రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారంలోకి రావడం. అందుకోసం ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తుంటాయి. అధికారంలోకి వచ్చాక వాటిని తూచా తప్పకుండా అమలుచేసే పార్టీలు కొన్నే ఉంటాయి. అధిక శాతం పార్టీలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా.. తమ వ్యక్తిగత ప్రచారం, ఇతర స్వార్థ ప్రయోజనాలకే తాపాత్రయపడుతుంటాయి. దాంతో తర్వాతి ఎన్నికల్లో ప్రజా మద్దతు పొందలేక అధికారం ముంగిట చతికిల పడుతుంటాయి. దీనికి నిన్న మొన్నటి ఉదాహరణ మనరాష్ట్రంలోని చంద్రబాబు సర్కారు.
ఇంకాస్త వెనక్కి వెళ్లి రాష్ట్రం వెలుపలికి తొంగి చూస్తే ఉత్తరప్రదేశ్ లో మాయావతి నేతృత్వంలో గతంలో ఏర్పాటైన బీఎస్పీ ప్రభుత్వం కూడా అదే పరాభావాన్ని ఎదుర్కొంది. తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరమైంది. అయితే మరో ఆరు నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో.. బీఎస్పీ అధినేత్రి మాయావతి నేను మారిపోయాను నమ్మండి..మళ్లీ అధికారం ఇవ్వండి అని ప్రజలను కోరుతున్నారు. గతంలో చేసిన తప్పులు మళ్లీ చేయనని బహిరంగంగానే చెబుతున్నారు.
Also Read : కోర్టు వివాదాలు తీర్చే శ్రీలక్ష్మి నారసింహుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?
అధికార దర్పంతో ప్రజలకు దూరం..
బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షురాలిగా యూపీలో నాలుగుసార్లు మాయావతి అధికార పగ్గాలు చేపట్టారు. 1995లో మొదటిసారి సీఎం అయిన ఆమె కేవలం నాలుగున్నర నెలలే అధికారంలో ఉన్నారు. తర్వాత 1997లో 5 నెలలు, 2002-03 సంవత్సరాల్లో సుమారు పది నెలలు అధికారంలో కొనసాగి రాజకీయ పరిణామాల కారణంగా పదవి కోల్పోయారు. అయితే బహుజనుల పార్టీగా ముద్ర పడిన బీఎస్పీ ని ఆ ముద్ర నుంచి తప్పించి బ్రహ్మణులతో సహా పలు ఇతర కులాలను ఆకట్టుకొని సోషల్ ఇంజినీరింగుతో 2007లో సొంతంగా పూర్తి స్థాయిలో అధికార పగ్గాలు చేపట్టడమే కాకుండా ఐదేళ్ల పూర్తి పదవీకాలం సీఎం కొనసాగారు.
అయితే తర్వాత దాన్ని కాపాడుకోవడంలో విఫలం అయ్యారు. అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రచార ఆర్భాటాలు, ప్రజలకు పెద్దగా ఉపయోగపడని కార్యక్రమాలపై శ్రద్ధ చూపారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా పార్కులు నిర్మించడంతోపాటు తమ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం, ఎన్నికల గుర్తు ఏనుగు విగ్రహాలతో రాష్ట్రాన్ని నింపేశారు. రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఇవే కనిపించేవి. అలాగే రౌడీలు, మాఫియా ముఠాలను చేరదీసి ప్రత్యర్థులను టార్గెట్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో చేరువై ఓట్లతో ఆదరించిన బ్రాహ్మణులను, ఇతర అగ్రవర్ణాలను పట్టించుకోవడం మానేశారు. ఇవన్నీ కలిసి 2012 ఎన్నికల్లో మాయావతి ప్రభుత్వాన్ని కూలదోశాయి. 2017 ఎన్నికల్లోనూ ఆమె ప్రజల విశ్వాసం పొందలేకపోయారు.
Also Read : వచ్చే నెలలో బ్రేకప్ ఖాయమా, యూపీ ఎన్నికల వరకూ ఆగుతారా
ప్రజా విశ్వాసం పొందడానికి పాట్లు..
ఈ అనుభవాల పాఠంతో ఆరు నెలల్లో జరిగే ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకునేందుకు మాయావతి ఇప్పటి నుంచే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెసుల మధ్య చతుర్ముఖ పోటీ జరగనుంది. దాంతో విజయం అంత తేలిక కాదని గుర్తించిన మాయావతి అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను స్వయంగా గుర్తు చేస్తూ.. వాటిని పునరావృతం చేయనని ఓటర్లకు బహిరంగంగా హామీ ఇస్తున్నారు. ప్రజాపయోగ కార్యక్రమాలు తప్ప పార్కులు, విగ్రహాల జోలికి పోనని ఆ మధ్య ప్రకటించారు. అలాగే ఎన్నికల్లో రౌడీలు, మాఫియా నేతలకు టికెట్లు ఇచ్చేదిలేదని స్పష్టం చేశారు. తన మాటలపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు కొన్ని చర్యలు కూడా ప్రారంభించారు. జైలుకు వెళ్లివచ్చిన తమ పార్టీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీకి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చేదిలేదని స్పష్టం చేయడంతోపాటు అన్సారీ నియోజకవర్గమైన మౌ అసెంబ్లీ స్థానానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు భీమ్ రాజ్ భర్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు.
ఒకప్పుడు తనను ఆదరించి తర్వాత దూరమైన బ్రహ్మణ వర్గాన్ని మళ్లీ ఆకట్టుకునేందుకు మాయావతి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జూలై నుంచే బ్రాహ్మణ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. మాయావతి సన్నిహితుడు, రాజ్యసభ సభ్యుడైన సతీష్ చంద్ర మిశ్రా వీటిని పర్యవేక్షిస్తున్నారు. బీజేపీ, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కూడా యూపీలో విజయానికి ఇప్పటినుంచే శక్తియుక్తులన్నింటినీ ఉపయోగిస్తుండటంతో మాయావతి ఎంతవరకు సఫలం అవుతారన్నది చెప్పలేని పరిస్థితి.
Also Read : మమతా బెనర్జి ఇటలీ వెళ్లేందుకు ఉన్న అడ్డంకులు ఏమిటి..? కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు..?