కరోనా పరీక్షలకు కూడా రాజకీయ రంగు పులుముకుంటోంది. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద కొందరు రాజకీయ నాయకులు ఉండి హడావిడి చేస్తుండడం చాలా చోట్ల జరుగుతున్న తంతే. అయితే చిన్న ఫ్లెక్సీ వివాదం చినికి చినికి గాలివానలా మారింది. కరోనా పరీక్షల నిర్ధారణ కోసం ప్రభుత్వం మొబైల్ కరోనా టెస్టింగ్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. అది హుమాయిన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పోచమ్మ బస్తీకి చేరుకుంది. అక్కడకు వచ్చిన ఆ వాహనంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తుల ఫ్లెక్సీలు ఉన్నాయి. ఆ వాహనం వచ్చి పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతుండగా దానిపై ఉన్న ఆ ఫ్లెక్సీని స్థానిక మజ్లిస్ పార్టీకి చెందిన గుర్తించారు. దాన్ని తొలగించేందుకు యత్నించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకుని ఆ ఫ్లెక్సీని మళ్లీ కట్టే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తల మధ్య వివాదం మొదలైంది. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది.
రంగంలోకి పోలీసులు
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ భారీ ఎత్తున ఉన్న ఇరు పార్టీల వారిని చెల్లాచెదురు చేశారు. అనంతరం ఆయా పార్టీల నేతలతో ఇన్ స్పెక్టర్ సునీల్ కుమార్ చర్చించారు. కరోనా మొబైల్ టెస్టింగ్ వాహనంపై ఎలాంటి ఫ్లెక్సీలూ లేకుండా చర్యలు చేపట్టారు. కరోనా పరీక్షలు మొదలయ్యేలా చేశారు. అప్పటికే పరీక్షల కోసం వేచి చూస్తున్న ప్రజలందరూ హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి వరకూ ఆ ప్రాంతంలో జరిగిన ఘర్షణ వాతావరణానికి కాస్త ఆందోళన చెందారు. వీరి రాజకీయ గొడవల కారణంగా పరీక్షల నిర్వహణ ఆలస్యంగా ప్రారంభం కావడంపై అసహనం వ్యక్తం చేశారు.