iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ మరో క్షీరవిప్లవానికి అడుగులు వేస్తోంది. గుజరాత్ లో సహకారం రంగంలో సంచలనం సృష్టించిన అమూల్ సంస్థ ఇప్పటికే దానికి అనుగుణంగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుని కార్యక్షేత్రంలో కాలుపెట్టింది. ఈనెల 20 నుంచే మూడు జిల్లాల్లో పాలసేకరణ ప్రారంభం కాబోతోంది. ఇది ఆంధ్రప్రదేశ్ లో సుదీర్ఘ చరిత్ర కలిగిన పాల ఉత్పత్తి రంగంలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టూ అవకాశం కనిపిస్తోంది. తొలినాళ్లలో ప్రభుత్వ డెయిరీలు, తర్వాత సహకార డెయిరీలు, చివరకు ప్రస్తుతం హెరిటేజ్ వంటి ప్రైవేటు డెయిరీల ప్రభావం సాగిన రాష్ట్రంలో త్వరలో మళ్లీ పాత రోజులకు ఆస్కారం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. పాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా మళ్లీ సహకార డెయిరీలో పూర్వ వైభవం సాధించగలవనే ఆశావాహ వాతావరణం కనిపిస్తోంది.
పాడి పరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పన కోసం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రూ .1,362 కోట్లు కేటాయించింది. అందులో రూ.500 కోట్లతో 9,899 బల్క్ మిల్క్ చిల్లింగ్ (బీఎంసీ) యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీఎంసీలు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పాల ఉత్పత్తిదారులకు పలు ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు. ఈ బీఎంసీలలో తొలిదశలో 2,774, రెండోదశలో 3,639, మూడోదశలో 3,486 బీఎంసీ యూనిట్లను సిద్ధం చేయాలని ప్రణాళిక వేశారు.
అంతేగాకుండా కొత్తగా 7,125 పాల సేకరణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం రోజుకు 70 లక్షల లీటర్ల పాలసేకరణ డెయిరీల ద్వారా జరుగుతుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మొత్తం పాల ఉత్పత్తిలో ఇది కేవలం 26 శాతం మాత్రమే. సహకార డెయిరీల వ్యవస్థ నిర్వీర్యం కావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. పాల రైతులకు భరోసా లేకుండా పోయింది. దాంతో ఈ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టే దిశలో ప్రభుత్వం సన్నాహాలు చస్తోంది. అందుకు అనుగుణంగా అమూల్ తో చేసుకున్న ఒప్పందం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. తొలుత చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో అమూల్ పాల సేకరణ చేస్తుంది. ఆర్బీకేలను కూడా అందుకు వినియోగించబోతున్నారు. సీఎం చేతుల మీదుగా ఈ పాల సేకరణ ప్రారంభం కాబోతోంది.
మొత్తం ఎనిమిది జిల్లాలలో పాల సేకరణకు అమూల్ సన్నాహాలు చేసింది. అందులో ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాలున్నాయి. తొలుత ఈనెల 20 నుంచి ప్రయోగాత్మకంగా ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో పాలసేకరణ మొదలు కాబోతోంది. రోజుకు 2 కోట్ల లీటర్ల పాలు సేకరించేందుకు అమూల్ లక్ష్యంగా నిర్దేశించింది. అదే జరిగితే పాల రైతులకు ధర విషయంలో ధీమా దక్కుతుందని అంతా ఆశిస్తున్నారు.