iDreamPost
android-app
ios-app

‘మేజర్’గా అన్నగారి విశ్వరూపం – Nostalgia

  • Published Apr 24, 2021 | 11:00 AM Updated Updated Apr 24, 2021 | 11:00 AM
‘మేజర్’గా అన్నగారి విశ్వరూపం – Nostalgia

స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటూ పోతే గంటలు రోజులు చాలవనే మాటలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పి కోట్లాది అభిమానుల గుండెల్లో ఇలవేల్పుగా పూజింపబడిన ఎన్టీఆర్ అనే మూడక్షరాలు ఇప్పటికీ ఎందరికో తారకమంత్రాలు. 1983లో రాజకీయాల్లోకి ప్రవేశించి తెలుగుదేశం పార్టీని స్థాపించి రికార్డు వ్యవధిలో ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాక ఎన్టీఆర్ కు సినిమాలు చేసేంత వ్యవధి తీరిక లేకపోయింది. ఫ్యాన్స్ పలుమార్లు ఒత్తిడి చేసినా ప్రజాసేవకు అంకితమైన ఆయనకు ఓ ఏడేళ్ల దాకా ఆ తలపే రాలేదు. అప్పటికే బాలయ్య స్టార్ గా సెటిల్ కావడం కూడా ఒక కారణం అనొచ్చు.

1990లో ఎన్టీఆర్ మళ్ళీ మేకప్ వేసుకుని తన చిరకాల వాంఛగా మిగిలిపోయిన కథలను సినిమాలుగా తీయాలని నిర్ణయించుకుని బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోకలు భారీ బడ్జెట్ తో తీశారు. కానీ కాలానుగుణంగా వచ్చిన మార్పులను పసిగట్టలేక పాత తరహాలో తీయడంతో పాటు లేటు వయసులో నప్పని పాత్రలు చేయడంతో అవి కాస్తా డిజాస్టర్ అయ్యాయి. ఆ సమయంలోనే బసవతారకం ఆసుపత్రి బిల్డింగ్ నిధుల కోసం ఒక కమర్షియల్ సినిమా చేయాలనే కోరిక ఎన్టీఆర్ కు బలంగా ఉండేది. ఆ అవకాశం తనకే ఇమ్మని అన్నగారికి బాగా సన్నిహితంగా ఉండే మోహన్ బాబు అడగటంతో ఆయన కాదనలేకపోయారు. పరుచూరి బ్రదర్స్ రచన చేయగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992 నవంబర్ లో షూటింగ్ మొదలయ్యింది. అదే మేజర్ చంద్రకాంత్

చాలా గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సాంఘిక చిత్రం కావడంతో దర్శకేంద్రుడు అన్ని అంశాల్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంఎం కీరవాణితో అద్భుతమైన పాటలు కంపోజ్ చేయించారు. పరుచూరి సోదరులు సంభాషణలు తూటాల్లా రాశారు . బడ్జెట్ విషయంలో రాజీ పడలేదు. క్యాస్టింగ్ చాలా భారీగా కుదిరింది. మోహన్ బాబుకు సైతం మంచి పాత్రను డిజైన్ చేసి నగ్మా, రమ్యకృష్ణలను హీరోయిన్లుగా లాక్ చేశారు. జాలాది రచించిన పుణ్యభూమి నా దేశం పాటలో కట్టబొమ్మన, అల్లూరి, శివాజీ తదితర గెటప్స్ లో ఎన్టీఆర్ ని  చూసి అభిమానులు వెర్రెత్తిపోయారు. 1993 ఏప్రిల్ 23న మేజర్ చంద్రకాంత్ భారీ ఎత్తున విడుదలైన బ్లాక్ బస్టర్ అందుకుంది. ఒక్కరోజు ముందు రిలీజైన గాయం కూడా ఈ సినిమాతో పోటీపడి ఘన విజయం సొంతం చేసుకోవడం విశేషం