మొజాంబిక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఘోర దమనకాండకు పాల్పడ్డారు. 50 మంది గ్రామస్తులను ఒక ఫుట్‌బాల్ మైదానంలో శిరచ్చేదనం చేశారు. తీవ్ర సంచలనం కలిగించిన ఈ సంఘటన ఉత్తర మొజాంబిక్‌లోని కాబో డెల్గాడో ప్రావిన్స్‌లో జరిగింది.
కొంతమంది ముష్కరులు ఒక గ్రామంపై దాడి చేసి,పురుషులను బంధించడంతో పాటు కొంతమంది మహిళలను అపహరించినప్పుడు ‘అల్లాహు అక్బర్’ అని నినాదాలు చేశారని, స్థానికులు వెల్లడించారు. అంతేకాకుండా నంజాబా గ్రామంపై దాడి చేసి గ్రామస్తులను దోచుకోవడంతో పాటు ఇళ్లకు నిప్పంటించారు. సమీపంలో ఉన్న ఫుట్‌బాల్ మైదానంలో 50 మంది తలలను కిరాతకంగా నరకడంతో పాటు మృతదేహాలను ముక్కలుగా నరికి అడవుల్లో చెల్లాచెదురుగా విసిరేశారు.
ఖలీఫా రాజ్యాన్ని స్థాపించే దిశగా ప్రయత్నిస్తున్న ఉగ్రవాదులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని పలువురు భావిస్తున్నారు. మృతదేహాలను చెల్లాచెదురుగా విసిరేయడంతో అక్కడి అటవీప్రాంతం భీతావహంగా మారింది. 2017 నుండి కాబో డెల్గాడో ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో సుమారు 2000 మందికి పైగా మృతిచెందగా 400,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతంలో ఇస్లామిక్ పాలనను స్థాపించడానికి వారి పోరాటంలో యువతను నియమించడానికి ఉగ్రవాదులు పేదరికం మరియు నిరుద్యోగాన్ని సాధనాలుగా ఉపయోగించుకుంటుంది. పేదరికం నిరుద్యోగం కారణంగా పలువురు యువకులు ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారు.