా కిసాన్ ఉద్యమం సాగుతున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. తొలుత తమిళనాడు రైతులు కొందరు ఢిల్లీ వేదికగా రోజుల తరబడి పోరాటం చేశారు. ఆ సందర్భంగా ప్రభుత్వ వైఖరి మీద రైతు సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి.
ఆ తర్వాత మహారాష్ట్ర రైతుల లాంగ్ మార్చ్ ప్రపంచం దృష్టి ఆకర్షించింది. మారుమూల ప్రాంతాల నుంచి కాలినడకన ఆర్థిక రాజధానికి క్యూ కట్టిన లక్షలాది రైతుల విషయం వారి దుస్థితిని చాటింది. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా వేల కిలోమీటర్లు సాగిన వారి పయనం చాలామందిని కదలించింది. చివరకు ముంబైలోని సాధారణ కార్మికులంతా వారికి అండగా నిలిచారు. ప్రభుత్వం అప్పట్లో ఆటంకాలు పెట్టాలని చూసినా వారికి ముంబై స్వాగతం పలికిన తీరు విశేషంగా మారింది. ఆ తర్వాత రాజస్తాన్ లో కూడా రైతులు తీవ్రస్థాయిలో పోరాటాలు చేశారు.
ఇలాంటి ఉద్యమాలు సాగిన మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలాయి. తాజాగా పంజాబ్ తో పాటుగా హర్యానా, యూపీ రైతులు కూడా చేతులు కలుపుతున్న నేపథ్యంలో వ్యవసాయ చట్టాల సవరణ వ్యవహారం పెద్ద సమస్యగా మారుతున్నట్టు కనిపిస్తోంది. కేంద్రం తక్షణం ఉపశమనం కోసం చర్యలు తీసుకోని పక్షంలో బీజేపీ హవాకి అడ్డుకట్టవేసే పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. ఇటీవల బీహార్ ఎన్నికల్లో బోటబోటీ మెజార్టీతో ఎన్డీయే గట్టెక్కింది. కానీ భవిష్యత్తులో రైతు సమస్యల పట్ల కేంద్రం మొండిగా వ్యవహరిస్తే రాజకీయంగా దానికి ప్రతిఫలం చెల్లించే పరిస్థితులు వస్తాయని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా కీలక రాష్ట్రాల ఎన్నికల ముంగిట బీజేపీకి తాజా రైతు ఉద్యమం తలనొప్పిని తీసుకువచ్చే ప్రమాదం ఉందని అంచనాకు వస్తున్నారు.
రైతుల సమస్యలను ఎజెండాలోకి రాకుండా ఇతర భావోద్వేగ అంశాలతో నెట్టుకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఇలాంటి సుదీర్ఘ ఉద్యమాల ప్రభావం చెరిపివేయడం అంత సులువు కాదు. దాని కారణంగా కేవలం ఆయా ఉద్యమ రైతులే కాకుండా ఇతరులకు కూడా ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం కలుగుతుంది. అందుకే వ్యవసాయ చట్టాల సవరణ అంశంలో కేంద్రం పునరాలో చన చేయాలనే డిమాండ్ పలు రాష్ట్రాల బీజేపీ నేతల నుంచి కూడా మొదలయ్యాయి. మరి మోదీ తన మొండితనం కొనసాగిస్తారా లేక రైతులకు ఏదో మేరకు సంతృప్తి కలిగించే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి. ఏమయినా దేశ రాజధానిలో రైతు ఉద్యమం సాగుతున్న తీరు మాత్రం భవిష్యత్ పోరాటాలకు సంకేతంగా నిలుస్తోంది.