Idream media
Idream media
1973-74, రాయలసీమ భూములు వానలతో కాకుండా రైతుల కన్నీళ్లతో తడుస్తున్న రోజులు.
ఒక వైపు ఫ్యాక్షన్, ఇంకోవైపు కరవు. నిరాశ నిస్పృహల కాలం. పెట్టుబడి కూడా రాని సాధ్యం, తిండికి, బట్టకు సన్న రైతులు మొహం వాచిన కాలం. వరిబువ్వని అపురూపంగా తినేరోజులు. సరిగ్గా అప్పుడొచ్చింది మట్కా.
రూపాయికి 80 రూపాయలంటే ఆశ పుట్టింది. 100 నెంబర్లలో ఒక నెంబర్ తగలడం చాలా కష్టమనే లాజిక్ మిస్ అయింది. ఆశ ఉండేచోట లాజిక్ ఉండదు.
రాయదుర్గం, ధర్మవరం, గుంతకల్లు, ప్రొద్దుటూర్లకి ఫస్ట్ పాకింది. తర్వాత మొత్తం అల్లుకుంది. సీమ ప్రాంతానికంతా బళ్లారి హెడ్ క్వార్టర్. చోటామోటా నాయకులంతా మట్కా కంపెనీలు పెట్టారు. అప్పటికి రాజకీయ నాయకులు పూర్తిగా చెడిపోలేదు. వాళ్లకి డైరెక్ట్‌గా వాటాలు రాకపోయినా అనుచరులని చూసీచూడనట్టు వదిలేశారు.
మట్కా కంపెనీతో సౌలభ్యం ఏమంటే దీనికి ఏ పర్మీషన్లు అక్కర్లేదు ( ఆరోజుల్లో ఎవడైనా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టాలంటే పర్మిట్లు పేరుతో చంపుకు తినేవాళ్లు).
ఒక ఆఫీస్ , నాలుగు కుర్చీలు , తెల్ల కాగితాలు, ఇద్దరు గుమాస్తాలు చాలు. చేతి కింద పది మంది బీటర్లు ఉంటే, నాలుగైదు వేలు కలెక్షన్ వస్తుంది. దాంట్లో పది శాతం కమీషన్ వాళ్లకి. తెల్లారితే నెంబర్ మీద పేమెంట్ ఎంత పోయినా ఒక వెయ్యి మిగులుతుంది. ఎపుడో తప్ప చేతి నుంచి పడదు. ఖర్చులన్నీ పోనూ నెలకి 15 నుంచి 20 వేలు మిగులుతుంది. 74లో 30 ఎకరాలకి పైగా ఉన్న భూస్వామి కూడా సంవత్సరానికి 20 వేలు వచ్చేది కాదు.
పోలీసుల గురించి చెప్పాలంటే ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ ముడుపులు లేవు. పేకాట క్లబ్బుల నుంచి ఎంతో కొంత వచ్చేది. మద్యం షాపులు, బార్లు లేని రోజులు. ఉన్నా పెద్దగా మామూళ్లు రావు. సీమలో ఫ్యాక్షన్ కొట్లాటలు జరిగితేనే అంతోఇంతో ఆదాయం. కానిస్టేబుళ్లంతా సైకిళ్లపై తిరిగే రోజులు.
కల్పవృక్షంలా మట్కా వచ్చింది. నెలనెలా ఫిక్స్‌డ్ మామూళ్లు. రోడ్డు మీద బాహాటంగా మట్కా చీటీలు రాసినా అడిగేవాళ్లు లేరు.
అంటు వ్యాధిలా ఇది గ్రామాలకు వ్యాపించింది. పల్లెల్లో మట్కా బీటర్లు వెలిశారు. రైతుల పాలడబ్బు, నెయ్యి డబ్బు మట్కా చీటీలుగా మారింది. ఎవడో ఒకడికి తగులుతుంది. దాన్ని చూసి అందరికీ ఆశ.
గ్రామాల్లోకి మట్కా చార్టులు ప్రవేశించాయి. ఎవరి లెక్కలు వాళ్లు వేశారు. సాయంత్రానికి డబ్బు కావాలి. పేద పల్లెల్లో రోజూ డబ్బులెక్కడి నుంచి వస్తాయి? అప్పులు మొదలయ్యాయి.
జూదంలో ఉన్న ఆవేశం ఏమంటే డబ్బులు పోతూ ఉంటే ఇంకా కసి పెరుగుతుంది. అప్పులు పెరుగుతాయి. సంతలో పాడి అవులు అమ్మడం ప్రారంభమై , భూములమ్మి ఊళ్లు వదిలేసే వరకు వచ్చింది.
విధ్వంసం సృష్టించిన ఈ జూదం అమాయక రైతుల్ని తినేసింది. పేదరికం పెరిగి , ఆ ఫ్రస్ట్రేషన్‌తో ఊళ్లలో కొట్టుకున్నారు. ఆల్రెడీ ఉన్న ఫ్యాక్షన్‌కి ఈ మట్కా తోడైంది.
మట్కా వల్ల కొందరు భార్యాబిడ్డల్ని వదిలి రాత్రికి రాత్రే పరారయ్యారు. చీనీ కాయలు కాయాల్సిన చెట్లకి మనుషులు శవాలుగా వేలాడారు. పురుగులకి కొట్టాల్సిన మందుని , నోట్లో పోసుకున్నారు.
ఇంత జరిగినా నాయకులెవరూ పట్టించుకోలేదు. ఎమర్జెన్సీలో కొంత కాలం సర్దుమనిగింది. ఆ తర్వాత మళ్లీ మొదలైంది. ఈ సారి తాడిపత్రి, డోన్, ప్రొద్దుటూరు మట్కా హెడ్ క్వార్టర్స్‌గా మారాయి.
తాడిపత్రిలో చాలా కాలం రాజ్యమేలింది. ఎవరి కనుసన్నల్లో నడిచిందో అందరికీ తెలుసు. ప్రజల్ని కాపాడాల్సిన వాళ్లే జూదం ఆడించి దివాళా తీయించారు.
కరువుని మించి పీడించిన మట్కా ఇపుడు దాదాపుగా అంతరించి పోయింది. కానీ దాని ఇనుప పాదాల కింద నలిగిపోయి ఆ బాధని మోస్తున్న కుటుంబాలు ఇప్పటికీ ఉన్నాయి.
మట్కా కంపెనీల డబ్బుతో చాలా మంది నాయకులయ్యారు. చట్టసభల్లో కూచుని ప్రజలతో జూదం ఆడుతున్నారు. తెలివైన వాళ్లు తమ తెలివిని మంచి పనులకి ఎప్పుడూ వాడరు. దీనికి రతన్ ఖత్రీనే ఉదాహరణ!